Gold fraud: బయటపడిన.. ‘బంగారం’ బండారం
ABN , Publish Date - Jul 18 , 2025 | 12:04 AM
Illegal gold trade Smuggling వినియోగదారు లను నమ్మించేలా.. నిజాయితీగా వ్యాపారం చేస్తున్నట్టు ప్రక టనలు.. చేసేవన్నీ అక్రమాలు. ఇదీ నరసన్నపేటలోని కొంత మంది బంగారం దుకాణాల వ్యాపారుల తీరు. గురువారం నరసన్నపేటలో ఓ బంగారం దుకాణంలో బ్యూరో ఆఫ్ ఇండి యన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు దాడులు చేసి.. హాల్ మార్క్ లేని ఆభరణాలు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. సుమారు కేజీకిపైగా ఆభరణాలు సీజ్ చేశారు.
హాల్‌మార్క్ లేకుండానే విక్రయాలు
అనుమతి ఒకచోట.. దుకాణం నిర్వహణ మరో దగ్గర
నరసన్నపేటలో బీఐఎస్ అధికారుల తనిఖీలు
1072.45 గ్రాముల ఆభరణాలు సీజ్
బోగస్ హాల్‌మార్క్ కేంద్రం గుర్తింపు
నరసన్నపేట, జూలై 17(ఆంధ్రజ్యోతి): వినియోగదారు లను నమ్మించేలా.. నిజాయితీగా వ్యాపారం చేస్తున్నట్టు ప్రక టనలు.. చేసేవన్నీ అక్రమాలు. ఇదీ నరసన్నపేటలోని కొంత మంది బంగారం దుకాణాల వ్యాపారుల తీరు. గురువారం నరసన్నపేటలో ఓ బంగారం దుకాణంలో బ్యూరో ఆఫ్ ఇండి యన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు దాడులు చేసి.. హాల్ మార్క్ లేని ఆభరణాలు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. సుమారు కేజీకిపైగా ఆభరణాలు సీజ్ చేశారు. అలాగే బోగస్ హాల్‌మార్క్ కేంద్రాన్ని కూడా గుర్తించి.. బంగారం ఆభరణాల విక్రయాల్లో బండారాన్ని బయటపెట్టారు. వివరాల్లోకి వెళితే..
నరసన్నపేటలోని మారుతీనగర్ జంక్షన్ వద్ద జీఎన్‌ఆర్(గుడ్ల నాగరాజు) గోల్డ్ అండ్ డైమండ్ జ్యూయలరీ షాపులో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సంస్థ (విజయవాడ జోన్) జాయింట్ డైరెక్టర్ టి.అర్జున్ ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు చేశారు. షాపులో హాల్‌మార్కు లేకుండా 1072.450 గ్రాముల బంగారం ఆభరణాలు విక్రయానికి సిద్ధంగా ఉంచినట్టు గుర్తించారు. ప్రభుత్వం నుంచి జీఎన్‌ఆర్ బులియన్ అండ్ హాల్‌సేల్ పేరుతో అనుమతి తీసుకుని, మార్కెట్‌లో మాత్రం గోల్డ్ అండ్ డైమండ్ పేరుతో వ్యాపార బోర్డులను ఏర్పాటు చేయడంపై అధికారులు ఆరా తీశారు. షాపులో కొన్ని బంగారం ఆభరణాలపై డమ్మీ నెంబర్లు (ఇతర ఐడీ నెంబరు)తో ఉన్న హాల్‌మార్క్ ఉన్నట్లు గుర్తించారు. ఆ హాల్‌మార్క్ ముద్రించే కేంద్రం కోసం ఆరా తీశారు. నరసన్నపేట గాంధీబజారుకు సమీపంలో మేడ మీద అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ హస్య హాల్‌మార్క్ టెస్టింగ్ కేంద్రంలో ఈ అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించారు. ఇక్కడ నకిలీ హాల్‌మార్క్‌లను ముద్రిస్తున్నట్టు తెలుసుకున్నారు. పలు జ్యాయలరీ షాపుల్లో ముద్రించే ఐడీ నెంబర్లను ఈ కేంద్రంలో మళ్లీ ముద్రిస్తూ.. ప్రత్యేకంగా హాల్‌మార్క్ ముద్రలు వేసినట్లు గుర్తించారు.
నాణ్యత గల బంగారు ఆభరణాలకు.. కేంద్ర ప్రభుత్వం హెచ్‌యూఐడీ నెంబరు జారీ చేసి షాపు పేరుతో హాల్‌మార్కు ఇస్తుంది. వీటిని జ్యూయలరీ షాపుల యాజమానులు తాము విక్రయించే ఆభరణాలపై ముద్రించాలి. కానీ జీఎన్‌ఆర్ షాపులో ఎటువంటి హాల్‌మార్కు లేకుండా ఉన్న ఆభరణాలను గుర్తించి సీజ్ చేశామని బీఐఎస్ జేడీ అర్జున్ తెలిపారు. ‘నరసన్నపేట మెయిన్‌రోడ్డులో ఈ షాపు నిర్వహణకు బీఐఎస్ నుంచి ఎటువంటి అనుమతులు లేనట్టు గుర్తించాం. జోగిపేటలో బంగారం షాపు నిర్వహిస్తున్నట్లు అనుమతి తీసుకుని ప్రాంతాన్ని మార్చడంపై కూడా శాఖపరంగా చర్యలు తీసుకుంటాం. షాపు యజమానికి ఆభరణాల సీజింగ్ నోటీసు అందజేశామ’ని ఆయన తెలిపారు. హాల్‌మార్క్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. దాడుల్లో బీఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ వివేకవర్ధన్‌రెడ్డి, నరసన్నపేట పోలీసులు పాల్గొన్నారు.