గణితంలో ఘనులు
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:46 AM
గణితమంటే అంకెల గారడీ కాదు. సంఖ్యల మేళవింపు అంతకంటే కాదు. అదొక మహాసముద్రం.
- నూతన ఆవిష్కరణల వైపు అడుగులు
- ప్రతిభ చాటుతున్న ఇప్పిలి పాఠశాల విద్యార్థులు
- కొత్త బోధన విధానాలు అవలంబిస్తోన్న ఉపాధ్యాయులు
- నేడు గణిత దినోత్సవం
నరసన్నపేట, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): గణితమంటే అంకెల గారడీ కాదు. సంఖ్యల మేళవింపు అంతకంటే కాదు. అదొక మహాసముద్రం. కిటుకు తెలిస్తే తక్షణమే విజయతీరాన్ని చేరవచ్చు. దీన్ని అవపోపన పట్టారు శ్రీకాకుళం నగరానికి సమీపంలో ఉన్న ఇప్పిలి ఉన్నత పాఠశాల విద్యార్థులు. అంకిత భావం, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. చిన్న వయస్సులోనే చిటికె వేసినంత సులువుగా లెక్కలు చేస్తోన్నారు. సోమవారం గణిత దినోత్సవం (గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి) సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి ’ప్రత్యేక కథనం
పాఠశాల ప్రాంగణమే గణిత పార్కు
ఇప్పిలి ఉన్నత పాఠశాలలో 800 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాల ప్రాంగణం చదువుల పార్కుగా దర్శనమిస్తోంది. ప్రతీ సబ్జెక్టును విద్యార్థులు సులభవంగా నేర్చుకునేలా పాఠశాల ప్రాంగణాన్ని తయారు చేశారు. ప్రధానంగా గణితంపై విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు రేఖాగణితం, జ్యామితి, త్రికోణమితి, సంఖ్యామానం ఇలా వివిధ ఆకారాలను ఈ పార్కులో ఏర్పాటు చేశారు. గణిత ఉపాధ్యాయుడు గురుగుబిల్లి ఢిల్లీశ్వరరావు చొరవతో 2019లో ప్రధానోపాఽధ్యాయులు, మిగతా ఉపాధ్యాయులంతా కలిసి గణిత పార్కును తీర్చిదిద్దారు. వృత్తం, వృత్తపరిధి, జ్యామితిలో వివిధ భాగాలను బోధన, భాగహారం, తీసివేత, కూడికలను ఆటరూపంలో నేర్చుకునేందుకు సిద్ధం చేశారు. సంఖ్యామానంలో వర్గాలు, వర్గమానం, తదితర విషయాలను అర్థమయ్యే విధంగా తీర్చిదిద్దారు. పాఠశాలలో ఈ ఏడాది గణిత వనంను కూడా ఏర్పాటు చేశారు.
గణితమంటే భయంవద్దు
గణితం అంటే విద్యార్థులకు భయానికి లోనవుతారు. కానీ భయపడాల్సిన సబ్జెక్టు ఏమీ కాదు. నేను బ్లాక్ బోర్డుపై సూత్రాలు వేసి సమస్యలను సాధించినప్పుడు అతికొద్ది మంది విద్యార్థులు మాత్రమే అర్థం చేసుకునేవారు. మిగతావారు అడగలేక విషయాలను దాటవేసేవారు. పరీక్షల్లో తక్కువగా మార్కులు వచ్చేవి. దీనిని ఏవిధంగా అధిగమించాలనే ఆలోచన ఫలితమే లెర్నింగ్ బై బూయింగ్ పద్ధతి. ఈ పద్ధతిలో సూత్రాలను నిరూపిస్తూ సమస్యల సాధనను వివరిస్తే విద్యార్థులు సులభరీతిలో అర్థం చేసుకోగలుగుతున్నారు. ఈ విధానంతో మంచి ఫలితాలు సాధిస్తున్నాం.
-గురుగుబిల్లి, ఢిల్లీశ్వరరావు, గణిత ఉపాధ్యాయుడు, ఇప్పిలి
బోధనలో దిట్ట మృత్యుంజయరావు
జిల్లాలో ఏ పాఠశాలలో పనిచేసినా ఆయన గణితం బోఽధించాలంటే బోధన ఉపకరణాలు ఉండాల్సిందే. విద్యార్థులకు తేలికంగా లెక్కలు అర్థమయ్యేందుకు వీలుగా పాఠశాలలో గణిత ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తారు. నిత్యజీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న గణిత బోధన ఉపకరణాలు తయారు చేస్తారు. జిల్లాస్థాయిలో ఎక్కడ ప్రదర్శనలు జరిగినా మృత్యంజయరావు బోధన విధానాలను మిగతా ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తాయి. సోషల్ వెల్పేర్ పాఠశాలలో ఆయన పనిచేస్తూ పదవీవిరమణ పొందారు. గణితంపై మక్కువతో ఇప్పటికీ బోధనకు అవసరమైన ఉపకరణాలు తయారు చేస్తూ గణితంపై విద్యార్థులకు భయం లేకుండా చేస్తున్నారు.
జాతీయ స్థాయి పోటీలకు సుబ్రహ్మణ్యం
గణిత ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం రాష్ట్రస్థాయిలో 8 సార్లు, జాతీయస్థాయి ప్రదర్శనల్లో మూడు సార్లు పాల్గొన్నారు. కరణీయ సంఖ్యలు, త్రికోణమితి తదితర అంశాలపై జిల్లాస్థాయిలో నిర్వహించిన ప్రాజెక్టుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయికి పలుమార్లు విద్యార్థులను తీసుకువెళ్లారు.
కొన్ని సెకన్లలోనే లెక్క చేస్తా
గణితంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఒకటి వేదగణితం. వేద గణితంలో ఐదు ప్రాథమిక నియమాలు ఉన్నాయి. వీటిలో మొదటిది నిఖిల సూత్రం, రెండవది గ్యారస్గుణ, మూడవది ఏకనునేన పూర్ణవే, నాల్గోది అంత్యోర్ధసకేపై సూత్రం, ఐదవది నవగుణ సూత్రం. ఈ సూత్రాల ఆధారంగా నేను గుణకారం, కూడిక, తీసివేత తదితర లెక్కలను కొన్ని సెకన్లలో పరిస్కరిస్తాను.
-ఎం.మనోజ్, విద్యార్థి
ఆట రూపంలో గణితం..
గణితం ఆటరూపంలో నేర్చుకునేందుకు ఎల్‌సీఎం, హెచ్‌సీఎం (కసాగు, గసాభా) ఎంతగానో ఉపయోగపడుతుంది. గణితశాస్త్రంలో రెండంకెల సంఖ్యల వర్గాన్ని అతితక్కువ సమయంలో సులభంగా కనుగోవచ్చు. ఉపాధ్యాయుల సూచనలతో గణితంలో రాణిస్తున్నా.
-పి.జయశంకర్, విద్యార్థి