Excise department: సొంతగూడు ఒక్కటీ లేదు
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:50 PM
Excise stations.. Rented buildings జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. జిల్లాలో 12 స్టేషన్లు ఉండగా, ఒక్కదానికీ సొంత భవనం లేదు. సీజ్ చేసిన వాహనాలు ఆరుబయటే ఉంచటంతో.. వాటికి భద్రత కరువవుతోంది.
అద్దె భవనాల్లో ఎక్సైజ్ స్టేషన్లు
జిల్లాలో 12 చోట్లా ఇదే పరిస్థితి..
సీజ్ చేసిన వాహనాలకు భద్రత కరువు
ఇచ్ఛాపురం, జూలై 22(ఆంద్రజ్యోతి): జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. జిల్లాలో 12 స్టేషన్లు ఉండగా, ఒక్కదానికీ సొంత భవనం లేదు. సీజ్ చేసిన వాహనాలు ఆరుబయటే ఉంచటంతో.. వాటికి భద్రత కరువవుతోంది. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, టెక్కలి, నరసన్నపేట, కోటబొమ్మాళి, ఆమదాలవలస, పాతపట్నం, కొత్తూరు, రణస్ధలం, పొందూరు, శ్రీకాకుళంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. చాలాచోట్ల శిఽథిలావస్థ భవనాల్లోనే స్టేషన్లు నిర్వహిస్తున్నారు. అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కార్యాలయాల్లో శ్లాబ్‌ల పెచ్చులూడిపోతున్నాయి. ఇచ్ఛాపురంలో సురంగి రాజులకు చెందిన పురాతన భవనంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం 20 ఏళ్లుగా కొనసాగుతోంది. ఇక్కడ కనీస సౌకర్యాలు లేక సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. సుమారు వందేళ్ల కిందట నిర్మించిన భవనం కావడం, శిథిలావస్థకు చేరుకోవడంతో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. అలాగే గంజాయి, మద్యం, సారా వంటి మాదక ద్రవ్యాలు, రకరకాల కేసుల్లో పట్టుబడిన వాహనాలు సీజ్ చేస్తే వాటిని ఆరుబయటే ఉంచాల్సి వస్తోంది. వాటికి భద్రత కరువైంది. వాహనాల విడి భాగాలు, టైర్లు చోరీకి గురయ్యాయి. ఉన్నతాధికారులు స్పందించి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లకు సొంత భవనాలు సమకూర్చాలని పలువురు కోరుతున్నారు.
ఈ విషయమై ఇచ్ఛాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ పి.దుర్గాప్రసాద్ వద్ద ప్రస్తావించగా.. ‘ఇచ్ఛాపురంలో సురంగి రాజావారి కోటలో ఎక్సైజ్ స్టేషన్‌ను నిర్వహిస్తున్నాం. వర్షాలు కురిసేటప్పుడు శ్లాబ్ పెచ్చులూడుతుంటాయి. అంతే తప్ప.. మరీ ఇబ్బందులు పడే పరిస్థితి లేదు. సీజ్ చేసిన మద్యాన్ని, గంజాయి, గుట్కా వంటివి గదుల్లో భద్రపరుస్తున్నాం. ప్రత్యేక షెడ్లు లేకపోవడంతో సీజ్ చేసిన వాహనాలను ఆరుబయట ఉంచాల్సి వస్తోంద’ని తెలిపారు.