డీఎస్సీకి సర్వం సిద్ధం
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:16 AM
మెగా డీఎస్సీ-25కి సర్వంసిద్ధమైంది. శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 30 వరకు జరగనున్నాయి.
- రేపటి నుంచే పరీక్షలు ప్రారంభం
- 30 వరకు నిర్వహణ
- ఉమ్మడి జిల్లాలో ఐదు కేంద్రాలు, ఒడిశాలో ఒకటి
- 22,648 మంది అభ్యర్థుల పోటీ
నరసన్నపేట, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-25కి సర్వంసిద్ధమైంది. శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 30 వరకు జరగనున్నాయి. దీనికోసం ఉమ్మడి జిల్లాలోని ఐదు కేంద్రాలు, ఒడిశా రాష్ట్రం బరంపురంలో ఒక కేంద్రాన్ని కేటాయించారు. 44 సెషన్స్‌లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆయా కేంద్రాలకు సంబంధించి డిపార్ట్‌మెంట్ అధికారులుగా సమీపంలో ఉన్న ఎంఈవోలను నియమించారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు జారీ చేశారు. అయితే, కొన్ని సబ్జెక్టులకు చెందిన అభ్యర్థులకు సుదూర ప్రాంతాల్లో కేంద్రాలు కేటాయించడంతో ఆందోళన చెందుతున్నారు.
షెడ్యూల్ జారీ
సబ్జెక్టుల వారీగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ జారీ చేశారు. శుక్రవారం టీజీటీ పరీక్షతో డీఎస్సీ ప్రారంభంకానుంది. 9 నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్, నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ల పరీక్షలు నిర్వహించనున్నారు. ఎక్కువ మంది రాసే ఎస్జీటీ పరీక్షలు 13వ తేదీ నుంచి జరగన్నాయి. టెట్ లేని పీడీ, పీఈటీలకు 100 మార్కులు పేపరు ఉన్న పరీక్షలకు మూడు గంటలు, టెట్ వెయిటేజ్ ఉన్న పోస్టుల పరీక్షలకు రెండున్నర గంటల సమయం కేటాయించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. అభ్యర్థులు హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకొని నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలకు గంటన్నర ముందుగా చేరుకోవాల్సి ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో 22,648 మంది అభ్యర్థుల నుంచి 39,235 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో 458 పోస్టులు, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో 85 పోస్టులు ఉన్నాయి. మొత్తం 543 పోస్టులకు 22,648 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
పరీక్ష కేంద్రాలు ఇవే
నరసన్నపేట కోర్ టెక్నాలజీ, ఎచ్చెర్ల వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, చిలకపాలెం శివానీ ఇంజనీరింగ్ కళాశాల, టెక్కలి ఐతమ్ కళాశాల, రాజాం జీఎమ్మార్, బరంపురం(ఒడిశా) ఐకాన్.