ప్రమాదమని తెలిసినా..
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:50 PM
A tribal man goes missing while fishing పలాస మండలం దానగొర గ్రామానికి చెందిన సవర లావణ్య(38) అనే గిరిజనుడు బుధవారం చేపలవేటకు వెళ్లి వరద ఉధృతికి నీటిలో కొట్టుకెళ్లిపోయాడు.
చేపలవేటకు వెళ్లి గిరిజనుడి గల్లంతు
కంబిరిగాం వరహాలుగెడ్డలో ఘటన
గాలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు
పలాస/పలాస రూరల్, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): పలాస మండలం దానగొర గ్రామానికి చెందిన సవర లావణ్య(38) అనే గిరిజనుడు బుధవారం చేపలవేటకు వెళ్లి వరద ఉధృతికి నీటిలో కొట్టుకెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కంబిరిగాం రహదారిలో వరహాలగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కాశీబుగ్గ పోలీసులు ఆ ప్రాంతంలో ఎవరూ వెళ్లకుండా పహారా పెట్టారు. అటువైపు ఎవరూ వెళ్లొద్దని ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. కాగా.. బుధవారం ఉదయం వరహాలుగెడ్డలో చేపలు పట్టేందుకుగానూ దానగొర గ్రామానికి చెందిన ఐదుమంది యువకులు వలలు, కర్రలు పట్టుకొని కంబిరిగాం ప్రాంతానికి వచ్చారు. రోడ్డుకు సమీపంలో ఉన్న సరప్లస్‌వియర్(పరుపు) వద్దకు అతికష్టంపై సవర లావణ్య బృందం వెళ్లి వేట సాగించింది. ఈ క్రమంలో పెద్ద చేప ఒకటి వెళ్లిపోతుండడాన్ని గుర్తించి దాన్ని పట్టుకునే క్రమంలో పట్టుతప్పి వరదలో పడిపోయాడు. దీంతో ఉధృతికి లావణ్య కొట్టుకుపోయాడని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య అన్నమ్మ, కుమారుడు సంజీత్, కుమార్తె రష్మిత ఉన్నారు. లావణ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇంటి యాజమాని గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి, డీటీ వి.గిరి, ఎస్‌ఐ నర్సింహమూర్తి పరిశీలించారు. ఇన్‌చార్జి కలెక్టర్‌కు సమాచారం అందజేశారు. ఆ ప్రాంతాన్ని రెడ్‌అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకుని లావణ్య కోసం గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ నర్సింహమూర్తి తెలిపారు.