Share News

Encroachment of ponds : చెరువులనూ వదల్లేదు

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:54 AM

ponds Encroachment కోటబొమ్మాళి మండలంలో ఆక్రమణలకు అడ్డులేకుండా పోయింది. ఖాళీ స్థలాలే కాదు.. చెరువులు, బందలు, కోనేరులు సైతం ఆక్రమణకు గురై నామరూపాలు లేకుండా పోతున్నాయి.

Encroachment of ponds : చెరువులనూ వదల్లేదు
మట్టితో పూర్తిగా కప్పేసిన చిన్నాన్న కర్ర చెరువు

  • కోటబొమ్మాళి మండలంలో జోరుగా ఆక్రమణలు

  • ఆయకట్టుదారులకు తప్పని సాగునీటి కష్టాలు

  • కోటబొమ్మాళి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళి మండలంలో ఆక్రమణలకు అడ్డులేకుండా పోయింది. ఖాళీ స్థలాలే కాదు.. చెరువులు, బందలు, కోనేరులు సైతం ఆక్రమణకు గురై నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఇటీవల కోటబొమ్మాళి పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్‌ 237/2లో సుమారు రెండు ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న చిన్నాన్న కర్ర చెరువు కబ్జాకు గురైంది. అక్రమార్కులు అంచెలంచెలుగా చెరువును ఆక్రమిస్తూ చెరువు గర్భాన్ని ఇప్పుడు పూర్తిగా మట్టితో కప్పేశారు. ఈ చెరువు కింద సుమారు 45 ఎకరాల ఆయకట్టు సాగవుతుండేది. ఇప్పుడు చెరువు పూర్తిగా నామరూపాలు లేకపోవడంతో రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనిపై ఇప్పటికే స్థానికులు కొంతమంది రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు పరిశీలించి.. పనులు నిలుపుదల చేశారు. కాగా, మండలంలోని చాలాచోట్ల చెరువులు, బందలు, కోనేరులు ఆక్రమణకు గురవుతున్నాయని ఈ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వాటిని పరిరక్షించాలని కోరుతున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ అప్పలరాజు వద్ద ప్రస్తావించగా.. చిన్నాన్న కర్ర చెరువు ఆక్రమణ విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆక్రమణలు పరిశీలించామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 12:54 AM