Share News

జీఎస్టీ తగ్గినా.. అవే రేట్లు

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:50 PM

Selling goods at old prices సామాన్యులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం చాలా వస్తువులపై, నిత్యావసర సరుకులపై జీఎస్టీని తగ్గించినా.. వ్యాపారులు మాత్రం దోపిడీ ఆపడం లేదు. చాలామంది వినియోగదారులకు జీఎస్టీ తగ్గిన విషయం పెద్దగా తెలియకపోవడంతో పాత ధరకే వస్తువులను విక్రయిస్తున్నారు.

జీఎస్టీ తగ్గినా.. అవే రేట్లు

  • వినియోగదారులను మోసగిస్తున్న వ్యాపారులు

  • పాత ధరలతోనే వస్తువుల విక్రయాలు

  • పూర్తిస్థాయిలో అమలుకాని కొత్త విధానం

  • ఇంకా సామాన్యుల్లో కానరాని అవగాహన

  • పోస్టర్ల ఆవిష్కరణకే అధికారులు పరిమితం

  • శ్రీకాకుళం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): సామాన్యులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం చాలా వస్తువులపై, నిత్యావసర సరుకులపై జీఎస్టీని తగ్గించినా.. వ్యాపారులు మాత్రం దోపిడీ ఆపడం లేదు. చాలామంది వినియోగదారులకు జీఎస్టీ తగ్గిన విషయం పెద్దగా తెలియకపోవడంతో పాత ధరకే వస్తువులను విక్రయిస్తున్నారు. వినియోగదారులపై భారం మోపుతూ మోసగిస్తున్నారు. జీఎస్టీ 2.0 విధానం అమల్లోకి వచ్చి పది రోజులు పైబడింది. గత నెల 22 నుంచి సుమారు 83 కేటగిరిలకు సంబంధించిన వస్తువులు, సేవలు, మందులపై కేంద్రం జీఎస్టీ శ్లాబ్‌ తగ్గించింది. గతంలో నాలుగు శ్లాబ్‌లు ఉంటే.. ప్రస్తుతం రెండు శ్లాబ్‌లకే పరిమితం చేసింది. కానీ ఎక్కడా ఇవి పూర్తిస్థాయిలో అమల్లోకి రావడంలేదు. వ్యాపారులు అసలు ధర చెప్పడం లేదు. పాత సరుకు ఉందనే కారణంతో పాత ధరలే వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత సరుకు ఎంత ఉందో చెప్పే వారెవరూ కనిపించడంలేదు. తగ్గిన జీఎస్టీ శ్లాబ్‌ వల్ల ప్రజలకు ఎప్పటికి ప్రయోజనం లభిస్తుందనేదానిపై స్పష్టత లేదు. అధికారులు మాత్రం జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామంటూ ప్రకటనలకే పరిమితమవుతున్నారు. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారుల మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.

  • ఆఫర్లు అంటూ ప్రకటనలు..

  • టీవీలు, ఏసీలు వంటి ఎలకా్ట్రనిక్‌ వస్తువులు, కార్లు, మోటారు సైకిళ్లపై కొంతవరకూ ధర తగ్గినట్లు చెబుతున్నారు. కార్లపై రూ.50వేల నుంచి రూ.లక్ష వరకూ తగ్గగా, మోటారు సైకిళ్లపై రూ.15వేల వరకూ తగ్గింది. టీవీలపై రూ.3వేల నుంచి రూ.4వేల వరకూ తగ్గిస్తున్నారు. కానీ ఇవన్నీ దసరా ఆఫర్లతో కలిపి అమ్ముతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. సిమెంట్‌ ధరలు తగ్గించడం లేదు. పాల ఉత్పత్తుల వద్ద ధరల పట్టీ పెట్టారు. కానీ పాత సరుకు ఉందని చెప్పడం గమనార్హం.

  • ధర తగ్గించాల్సి ఉన్నా..

  • ప్రభుత్వ జీఎస్టీ శ్లాబ్‌ను తగ్గించిన 83 కేటగిరీల వస్తువులు, సేవలు వంటి వాటి వివరాలు ప్రకటించింది. వీటి ధరలు కచ్చితంగా తగ్గించాల్సిందే.

  • పన్నీరు, టెట్రాప్యాక్‌ పాలు, చపాతీలు, రోటీలపై గతంలో ఐదు శాతం జీఎస్టీ ఉండేది. దానిని పూర్తిగా ఎత్తేశారు. దీంతో ఆయా వస్తువుల ధరలు తగ్గాల్సి ఉన్నా.. పాత రేటుకే వ్యాపారులు విక్రయిస్తున్నారు.

  • వెన్న, నెయ్యి, తృణధాన్యాలు, చక్కెర, కాఫీ, సూప్‌లు, బేకింగ్‌ పౌడర్‌, నిల్వ ఉంచి చేప, మాంసం రేట్లపై జీఎస్టీ గతంలో 12 శాతం ఉండేది. ప్రస్తుతం కేవలం 5 శాతం వసూలు చేయాలి. 20 లీటర్ల తాగునీటి డబ్బాలు, కొబ్బరిపాలు, బాదం, జీడిపప్పు పాలు, అవిసెపాలు, బియ్యంపాలు, ఓటు పాలు, పండ్ల గుజ్జు, రసాలు, పాలు ఆధారిత పానీయాలపై గతంలో 18 శాతం జీఎస్టీ వసూలు చేసేవారు. ఈ శ్లాబ్‌ను 5కి పరిమితం చేశారు.

  • సబ్బులు, హెయిర్‌ ఆయిల్‌, షాంపూలు, దువ్వెనలు, పౌడర్లపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింది. ఫేస్‌పౌడర్‌, షేవింగ్‌ క్రీమ్‌, ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్లపై 18శాతం ఉండే జీఎస్టీని 5 శాతానికి పరిమితం చేశారు.

  • విద్యార్థులు ఉపయోగించే ఎరేజర్లు, పుస్తకాలు, పెన్సిళ్లపై జీఎస్టీని ఎత్తేశారు. జామెట్రీ, రంగు పెట్టెలు, పేపరు కార్టూన్లు తదితర వస్తువులపై 12శాతం ఉండే జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు.

  • అరుదైన వ్యాధులకు సంబంధించిన మందులపై పూర్తిగా జీఎస్టీ ఎత్తేశారు. యునాని, సిద్ధ, హోమియోపతి సహా అన్ని మందులు, ఆక్సిజన్‌ కిట్లు, రసాయనాలు, గ్లూకోమీటరు, సర్జికల్‌ వస్తువులపై 12 శాతం ఉంటే 5 శాతానికి పరిమితం చేశారు. ధర్మామీటరుపై 18శాతం ఉండే జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు.

  • వ్యవసాయ పరికరాలు, యంత్రాలపై గతంలో 12 నుంచి 18 శాతం జీఎస్టీ ఉండేది. ప్రస్తుతం 5 శాతానికి తగ్గించేశారు.

  • వాహనాలపై గతంలో 28 శాతం జీఎస్టీ ఉంటే 18 శాతానికి పరిమితం చేశారు. సైకిళ్లు, వాటి భాగాలపై 12 శాతం ఉంటే 5 శాతానికి తగ్గించారు.

  • సిమెంట్‌పై జీఎస్టీ 28 శాతం ఉంటే 18 శాతానికి పరిమితం చేశారు. మిగిలిన గృహ నిర్మాణ వస్తువులపై 12 శాతం ఉంటే 5శాతానికి కుదించారు. టీవీలు, ప్రాజెక్లర్లు, ఏసీలు, డిషల్‌ వాషర్లపై గతంలో 28 శాతం జీఎస్టీ ఉంటే దానిని 18 శాతానికి పరిమితం చేశారు. సోలార్‌ వాటర్‌ హీటర్‌, సిస్టమ్స్‌ సోలార్‌ కుక్కర్లపై 12 శాతం ఉంటే 5 శాతానికి తగ్గించారు. బొమ్మలు, క్రీడాపరికరాలపై 5శాతమే జీఎస్టీ.

  • ఫీడింగ్‌ బాటిళ్లు, స్టీల్‌, అల్యూమినియం, రాగి వంటి పాత్రలు, ఫీడింగ్‌ బాటిళ్లు, బేబీ న్యాప్‌కిన్‌లు, డైపర్లు, కొవ్వొత్తులు, స్టీలు, అల్యూమినియం, రాగి, ఇత్తడి, వంటగది పాత్రలు, కుట్టు యంత్రాలు, రబ్బరు బ్యాండ్లపై 12 శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గించారు. కాఫీ, చాక్లెట్లు, కేక్‌లు, బిస్కెట్లు, జామ్‌లపై గతంలో 18 శాతం జీఎస్టీ ఉండగా ఇప్పుడు 5 శాతానికి కుదించారు.

  • బాదం, పిస్తా, ఖర్జూరం, అంజీరా తదితర డ్రైఫ్రూట్‌లు, పండ్ల రసాలపై 12 శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించారు.

  • ఇలా చాలా వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినా వ్యాపారులు ఇంకా పాత పన్ను విధానమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి సామాన్యుడికి ఇప్పటికీ ఎంత శాతం లాభం చేకూరింది. వ్యాపారులు ఏ మేరకు ధరలు తగ్గించారన్నదీ తెలియడం లేదు. దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది. అలాగే అధికారులు సామాన్యుల వలె దుకాణాల్లో కొనుగోలు చేసి.. వాస్తవాలు పరిశీలిస్తేనే జీఎస్టీ 2.0 ఫలాలు ప్రజలకు చేరువవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Oct 04 , 2025 | 11:50 PM