17 ఏళ్లయినా.. పునరావాసం కల్పించరా?
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:59 PM
Delayed rehabilitation Resettlement issues సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. సోమవారం శ్రీకాకుళంలోని జడ్పీ కార్యాలయాన్ని ముట్టడించి.. వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. 17 ఏళ్లయినా.. పునరావాసం కల్పించరా? అంటూ నినాదాలు చేశారు.
వచ్చే నెల 5లోగా సమస్యలు పరిష్కరించాలి
ఆఫ్‌షోర్ నిర్వాసితుల డిమాండ్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 23(ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. సోమవారం శ్రీకాకుళంలోని జడ్పీ కార్యాలయాన్ని ముట్టడించి.. వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. 17 ఏళ్లయినా.. పునరావాసం కల్పించరా? అంటూ నినాదాలు చేశారు. 2008లో ఏడు రెవెన్యూ గ్రామాల పరిధిలో 3వేల ఎకరాలను ఆఫ్‌షోర్ రిజర్వాయర్ కోసం ఇవ్వగా.. నేటికీ పునరావాసం కల్పించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీ-కోసం’ కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. చివరకు డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు నిర్వాసితుల వద్దకు వచ్చి మాట్లాడారు. జూలై 2వ తేదీలోగా నిర్వాసిత గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిర్వాసితులు శాంతించారు. డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వి.వేంకటేశ్వర్లు, చాపర వెంకటరమణ, గంగరాపు సింహాచలం మాట్లాడుతూ నిర్వాసితులకు సరైన పునరావాసం కల్పించకపోవడం దారుణమన్నారు. ఏడు గ్రామాల ప్రజలు మెళియాపుట్టి మండలం చీపురుపల్లిలో గత 33 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 5వ తేదీలోగా అధికారులు సమస్యలను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున కలెక్టరేట్‌ను ముట్డడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లండ వెంకట్రావు, పోలాకి ప్రసాద్, సర్పంచ్ ఈశ్వరరావు, దొర విజయ్‌కుమార్, కిరణ్, శోభన్‌బాబు, ధర్మాన మహేష్, ఆదిలక్ష్మి, నందిగాం ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.