Share News

రీసర్వేలో తప్పులు సరిచేయాలి

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:12 AM

Farmers' concern భూముల రీసర్వేలో తప్పుల కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని నడగాం, చెన్నాపురం గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నరసన్నపేటలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు.

రీసర్వేలో తప్పులు సరిచేయాలి
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేస్తున్న చెన్నాపురం, నడగాం రైతులు

నడగాం, చెన్నాపురం రైతుల డిమాండ్‌

తహసీల్దార్‌ కార్యాలయం ముట్టడి

నరసన్నపేట, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): భూముల రీసర్వేలో తప్పుల కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని నడగాం, చెన్నాపురం గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నరసన్నపేటలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. తప్పులు సరిదిద్ది తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ‘ఈ ఏడాది మార్చి నుంచి జూన్‌ వరకు నడగాం, చెన్నాపురం గ్రామాల్లో రెవెన్యూ, సర్వేశాఖ అధికారులు భూములు రీసర్వే నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి భూములు సాగు చేస్తున్న రైతులను గుర్తించారు. చివరిస్థాయిలో గ్రామసభలు నిర్వహించకుండా, రైతులకు సమాచారం ఇవ్వకుండా రీసర్వే పూర్తయినట్టు రికార్డుల్లో నమోదు చేశార’ని ఆ రెండు గ్రామాలకు చెందిన రావాడ కృష్ణ, కొంక్యాన నర్సింహమూర్తి, కె.బాబ్జీ, చిట్టిబాబు, జి.ధర్మారావు, దుంపాక వెంకటరమణ, మానెమ్మ తదితర రైతులు ఆందోళన చేపట్టారు. ‘బదిలీల నేపథ్యంలో సచివాలయాలకు కొత్త అధికారులు వచ్చారు. రీసర్వే పూర్తిచేయాలని ఉన్నతాధికారుల ఒత్తిడితో క్షేత్రస్థాయిలో ఉన్న రైతులను కాదని.. అడంగళ్‌ ప్రాప్తికి రీసర్వే రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో రీసర్వేలో రైతులు పేర్లు గల్లంతయ్యాయి. భూములు ఉన్నవారికి లేనట్టుగా.. లేనివారికి ఉన్నట్టుగా రికార్డుల్లో నమోదైంది. ఒకరి భూమి.. మరొకరి పేరుమీద ఉన్నట్టు రికార్డుల్లో చూపుతోంది. తప్పులు సరిదిద్దాలని ఎన్నిసార్లు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా.. సిబ్బంది తామేమీ చేయలేమని చెబుతున్నార’ని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ అయినా స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. నడగాంలో తరతరాలుగా సాగుచేస్తున్న రైతులకు పట్టాలు లేదా పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు.

నిబంధనల మేరకు సరిచేస్తాం

చెన్నాపురం, నడగాం గ్రామాల్లోని రీసర్వేలో తప్పులు ఉంటే గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు సరిదిద్దుతామని తహసీల్దార్‌ సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్‌ పి.శ్రీనివాసరావు రైతులకు స్పష్టం చేశారు. సాగుచేసే రైతులకు యాజమాన్య హక్కు ఇవ్వాలంటే వారసత్వం లేదా కొనుగోలు, ఏ ఇతర మార్గాల ద్వారా సంక్రయించినట్లు లిఖితపూర్వకమైన ఆధారాలు ఉండాలని తెలిపారు. తరతరాలుగా సాగుచేస్తున్నా.. ఎటువంటి హక్కుపత్రాలు లేకపోతే యాజమాన్య హక్కులు ఇవ్వలేమని స్పష్టం చేశారు.

Updated Date - Oct 18 , 2025 | 12:12 AM