Share News

ప్రతి కార్యాలయంలో ఈ-ఆఫీస్‌ తప్పనిసరి

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:47 PM

Files must be resolved in a timely manner జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో వారం రోజుల్లో ఈ-ఆఫీస్‌ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ విభాగాల వారీగా దస్త్రాల పరిష్కారంపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించారు.

ప్రతి కార్యాలయంలో ఈ-ఆఫీస్‌ తప్పనిసరి
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

దస్త్రాలను సకాలంలో పరిష్కరించాల్సిందే

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో వారం రోజుల్లో ఈ-ఆఫీస్‌ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ విభాగాల వారీగా దస్త్రాల పరిష్కారంపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్థికాంశాలతో కూడినవి, మరీ సంక్లిష్టమైనవి తప్ప.. మిగిలిన దస్ర్తాలన్నీ ఆలస్యానికి తావులేకుండా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఈ-ఆఫీసు దస్త్రాల పరిష్కారంలో వెనుకబడిన ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పలాస మునిసిపాలిటీలు, ఏపీఎస్‌ఐడీఎస్‌, జిల్లా రిజిస్ట్రార్‌ వంటి శాఖలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ-ఆఫీస్‌ నిర్వహణలో ప్రతిభ కనబరచకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంతబొమ్మాళి మండలం తాళ్లవలసలో డయేరియా వ్యాప్తిపై కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘ఆహారం, నీరు, పారిశుధ్యం విషయంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. వేడిచేసి చల్లార్చిన నీటిని తాగేలా, వేడి ఆహారాన్ని తీసుకునేలా.. ప్రజల్లో అవగాహన పెంచాలి. ఆహార కల్తీ నియంత్రణ అధికారులు హోటల్స్‌, సినిమా హాళ్లు, రోడ్‌ సైడ్‌ ఫుడ్‌ స్టాళ్లను వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాలి. తనిఖీల పేరుతో వీధి వ్యాపారులను ఇబ్బంది పెట్టరాద’ని స్పష్టం చేశారు. అలాగే ధాన్యం సేకరణలో బ్యాంక్‌ గ్యారెంటీలు, వాహనాల రిజిస్ట్రేషన్‌, టార్పాలిన్‌ లభ్యతపై చర్చించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ దిశానిర్దేశం చేశారు. సానుకూల ప్రజాభిప్రాయం కోసం ఫింఛన్లు, వ్యవసాయం, ప్రభుత్వ ఆసుపత్రి, రెవెన్యూ సర్వే, ఏపీఎస్‌ఆర్టీసీ సేవలు వంటి అంశాలపై అధికారుల చొరవ చూపాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు ఆసుపత్రిలో మందుల పంపిణీ చేయాలని తెలిపారు. సమావేశంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ దొనక పృథ్వీరాజ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 11:47 PM