Share News

Environment: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:05 AM

Environmental Responsibility ‘భవిష్యత్‌ తరాలకు ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని అందించడం, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత’ అని కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు.

Environment: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మొక్క నాటి నీళ్లు పోస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్‌

  • ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

  • కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

  • శ్రీకాకుళం రూరల్‌, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ‘భవిష్యత్‌ తరాలకు ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని అందించడం, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత’ అని కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వనమహోత్సవం సందర్భంగా గురువారం శ్రీకాకుళంలో భారీ ర్యాలీని ఆయన ప్రారంభించారు. పాత్రునివలస ఫ్లైఓవర్‌ నుంచి ర్యాలీ సాగింది. అనంతరం జిల్లాలో ఒక్క రోజులో 6లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక విభాగం సంయుక్తంగా పాత్రునివలస ట్యాంక్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సూచనల మేరకు జిల్లాలో 6 లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని ప్రాంభించాం. మొక్క మానవాళి మనుగడకు జీవనాధారం. ప్రతి ఒక్కరూ నివాస పరిసరాల్లో మొక్కలు నాటి.. సంరక్షించాలి. ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని రూపొందించేలా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి’ అని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సూచించారు. స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతామని ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. ‘మొదటిసారిగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లాలో 6 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. మునగ, వేప, బాదం, బొప్పాయి, ఉసిరిక మొక్కలు పంపిణీ చేశాం. అందరూ మొక్కలు నాటాలి. ప్లాస్టిక్‌ వినియోగానికి దూరంగా ఉండాలి. రోజూ యోగా చేస్తే మానసిక ఉల్లాసం, ఆరోగ్యం బాగుంటుంద’ని సూచించారు. ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. చెట్లు విరివిగా ఉంటే మంచి వాతావరణం కలుగుతుందన్నారు. మొక్కలను సంరక్షించాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కరుణశ్రీ, జిల్లా అటవీశాఖ అధికారి ఎస్‌.వెంకటేష్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రసాదరావు, మహిళ శిశు సంక్షేమ అధికారిణి శాంతిశ్రీ, ఆర్డీవో సాయి ప్రత్యూష, తెలుగు యువత సమన్వయకర్త మెండ దాసునాయుడు, పాత్రునివలస మాజీ సర్పంచ్‌ పంచిరెడ్డి అప్పలనాయుడు, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వహకులు వెంకటస్వామి పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 12:05 AM