Lake Encroachment: రెండు చెరువులు.. 11 ఎకరాలు
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:15 AM
Illegal Land Occupation పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని కుంకుమసాగరం, ఎర్రచెరువు ఆక్రమణలపై మునిసిపాలిటీ, రెవెన్యూశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. మొత్తం 11 ఎకరాలకుపైగా ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు.
- ఇదీ పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో ఆక్రమణల పర్వం
- అధికారుల సర్వే ద్వారా గుర్తింపు
- కుంకుమసాగరంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు
పలాస, జూలై 25(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని కుంకుమసాగరం, ఎర్రచెరువు ఆక్రమణలపై మునిసిపాలిటీ, రెవెన్యూశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. మొత్తం 11 ఎకరాలకుపైగా ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు. కుంకుమసాగరంలో ఉన్న 8 ఎకరాల ఆక్రమణలు తొలగించారు. ఎర్రచెరువులో ఉన్న ఆక్రమణలు తొలగించనున్నారు. వివరాల్లోకి వెళితే.. వైసీపీ హయాంలో పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో అనేక కథనాలు ప్రచురితమైనా అప్పట్లో అధికారులు స్పందించలేకపోయారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు, కాలువలు ఆక్రమణ విషయమై పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్.. సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు మునిసిపాలిటీ, రెవెన్యూ అధికారులు మూడు రోజులుగా సర్వే చేస్తున్నారు. పాతజాతీయరహదారి పెంటిభధ్ర- జయరామచంద్రపురం గ్రామాల మధ్య ఉన్న కుంకుమసాగరం చెరువును సమగ్ర సర్వే చేశారు. మొత్తం 8 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే ఎక్స్‌కవేటర్లతో ఆక్రమణలు తొలగించారు. ఇంకా మరికొన్ని ఆక్రమణలు ఇక్కడ గుర్తించాల్సి ఉంది. ఇవి ఎవరి చేతిలో ఉన్నాయి, ఎంతకాలం నుంచి వారు అనుభవిస్తున్నారన్నది అధికారులు పరిశీలనలో తేలాల్సి ఉంది.
కుంకుమసాగరంలో ఆక్రమణలు తొలగించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు గొలుసు చెరువులో భాగంగా ఉంది. ఎక్కువగా నీరు చేరితే ఆయకట్టు అవసరాలకు నీరు వినియోగించడంతో పాటు మిగులునీరు బెండిగెడ్డ వరకూ వెళ్తుంది. మధ్యలో ఆరుకుపైగా చెరువుల్లో నీరు నింపుతోంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కుంకుమసాగరాన్ని అభివృద్ధి చేయకపోవడంతో ఆక్రమణలు జరిగాయని రైతులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది రియల్‌ఎస్టేట్ వ్యాపారులు కూడా ఆక్రమణలు తొలగించి తమకు ఎంత భూమి ఉందో చూపించాలని అధికారులను కోరారు. దీంతో ఆక్రమణలు తొలగింపు సులభమైంది.
పలాసలోని పురుషోత్తపురం సర్వేనెంబరు 29లో ఉన్న ఎర్రచెరువు కూడా ఆక్రమణకు గురైంది. స్థానికులు కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకోగా, మరికొంతమంది రియల్‌ఎస్టేట్‌గా మార్చుకున్నారు. దీనిపై మునిసిపల్ సర్వేయర్ చలపతిరావుతోపాటు టౌన్‌ప్లానింగ్ సిబ్బంది మొత్తం మూడు రోజులపాటు సర్వే నిర్వహించి ఆక్రమణలు గుర్తించారు. 1.01 ఎకరాల్లో మొత్తం 60 నివాసాలు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఇంకా 2.38 ఎకరాలు ఆక్రమించి కంచెను వేసినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. 1.58 ఎకరాల స్థలం రహదారిలో ఉన్నట్లు అధికారులు రూట్‌మ్యాప్ చూపించారు. నివాసాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా మిగిలిన ఆక్రమణలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడానికి జిల్లా అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. దీంతోపాటుగా ఎర్రచెరువుకు వచ్చే వరదనీటి కాలువ 6 ఎకరాలు కూడా ఆక్రమణలకు గురైంది. పూర్తిగా కాలువ కావడంతో వరదలు వస్తే మాత్రం ఆ ప్రాంతంలో ఉన ్న నివాసాలు ముంపునకు గురికావడం ఖాయం.
ఈ వ్యవహారంపై తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తిని వివరణ కోరగా ‘కుంకుమసాగరం, ఎర్రచెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సమగ్ర సర్వే చేసి ఆక్రమణలు గుర్తించాం. కుంకుమసాగరంలో ఆక్రమణలు తొలగించాం. ఎర్రచెరువు పరిధిలో ఆక్రమణలు తొలగిస్తాం. మునిసిపాలిటీలో చెరువులన్నీ సర్వేచేసి ఆక్రమణలు గుర్తించి నోటీసులు అందజేస్తామ’ని తెలిపారు.