Share News

Fake land documents : నకిలీ పట్టాలతో.. ప్రభుత్వ భూమి హాంఫట్‌

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:42 PM

Land scam.. Forged pattas ప్రభుత్వం మారినా.. భూ దందాలు మాత్రం ఆగడం లేదు. వైసీపీ పాలనలో కొండలు, గుట్టలు, కాలువలు, ప్రభుత్వ భూములు సైతం ఆక్రమణకు గురయ్యాయి. అప్పట్లో నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలతో భూ అనుమతులు సృష్టించిన వ్యక్తులు.. ఇప్పటికీ ఆక్రమణలు కొనసాగించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Fake land documents : నకిలీ పట్టాలతో.. ప్రభుత్వ భూమి హాంఫట్‌
ఆక్రమణకు గురైన సైలాడ కొండ ప్రాంతం

  • సైలాడ కొండ ప్రాంతం ఆక్రమణకు యత్నం

  • పరిసరాల్లోని గ్రామస్థుల ఆందోళన

  • ఎమ్మెల్యే, అధికారులకు ఫిర్యాదు

  • ఆమదాలవలస, జూలై 26(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మారినా.. భూ దందాలు మాత్రం ఆగడం లేదు. వైసీపీ పాలనలో కొండలు, గుట్టలు, కాలువలు, ప్రభుత్వ భూములు సైతం ఆక్రమణకు గురయ్యాయి. అప్పట్లో నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలతో భూ అనుమతులు సృష్టించిన వ్యక్తులు.. ఇప్పటికీ ఆక్రమణలు కొనసాగించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆమదాలవలస మండలం చిట్టివలస ప్రాంతంలోని సైలాడ రెవెన్యూ గ్రామంలో కొండను ఆక్రమించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ప్రభుత్వం తనకు డీ పట్టా మంజూరు చేసిందని స్థానికులను నమ్మిస్తూ.. సైలాడ కొండను ఆక్రమించాలని భావించాడు. దీంతో పరిసర గామాలైన గాజులకొల్లివలస, చిట్టివలస, సైలాడకు చెందిన ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆక్రమణల వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ గ్రామాలకు చెందిన సవర చిన్నారావు, బంటుపల్లి కూర్మారావు, నూలు లక్ష్మణ, భోగి నాగరాజు, లబ్బ రమణ, పి.సూరి, ఎర్రంనాయుడు, శ్రీను తదితరులు ఆమదాలవలస రెవెన్యూ కార్యాలయంలో కూడా గురువారం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘రెవెన్యూ సర్వే నెంబర్‌ 183 కలిగిన సైలాడ కొండ ప్రాంతంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు 294, 295-2, 296-1, 296-3 కలిగిన తప్పుడు సర్వే నెంబర్లతో గతంలో డీ పట్టాలు మంజూరు చేసినట్టు తెలిసింది. తప్పుడు సర్వే నెంబర్లు, నకిలీ పట్టాతో ఓ అక్రమార్కుడు సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి పనులు ప్రారంభించాడు. సైలాడ గ్రామ రెవెన్యూ పరిధిలో ఎఫ్‌ఎంబీలు 292, 293 వరకు మా త్రమే ఉన్నాయి. అటువంటప్పుడు 296 సర్వే నెంబర్‌ ఎక్కడ నుంచి పుట్టుకొచ్చింద’ని ప్రశ్నించారు. తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి నకిలీ పట్టాలను రద్దు చేయడంతోపాటు ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. ఆ ప్రాంతమంతా టెపో గ్రాఫికల్‌ సర్వే చేసి ఇప్పటివరకు ఉన్న సర్వే నెంబర్లు ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. నకిలీ పట్టాదారుడుకు వత్తాసు పలుకుతూ.. అతని పట్టాలో ఉన్న సర్వే నెంబర్లు మార్పిడి చేస్తే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూముల ఆక్రమణను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.

  • ఈ విషయమై తహసీల్దార్‌ ఎస్‌.రాంబాబు వద్ద ప్రస్తావించగా.. ‘గతంలో సైలాడ కొండ ప్రాంతంలో పట్టాలు అందజేశాం. ప్రస్తుతం ఆ ప్రాంత భూములు ఆక్రమణపై కొంతమంది ఫిర్యాదు చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఇరువర్గాల ఆరోపణలపై విచారణ చేస్తాం. ఆక్రమణ నిజమైతే.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు.

Updated Date - Jul 26 , 2025 | 11:42 PM