Share News

మునగ సాగుకు ప్రోత్సాహం

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:27 AM

Drumstick cultivation రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అధిక ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తూ.. మొక్కలను, విత్తనాలను సరఫరా చేస్తోంది.

మునగ సాగుకు ప్రోత్సాహం

ఒక్కో ఎకరాకు రూ.1.49 లక్షల రాయితీ

పైలెట్‌ ప్రాజెక్టు కింద 7 మండలాలు ఎంపిక

రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

మెళియాపుట్టి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అధిక ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తూ.. మొక్కలను, విత్తనాలను సరఫరా చేస్తోంది. రాయితీలు, పెట్టుబడి సాయం సైతం అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో మునగ పంటకు అనుకూలంగా ఉండడంతో.. పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద తొలివిడతగా ఏడు మండలాలను ఎంపిక చేసింది. డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా దీనిని అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది 200 ఎకరాల్లో మునగ పంట వేయాలని నిర్ణయించగా.. ఇప్పటివరకూ 65 ఎకరాలు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. మెళియాపుట్టి, లావేరు, పాతపట్నం, వజ్రపుకొత్తూరు, ఎచ్చెర్ల, టెక్కలి, ఇచ్ఛాపురం మండలాల్లో మునగ పండించనున్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మునగ విత్తనాల్లో పీకేఎం రకం మేలైనదిగా తమిళనాడులోని పురియకులం ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారులు గుర్తించారు. ఈ మేరకు సెర్ప్‌ అధికారులు అక్కడకు వెళ్లి పంటను పరిశీలించారు. అక్కడి నుంచి విత్తనాలు తెచ్చి.. రైతులకు అందజేయనున్నారు.

నిధులు ఇలా..:

మునగ పండించే రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తారు. ఎకరానికి నాలుగు వేల మొక్కలు నాటితే వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవిక మిషన్‌ (ఉపాధిహామీ) పథకం ద్వారా రూ.1.32 లక్షలు మంజూరు చేస్తారు. విత్తనాలు, మొక్కలు సరఫరా, ఇతర అవసరాలకు రూ.31వేలు ఇస్తారు. రెండేళ్లపాటు ఈ సాగుకు ఆర్థిక సహకారం అందిస్తారు. 25 సెంట్ల నుంచి గరిష్టంగా హెక్టారు వరకు ప్రోత్సాహకం అందుతుంది. గుంతలు తీయడానికి మొక్కలు వేయడానికి, నీరు పెట్టడానికి, ఎరువులు పర్యవేక్షణకు కూడా ఉపాధిహామీ నిధులు మంజూరు చేస్తారు. 25 సెంట్ల భూమిలో 1000 మొక్కలు, 50 సెంట్లలో 2వేలు, 75 సెంటల్లో 3 వేలు, ఎకరానికి 4 వేలు మొక్కలు చొప్పున నాటుకోవాలి. ఎకరా పొలంలో మునగ మొక్కలు నాటితే ప్రభుత్వం నుంచి రూ.1.49 లక్షలు రాయితీ కల్పిస్తారు. 25 సెంట్లలో అయితే రూ.38,125, యాభై సెంట్లకు రూ.75,148 రాయితీ ఇస్తారు. 75 సెంట్లకు రూ.1.25 లక్షలు రాయితీ కల్పిస్తారు.

ఒకసారి మొక్క నాటితే నాలుగు నెలల్లో పంట చేతికి అందుతుంది. ఐదేళ్లపాటు దిగుబడి వస్తుంది. రైతుల ఎంపికలో డ్వాక్రా సభ్యులకు ప్రాధాన్యమిస్తారు. ఆయా ప్రాంతాల్లో విస్తీర్ణానికి అనుగుణంగా శుద్ధప్లాంట్‌ ఏర్పాటుకు సెర్ప్‌ రుణం మంజూరు చేస్తుంది. పంట దశలో అధికారులే మార్కెట్‌లో మునగకాయలతోపాటు ఆకులను కూడా విక్రయించే అవకాశం కల్పిస్తారు. ఆకులను పొడిచేసి విక్రయించనున్నారు. వీటి ద్వారా రైతులు లాభాల బాట పట్టనున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

రైతులను ఎంపిక చేస్తున్నాం

మునగ పండించేందుకు రైతులను ఎంపిక చేస్తున్నాం. మునగ మొక్కలు వేస్తే.. ముందే సాగు ఖర్చులకు అవసరమైన డబ్బులు అందజేస్తాం. అధికంగా పొలం, గట్టుతోపాటు సాగు చేయడానికి రైతులు మందుకు వస్తున్నారు. ప్రస్తుతం విత్తనాలు వేసి నారు పోశాం.

- త్రినాధమ్మ, ఐకేపీ ఏపీఎం, మెళియాపుట్టి

Updated Date - Dec 20 , 2025 | 12:27 AM