Share News

ఉపాధి ఉసురు తీసింది

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:23 PM

దేవళభద్ర పంచాయతీ జల్లపల్లిలో విద్యుదాఘాతానికి గురై భవన నిర్మాణ సెంటరింగ్‌ కార్మికుడు శంకరరావు (42) మృతి చెందాడు.

ఉపాధి ఉసురు తీసింది
విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన శంకరరావు

విద్యుదాఘాతంతో భవన నిర్మాణ సెంటరింగ్‌ కార్మికుడి మృతి

లబోదిబోమంటున్న కుటుంబ సభ్యులు

నందిగాం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): దేవళభద్ర పంచాయతీ జల్లపల్లిలో విద్యుదాఘాతానికి గురై భవన నిర్మాణ సెంటరింగ్‌ కార్మికుడు శంకరరావు (42) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నందిగాంకు చెందిన శంకరరావు భవన నిర్మాణ సెంటరింగ్‌ మేస్త్రీ అగురు బాలకృష్ణతో కలిసి మంగళవారం జల్లపల్లిలోని గొనప కారయ్య ఇంటి నిర్మాణ సెంటరింగ్‌ పనికి వెళ్లారు. కట్‌ చేసిన ఇనుక గజాలను మేడపైకి తీసుకు వెళ్తుండగా ఇంటి ముందు నుంచి వెళ్తున్న 11కేవీ హై టెన్షన్‌ వైరు తగలడంతో శంకరరావు అక్కడే కుప్ప కూలి పోయాడు. బాలకృష్ణ సపర్యలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్న శంకరరావు మృతిచెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడినట్లయింది. ఉపాధే ఊపిరి తీసిందని వారు లబోదిబోమంటున్నారు. పెద్దదిక్కును కోల్పోవడంతో భార్య గౌరి, కుమారులు నవీన్‌, జశ్వంత్‌, ఇతర బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. శంకరరావు అందరితో కలివిడిగా ఉంటూ వ్యవ సాయ పనులు, ఇతర పనుల్లోనూ అందరికీ చేదోడుగా ఉండేవాడని, అటువంటి వ్యక్తి ఇక లేడన్న సంగతి తెలుసుకుని పలువురు ఆవేదనకు గురయ్యా రు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం హెచ్‌సీ వీవీ రమణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తు న్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తర లించారు. ప్రమాదం విషయాన్ని వీఆర్వో సురేష్‌, కార్యదర్శి ఉమాపతి అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఉప తహసీల్దార్‌ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు.

Updated Date - Jun 17 , 2025 | 11:23 PM