విద్యుదాఘాతంతో వృద్ధురాలి మృతి
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:41 PM
: ఉర్లాం పంచాయతీ జగ్గునాయుడుపేటకు చెందిన నక్క నాగమ్మ (60)అనే వృద్ధురాలు శనివారం విద్యుదాఘాతంతో మృతి చెందింది.
నరసన్నపేట, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఉర్లాం పంచాయతీ జగ్గునాయుడుపేటకు చెందిన నక్క నాగమ్మ (60)అనే వృద్ధురాలు శనివారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల మేరకు.. నాగమ్మ తన పశువుల కోసం పచ్చగడ్డి కోసేందుకు పొలాల్లోకి వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఓ పొలం గట్టుమీద తెగిపడివున్న తీగపై కాలువేయడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. సమీపంలో ఉన్న రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఉర్లాం విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి మతలాబుపేట, జగ్గునాయుడుపేట, వీఎన్‌పురం గ్రామాల్లోని బోరుబావులకు వేసే విద్యుత్ వైర్ తెగపడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంతోనే తన తల్లి మృతి చెందినట్లు కుమారులు అప్పలనాయుడు, వెంకటరమణ, రాముడు ఆరోపిస్తున్నారు. అప్పలనాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు.