Share News

Government schools: మా మంచి పాఠశాల

ABN , Publish Date - Apr 26 , 2025 | 11:20 PM

school development ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా అడ్మిషన్ల డ్రైవ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. సమగ్ర శిక్ష అధికారులు, ఉపాధ్యాయులు బృందాలుగా ఏర్పడి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండే చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.

Government schools: మా మంచి పాఠశాల
పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ముచ్చింద్రలో ఉపాధిహామీ కూలీలకు అవగాహన కల్పిస్తున్న ఎంఈవో(ఫైల్‌)

  • సర్కారు బడుల బలోపేతానికి చర్యలు

  • అడ్మిషన్ల కోసం జిల్లావ్యాప్తంగా డ్రైవ్‌

  • తల్లిదండ్రులను కలుస్తున్న ఉపాధ్యాయులు

  • విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి

  • ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా అడ్మిషన్ల డ్రైవ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. సమగ్ర శిక్ష అధికారులు, ఉపాధ్యాయులు బృందాలుగా ఏర్పడి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండే చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. గిరిజన ప్రాంతాలతోపాటు మత్స్యకార గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నేరుగా పిల్లల ఇళ్ల వద్దకు, ఉపాధిహామీ పనులు చేసే కూలీల వద్దకు వెళ్లి ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పథకాల గురించి వివరిస్తున్నారు. గ్రామాల్లో ర్యాలీల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

  • జిల్లాలో ఇదీ పరిస్థితి

  • జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1,915 ఉన్నాయి. ప్రాథమికోన్నత 315, ఉన్నత పాఠశాలలు 419 ఉన్నాయి. మొత్తంగా 2,649 పాఠశాలల్లో 1.60లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే విద్యార్థులు లేరన్న సాకుగా చూపి వైసీపీ ప్రభుత్వ హయాంలో 223 పాఠశాలలను సమీప స్కూళ్లలో విలీనం చేశారు. దీంతో జిల్లాలో పది మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు 485 ఉండడం ఆందోళన కలిగిస్తోంది. విలీనం నేపథ్యంలో మూడో తరగతికి వస్తే మరో పాఠశాలలో చేర్పాల్సి ఉండడంతో తల్లిదండ్రులు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రైవేటు బడుల వైపు మొగ్గుచూపారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు ఖాళీగా కనిపించాయి. ఇన్ని సమస్యలు ఉంచుకొని పాఠశాలల స్వరూపాన్నే మార్చేశామని వైసీపీ ప్రభుత్వం ఆర్భాటం చేసింది. నాడు-నేడు పథకంతో పాఠశాల భవనాలను నిర్మించినట్టు, ఫర్నీచర్‌ ఇతరత్రా సదుపాయాలు కల్పించినట్టు చెప్పింది. ఇలా పనులు చేపట్టిన వందలాది పాఠశాల భవనాలు వృథాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ పాలనలో నిర్వీర్యమైన విద్యావ్యవస్థను గాడిన పెట్టే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. విలీనమైన పాఠశాలలతోపాటు తరగతులను వెనక్కి రప్పించే ఏర్పాటులో ఉంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అడ్మిషన్‌ డ్రైవ్‌ చేపడుతోంది. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాల ఉంటే.. ప్రాథమికోన్నత పాఠశాలను కూడా కొనసాగించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పంచాయతీకి ఒక ఆదర్శ పాఠశాలను ఏర్పాటుచేసి.. తరగతికి ఒక ఉపాధ్యాయుడ్ని నియమించాలన్న ప్రతిపాదనపై కూడా ఆలోచిస్తోంది. పాఠశాలల సర్దుబాటు, విలీన ప్రక్రియ, ఉపాధ్యాయుల కేటాయింపులో తప్పులను సరిదిద్దనుంది.

  • స్కూల్‌ కాంప్లెక్స్‌లు కూడా..

  • స్కూల్‌ కాంప్లెక్స్‌లను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో స్కూల్‌ కాంప్లెక్స్‌లో 50మంది ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు చేపట్టనుంది. ఇప్పటివరకూ ప్రతి మండలంలో 10 నుంచి 12వరకూ స్కూల్‌ కాంప్లెక్సులు ఉండేవి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వాటి సంఖ్య సగానికి తగ్గే అవకాశం ఉంది. నిర్ధేశిత సంఖ్యలో ఉపాధ్యాయులు స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలకు హాజరైతే బోధన, ఇతరత్రా అంశాలపై ఉపాధ్యాయులకు మరింత అవగాహన పెరిగే అవకాశం ఉంది. గత ఐదేళ్లలో స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు తూతూమంత్రంగా జరిగాయి. పాఠశాలలపై హెచ్‌ఎంల పర్యవేక్షణ కూడా తగ్గడంతో విద్యాబోధన, పరీక్ష ఫలితాలపై ప్రభావం చూపింది. అందుకే తిరిగి హెచ్‌ఎంలకే పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనుంది. మండలానికి ఒక ఎంఈవోను పరిమితం చేయనుంది.

  • జిల్లావ్యాప్తంగా డ్రైవ్‌

    జిల్లావ్యాప్తంగా అడ్మిషన్ల డ్రైవ్‌ కొనసాగుతోంది. వేసవి సెలవుల ప్రారంభానికి ముందుగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సమగ్ర శిక్ష అధికారులు, సిబ్బంది, విద్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తల్లిదండ్రుల నుంచి సానుకూలతలు వస్తున్నాయి. ఎలాగైనా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

    - తిరుమల చైతన్య, డీఈవో, శ్రీకాకుళం

Updated Date - Apr 26 , 2025 | 11:20 PM