పాఠశాలలకు విద్యా బోధకులు
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:50 PM
Education instructors ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్న స్థానంలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సుదీర్ఘకాలం కిందట రెగ్యులర్ టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యా వలంటీర్లు పనిచేసేవారు. తాత్కాలిక ప్రాతిపదికన వారిని తీసుకొని పారితోషికం చెల్లించేవారు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పేరుతో ఆ విధానాన్ని తిరిగి ఇప్పుడు ప్రవేశపెట్టారు.
వలంటీర్ల స్థానంలో తాత్కాలిక నియామకాలు
జిల్లాకు 24 పోస్టులు మంజూరు
ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
ఈనెల 8 నుంచి విధుల్లో చేరేలా సన్నాహాలు
నరసన్నపేట/ పాతపట్నం, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్న స్థానంలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సుదీర్ఘకాలం కిందట రెగ్యులర్ టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యా వలంటీర్లు పనిచేసేవారు. తాత్కాలిక ప్రాతిపదికన వారిని తీసుకొని పారితోషికం చెల్లించేవారు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పేరుతో ఆ విధానాన్ని తిరిగి ఇప్పుడు ప్రవేశపెట్టారు. వీరిని తాత్కాలిక పద్ధతిలో నియమించనున్నారు. ఇటీవల మెగా డీఎస్సీతో ఉపాధ్యాయుల కొరత దాదాపు అధిగమించినప్పటికీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గతేడాది కంటే విద్యార్థుల సంఖ్య పెరగడం, కొందరు ఉపాధ్యాయులు పదవీ విరమణ చెందడంతో కొన్నిచోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి. ఎస్జీటీలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉండటంతో జిల్లాలో ఒక్క పోస్టుకూడా ఖాళీ లేదు. స్కూల్ అసిస్టెంట్ విభాగంలో గణితం-4, ఫిజికల్ సైన్సు -5, బయాలజీ - 9, సోషల్ -6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో 24 మంది స్కూల్ అసిస్టెంట్‌లను తాత్కాలికంగా నియమించేందుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇన్‌స్ట్రక్టర్లకు స్కూల్ అసిస్టెంట్‌లకు రూ.12,500 చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నారు. అర్హులైన అభ్యుర్థుల నుంచి బుధవారం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నెల 5వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రామం, తారువాత మండలం, ఆ తరువాత జిల్లాలో అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తారు. 75శాతం అకడమిక్ , 25శాతం బీఈడీ వెయిటేజ్ ఇవ్వనున్నారు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం చేసేందుకు జిల్లాస్థాయిలో కలెక్టర్ చైర్మన్, డీఈవో సెలక్షన్ కమిటీ కార్యదర్శి, డైట్ ప్రిన్సిపాల్ సభ్యులుగా ఉంటారు. ఎంఈవోలకు వచ్చిన దరఖాస్తులను డీఈవోకు పంపించి ఈనెల 7వ తేదీలోగా ఎంపిక పక్రియ పూర్తిచేస్తారు. ఎంపికైన వారు ఈ నెల 8వ తేదీ నుంచి విధుల్లో చేరనున్నారు. మే 7 వరకు విధుల్లో కొనసాగనున్నారు.
ఖాళీ పోస్టులు ఇవీ
గణితం విభాగంలో పాతపట్నం, బారువ(సోంపేట) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతోపాటు ఆర్.బెలగాం(కవిటి), డొంకూరు (ఇచ్ఛాపురం) జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఫిజికల్ సైన్స్ విభాగంలో పాతపట్నం, పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతోపాటు బీఆర్‌సీ పురం(సోంపేట), పి.మెళియాపుట్టుగ(కవిటి), కవిటి(ఒడియా మీడియం) జడ్పీ పాఠశాలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
బయోలజికల్ సైన్స్ విభాగంలో గొప్పిలి(మెళియపుట్టి), రెంటికోట(పలాస), ముండేల(కంచిలి), రాజపురం(కవిటి), పి.మెళియాపుట్టుగ (కవిటి), కవిటి (ఒడియా మీడియం), కొలిగాం (ఇచ్ఛాపురం), బిర్లంగి (ఇచ్ఛాపురం) జడ్పీ పాఠశాలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే బారువ(సోంపేట)లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కూడా ఒక పోస్టు భర్తీ చేయనున్నారు.
సోషల్ స్టడీస్ విభాగంలో కొలిగాం (ఇచ్ఛాపురం), బిర్లంగి (ఇచ్ఛాపురం), మండపల్లి(ఇచ్ఛాపురం), మాణిక్యపురం(కవిటి), రెంటికోట(పలాస), చాపర(మెళియాపుట్టి) జడ్పీ పాఠశాలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.