Share News

మునిసిపాలిటీల్లో ఈడీసీ

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:01 AM

New policy implemented instead of Nala వ్యవసాయభూమిని వ్యవసాయేతర భూములుగా మార్చడానికి గతంలో నాలా(నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ అసెస్‌మెంట్‌) ట్యాక్స్‌ అమలులో ఉండేది. ప్రజాసౌలభ్యం కోసం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల కిందట రద్దు చేసింది.

మునిసిపాలిటీల్లో ఈడీసీ
పలాస కాశీబుగ్గ మునిసిపల్‌ కార్యాలయం

నాలాకు బదులు కొత్త విధానం అమలు

భూమి విలువలో నాలుగు శాతం పన్ను

ఆ నిధులూ పట్టణాభివృద్ధికి ఖర్చు

పలాస, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): వ్యవసాయభూమిని వ్యవసాయేతర భూములుగా మార్చడానికి గతంలో నాలా(నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ అసెస్‌మెంట్‌) ట్యాక్స్‌ అమలులో ఉండేది. ప్రజాసౌలభ్యం కోసం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల కిందట రద్దు చేసింది. దీంతో అనేక ప్రాంతాల్లో ఎటువంటి పన్ను చెల్లించకుండా వ్యవసాయభూములను రియల్‌ ఎస్టేట్లుగా తయారు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి నాలా బదులు ఎక్స్‌టర్నల్‌ డెవలప్‌మెంట్‌ చార్జెస్‌(ఈడీసీ) విధానాన్ని అమలు చేయాలని గత నెల 3న ఆదేశాలు జారీ చేసింది. కానీ జిల్లాలో ఇంకా అమలుకు నోచుకోలేదు. ఈడీసీ అమలుపై బుధవారం ఏపీసీఆర్‌డీఏ బుధవారం ప్రత్యేక జీవో విడుదల చేసింది. దీని ప్రకారం కార్పొరేషన్లు, నగరపాలకసంస్థలు, మునిసిపాలిటీలతోపాటు గ్రామ పంచాయతీల్లో కూడా టౌన్‌ప్లానింగ్‌ చట్టం 1920 కింద అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కన్వక్షన్‌ పొందిన భూములు, 2006 సంవత్సరం జనవరి 2కు ముందు ప్లాట్లుగా చేసిన భూములకు ఈ చట్టం వర్తించదని స్పష్టం చేసింది.

గతంలో నాలా పన్ను వసూలు చేస్తే కేవలం రెవెన్యూశాఖకు నగదు జమయ్యేది. దీన్ని బదలాయించాల్సి ఉన్నా ప్రత్యేక అజమాయషీ దీనికి లేకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు జమయ్యేది. కానీ ఈడీపీలో మాత్రం నిధులు మొత్తం మునిసిపాలిటీల్లోని మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు, పార్కులు అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. దీన్ని అమలు చేసే బాధ్యత ఆయా మున్సిపాలిటిలు, నగరపాలకసంస్థల కమిషనర్లకు బాధ్యతలు అప్పగించింది.

గతంలో లేఅవుట్లు వేయాలంటే మున్సిపాలిటిల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోయేది. కానీ ప్రస్తుతం మాత్రం అన్నీ అనుమతులు ఆన్‌లైన్‌లో ఏపీడీపీఎంఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే సంబంధింత రుసుం చెల్లించాలి. మొత్తం భూమి, వాటి విలువ, ఏ ప్రాంతంలో ఉందనేని అందులోనే పొందుపరచాలి. భూమి విలువలో 4 శాతం ఈడీసీగా చెల్లించాలి. ఇందులో 85శాతం నిధులు ఆయా మునిసిపాలిటీ ఖాతాల్లోను, మిగిలిన 15 శాతం అభివృద్ధి అథారిటీకి వెళ్తుంది. ఇందులో తప్పుడు సమాచారం ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకుంటే రెట్టింపు జరిమానా విధిస్తారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో అన్నీ పత్రాలు సక్రమంగా ఉంటే అనుమతులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

జిల్లాలో శ్రీకాకుళం నగరపాలకసంస్థతోపాటు పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, ఆమదాలవలస మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎటువంటి అనుమతులులేకుండా వందల సంఖ్యలో లేఅవుట్లు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 500కు పైగా లేఅవుట్లు ఉంటాయని అంచనా. నిబంధనల ప్రకారం నాలా చెల్లించని వారు కొత్తగా ప్రవేశపెట్టిన ఈడీసీ చట్టం ప్రకారం పన్నులు చెల్లిస్తే మునిసిపాలిటీలకు అదనంగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈ చట్టాలను రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులు కఠినంగా అమలు చేయాల్సి ఉంది.

ఈ విషయంపై పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ కమిషనర్‌ ఎన్‌.రామారావు ప్రస్తావించగా.. ‘కొత్త చట్టం అమలుపై ఇంకా విధివిధానాలు రావాల్సి ఉంది. నాలా పేరుతో అనేక వేల ఎకరాల భూమి దుర్వినియోగమైంది. ఆ చట్టంలో పది శాతం పన్ను చెల్లిస్తే ఇందులో కేవలం 4 శాతమే చెల్లించాలి. దీనివల్ల అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఈ నిధులతో పురపాలక సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంద’ని తెలిపారు.

Updated Date - Oct 10 , 2025 | 12:01 AM