Share News

Hotels: ఇక్కడ తింటే.. జబ్బులు గ్యారంటీ!

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:57 PM

Public health risk జిల్లాలో పలు హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లలో నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పాచిపోయిన ఆహార పదార్థాలను వేడి చేసి విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ హోటళ్లు, దాబాలు, పాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు వెలిశాయి.

Hotels: ఇక్కడ తింటే.. జబ్బులు గ్యారంటీ!

  • పాచిపోయిన పదార్థాలే అధిక ధరకు విక్రయం

  • హోటళ్లు, దాబాల్లో కానరాని నిబంధనలు

  • కొరవడిన అధికారుల పర్యవేక్షణ

  • అప్పుడప్పుడూ నామమాత్రపు తనిఖీలు

  • నరసన్నపేటలోని ఒక పెట్రోల్‌ బంక్‌ సమీపాన హోటల్‌లో కొన్నాళ్ల కిందట ఓ వ్యక్తి ఇడ్లీ తింటుండగా.. ప్లేట్‌లో బొద్దింక కనిపించింది. దీనిపై అప్పట్లో వినియోగదారులు ప్రశ్నించగా.. హోటల్‌ వ్యాపారి బుకాయించాడు. ఇటీవల అదే హోటల్‌లో ఉడకని కూరలు, చట్నీలతో టిఫిన్‌ విక్రయిస్తున్నారని విశ్రాంత ఉపాధ్యాయుడు ముద్దాడ గోపాలరావు సామాజిక మాధ్యమాల్లో మొరపెట్టుకున్నా.. కనీసం అటువైపు అధికారులు చూడడం లేదు.

    ..................

  • నరసన్నపేటలోని శివాలయం సమీపంలో డ్రైనేజీపై ఒక పాస్ట్‌ఫుడ్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ హోటల్‌లో చైనా సాల్ట్‌, వివిధ వస్తువులకు కలర్లు వాడుతూ.. సూప్‌లు రుచిగా వచ్చేందుకు ఏదో పొడి కలుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. వీటిపై ఆహారకల్తీ నియంత్రణ అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.

    ..................

  • మడపాం టోల్‌ప్లాజా వద్ద హోటళ్లు, దాబాల్లో పాచిన పదార్థాలనే వేడి చేసి విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నాన్‌వేజ్‌ అయితే ఫ్రిజ్‌లో రోజుల తరబడి నిల్వ చేసి.. తర్వాత వాటికి రంగులు కలిపి వేడిచేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

  • నరసన్నపేట, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లలో నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పాచిపోయిన ఆహార పదార్థాలను వేడి చేసి విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ హోటళ్లు, దాబాలు, పాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు వెలిశాయి. నరసన్నపేటలోనే చిన్న, పెద్ద హోటళ్లు, దాబాలు సుమారు 68 ఉన్నాయి. వీటిలోని చాలా హోటళ్లలో పాచిపోయిన చెట్నీలకు తాళింపు వేసి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. దాబాల్లో అయితే రెండు వారాల కిందట నిల్వ ఉంచిన పదార్థాలను వేడి చేసి.. వాటిని విక్రయిస్తూ దోచుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. సాంబారు, రసం, వేపుడు కూరలను నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే తయారు చేస్తున్నారు. మాంసాహారం పదార్థాలపై కలర్‌ వేసి.. వేడి చేసి అంటగడుతున్నారు. వీటిని తిన్న పలువురు అనారోగ్యానికి గురవుతున్నారు.

  • నిబంధనలు బేఖాతర్‌

    హోటల్స్‌ నిర్వహణ చేయాలంటే ముందుకు పంచాయతీ/ మునిసిపాలిటీ అధికారుల అనుమతులు పొందాలి. వినియోగదారులకు శుచి, రుచికరమైన పదార్థాలను పెడతామని లేదంటే అనుమతులు రద్దు చేయాలనే ఒప్పంద ప్రతాన్ని హోటళ్ల నిర్వాహకులు అధికారులకు సమర్పించాలి. ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారుల నుంచి కూడా అనుమతులు పొందాలి. హోటళ్లలో వేడినీటిని మాత్రమే అందజేయాలి. కానీ జిల్లాలో ఏ ఒక్కరూ ఇవేవీ పాటించడం లేదు. ఇష్టానుసారంగా మురికికాలువలపై టిఫిన్‌ దుకాణాలు ఏర్పాటు చేస్తూ.. నిల్వ పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. చాలా హోటల్స్‌లో సాంబరు ఇడ్లీ రూ.50, ఇడ్లీ రూ.15, పూరీ రూ.30, దోస రూ.50, ఉల్లిదోస రూ.60, చపాతి రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక దాబాలు, పెద్ద హాటల్స్‌లో చికెన్‌తో ఏ కూర తీసుకున్నా.. రూ.220 నుంచి రూ.380 వరకు వసూలు చేస్తున్నారు. ధరలు నియంత్రించాల్సిన అధికారులు.. వారి దగ్గర మామ్మూళ్లు తీసుకుని చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ఆహార కల్తీనియంత్రణ అధికారి వెంకటరత్నం వద్ద ప్రస్ర్తావించగా.. హోటళ్లు, దాబాల్లో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. డ్రైనేజీ మీద షాపులు, హోటల్స్‌కు తమ శాఖ అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. అనుమతి లేకుండా వ్యాపారాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Apr 10 , 2025 | 11:57 PM