Share News

marijuana smuggler: ఆర్థిక పరిస్థితి బాగాలేక.. గంజాయి స్మగ్లర్లుగా మారి..

ABN , Publish Date - Sep 12 , 2025 | 11:26 PM

Couple caught by railway police with 40 kg of ganja బీహార్‌ రాష్ట్రానికి చెందిన వారిద్దరికీ ఆరు నెలల కిందట పెళ్లయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఓ బ్రోకర్‌ ఇచ్చిన సలహాతో ఆ దంపతులిద్దరూ గంజాయి స్మగ్లర్లుగా మారారు. చివరికి 40 కిలోల గంజాయి రవాణా చేస్తూ రైల్వే పలాస రైల్వే పోలీసులకు పట్టుబడ్డారు.

marijuana smuggler: ఆర్థిక పరిస్థితి బాగాలేక.. గంజాయి స్మగ్లర్లుగా మారి..
పట్టుబడిన నిందితులు, గంజాయితో పలాస రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్‌ అధికారులు..

  • 40 కిలోలతో రైల్వేపోలీసులకు పట్టుబడిన దంపతులు

  • నిందితులు ఒడిశావాసులు.. ఆరునెలల క్రితం వివాహం

  • పలాస, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): బీహార్‌ రాష్ట్రానికి చెందిన వారిద్దరికీ ఆరు నెలల కిందట పెళ్లయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఓ బ్రోకర్‌ ఇచ్చిన సలహాతో ఆ దంపతులిద్దరూ గంజాయి స్మగ్లర్లుగా మారారు. చివరికి 40 కిలోల గంజాయి రవాణా చేస్తూ రైల్వే పలాస రైల్వే పోలీసులకు పట్టుబడ్డారు. శుక్రవారం రైల్వే సీఐ ఏ.రవికుమార్‌ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘బీహార్‌ రాష్ట్రం భోజ్‌పూర్‌ జిల్లా బిహయా గ్రామానికి చెందిన జూలి ప్రవీణ్‌, గాంధీనగర్‌కి చెందిన సాజద్‌ అన్సారిలు ఆరు నెలల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి సరైన పనులు దొరక్క, కుటుంబ అవసరాలు తీరక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో కోల్‌కతాకు చెందిన ఓ గంజాయి స్మగ్లర్‌తో పరిచయం ఏర్పడింది. వీరి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఒడిశాలో ఓ అడ్రస్‌కు వెళితే గంజాయి ఇస్తారని, దాన్ని తీసుకుని తమకు అప్పగిస్తే ట్రిప్‌నకు రూ.10వేలు ఇస్తామని చెప్పడంతో దంపతులిద్దరూ అంగీకరించారు. వారు ఒడిశా రాష్ట్రం బరంపూర్‌లో రెండు రోజుల కిందట మకాం వేశారు. అనంతరం 40 కిలోల గంజాయిని మూడు బ్యాగుల్లో అమర్చి శుక్రవారం పలాస రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రైల్వే ఫుట్‌బ్రిడ్జి వద్ద బ్యాగులతో వారిద్దరూ అనుమానస్పదస్థితిలో కనిపించడంతో ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ ఎం.మాల్యాద్రి వారిని ప్రశ్నించారు. బ్యాగులు తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని, ఆ దంపతులను రైల్వే పోలీసులకు అప్పగించారు. వారిద్దరినీ ఎస్‌ఐ ఎం.మధుసూదనరావు అరెస్టు చేసి.. రైల్వేకోర్టులో హాజరుపరిచార’ని సీఐ రవికుమార్‌ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా నిందితులను, గంజాయిని పట్టుకున్న ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐను అభినందించారు. రైల్వేస్టేషన్‌లో ప్రతి రైలును తనిఖీ చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి, మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. గంజాయి విక్రయించినా, రవాణా చేసినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆర్పీఎఫ్‌ సీఐ ఎం.మహాపాత్రో, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 11:26 PM