ఆత్మహత్య కేసుపై డీఎస్పీ విచారణ
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:53 PM
చిట్టివలస గ్రామంలో ఇటీవల జరిగిన వరకట్న వేధింపులు, ఆత్మహత్య కేసుపై ఆదివారం డీఎస్పీ సీహెచ్ వివేకానంద విచారణ చేపట్టారు.
ఆమదాలవలస, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): చిట్టివలస గ్రామంలో ఇటీవల జరిగిన వరకట్న వేధింపులు, ఆత్మహత్య కేసుపై ఆదివారం డీఎస్పీ సీహెచ్ వివేకానంద విచారణ చేపట్టారు. నివరి సింహాచలం, పద్మ దంపతుల చిన్న కుమార్తె పూర్ణ భర్త, అత్తమామల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కేసు నమోదు చేసిన డీఎస్పీ.. మృతురాలి తల్లిదండ్రులు సింహాచలం, పద్మలను విచారించి వివరాలను సేకరించారు. తమ కుమార్తె వివాహ సమయంలో రూ.ఐదు లక్షల నగదు, ఒక ద్విచక్ర వాహనం, 50 సెంట్లు భూమి, రూ.2 లక్షల సారి సామగ్రి ఇచ్చామన్నా రు. అయితే అత్తింటివారు మరో 50 సెంట్లు భూమిని తీసుకురావాలంటూ కుమార్తెను నిత్యమూ వేధించేవారని ఆమె తెలిపినప్పటికీ పెళ్లయిన నాలుగు నెలలకే ఈ పరిస్థితి రావడంతో ఆమెకు నప్పజెప్పి పంపించేవారమన్నారు. కొన్ని రోజులు సమయం ఇస్తే తల్లిదండ్రులకు నచ్చజెప్పి 50 సెంట్లు భూమి తీసుకొస్తానని చెప్పినప్పటికీ అల్లుడు మధుసూధనరావు తక్షణం భూమిని తీసుకురాకుంటూ విడిచిపెడతానని శారీరకంగా, మానసికంగా వేధించాడని, వాటిని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు డీఎస్పీకి వారు వివరించారు. విచారణలో ఎస్‌ఐ సనపల బాలరాజు, సర్పంచ్ ప్రతినిధి గుజ్జల లక్ష్మణరావు, గ్రామస్థులు ఉన్నారు.