త్వరలో డీఎస్సీ ఫలితాలు
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:13 AM
మెగా డీఎస్సీ ఫలితాలను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది.
- సన్నాహాలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ
- జిల్లాలో భర్తీకానున్న 543 ఉపాధ్యాయ పోస్టులు
ఎచ్చెర్ల, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ ఫలితాలను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. మరికొద్ది రోజుల్లో ఫలితాలు విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. జిల్లాకు సంబంధించి 543 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. డీఎస్సీ పరీక్షలు ఈ ఏడాది జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు జరిగాయి. జిల్లాలోని ఐదు కేంద్రాలతో పాటు ఒడిశాలోని ఓ కేంద్రంలో జరిగిన ఈ పరీక్షలను 35వేల మంది అభ్యర్థులు రాశారు. జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టులు ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు వెళ్లి డీఎస్సీ రాశారు.
పోటీ భారీగానే..
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదుగో ఇదుగో అంటూ ఊరించడమే తప్ప ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించి పరీక్షలు కూడా నిర్వహించింది. జిల్లాలో మెగా డీఎస్సీ ద్వారా జడ్పీ, మున్సిపల్, ప్రభుత్వ మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో 458 పోస్టులు, ఏజెన్సీ ప్రాంతంలో 85 పోస్టులు మొత్తం 543 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టుల కోసం సుమారు 35వేల మంది పోటీపడుతున్నారు. పోస్టుల సంఖ్య స్వల్పంగా ఉండడం, పోటీ తీవ్రంగా ఉండడంతో ఎవరికి ఉద్యోగం వస్తుందోనని అభ్యర్థులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు మొదటి వారంలో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మరికొద్ది రోజుల్లోనే కొత్త ఉపాధ్యాయులు కొలువు తీరనుండడంతో పాఠశాలలకు కొత్త కళ రానుంది.
- జిల్లాలో చాలా పాఠశాలలు సింగిల్ టీచర్లతోనే నడుస్తున్నాయి. వాస్తవానికి 1ః20 నిష్పత్తిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉండాలి. కానీ, కొన్ని చోట్ల 20 మంది విద్యార్థులు దాటినా ఏకోపాధ్యాయులతోనే నిర్వహిస్తున్నారు. మెగా డీఎస్పీ ద్వారా కొత్త ఉపాధ్యాయులు వస్తే విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి.
విద్యా ప్రమాణాలు మెరుగు..
విద్యా ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం సరఫరా చేస్తుండడంతో విద్యార్థులు కడుపునిండా తింటున్నారు. గత నెల 10న మెగా పీటీఎం (పేరెంట్ టీచర్ మీటింగ్)ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించి రికార్డు సృష్టించింది. ఈ నెల 11 నుంచి ఫార్మేటివ్ ఎసెస్‌మెంటు పరీక్షలను నిర్వహించనుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ప్రత్యేకంగా ఫార్మేటివ్ బుక్‌లెట్‌లను ముద్రించింది. అలాగే ఈ ఏడాది ఉపాధ్యాయులకు హేండ్ బుక్‌లను కూడా అందజేసింది.