Share News

DSC recruitment: 19న డీఎస్సీ నియామక పత్రాలు

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:58 PM

DSC recruitment forms at amaravathi మెగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 19వ తేదీన అమరావతిలో నియామక పత్రాలు అందజేస్తారు. ఇందుకోసం వెలగపూడిలో సచివాలయం వెనుక అభినందన సభ ఏర్పాటుకు విద్యా శాఖ సన్నాహాలు చేస్తోంది.

DSC recruitment: 19న డీఎస్సీ నియామక పత్రాలు

  • సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌ చేతుల మీదుగా..

  • వెలగపూడిలో సచివాలయం సమీపాన అభినందన సభ

  • ఉత్తరాంధ్రలోని 2,660 మంది అభ్యర్థుల కోసం 118 బస్సుల ఏర్పాటు

  • కార్యక్రమం ముగిసిన తర్వాత అభ్యర్థులకు పది రోజులపాటు శిక్షణ

  • విశాఖపట్నం/నరసన్నపేట, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 19వ తేదీన అమరావతిలో నియామక పత్రాలు అందజేస్తారు. ఇందుకోసం వెలగపూడిలో సచివాలయం వెనుక అభినందన సభ ఏర్పాటుకు విద్యా శాఖ సన్నాహాలు చేస్తోంది. ఉత్తరాంధ్రలో 2,660 మందికి నియామక పత్రాలు అందజేస్తారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీ, గురుకులాలు/మోడల్‌ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, టీజీటీ, పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తోడుగా కుటుంబ సభ్యుల్లో ఒకరిని అభినందన సభకు అనుమతిస్తారు. ఉత్తరాంధ్ర నుంచి అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులను తీసుకువెళ్లడానికి సుమారు 120 బస్సులు ఏర్పాటుచేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి ఈనెల 18వ తేదీ ఉదయం బస్సులు బయలుదేరతాయి. ఆరోజు రాత్రికి విజయవాడ సమీపంలో వారికి వసతి ఏర్పాటుచేస్తారు. 19వ తేదీ ఉదయం అభినందన సభలో జిల్లాల నుంచి ఎంపిక చేసిన కొద్దిమందికి సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌, ఇతర ప్రముఖులు నియామక పత్రాలు అందజేస్తారు. మిగిలిన వారికి అదే ప్రాంగణంలో ఏర్పాటుచేసే కౌంటర్ల ద్వారా పత్రాలు ఇవ్వనున్నారు. అభినందన సభ ముగిసిన తరువాత తిరిగి అవే బస్సుల్లో జిల్లాలకు తీసుకువస్తారు. ఆ తరువాత ఎంపికైన అభ్యర్థులకు పాఠశాలల నిర్వహణ, బోధన, పరిపాలన, ఇతర అంశాలపై జిల్లాల వారీగా పది రోజులపాటు శిక్షణ ఇస్తారు. ఇప్పటివరకూ డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్లను కౌన్సెలింగ్‌లోనే పాఠశాలలు కేటాయించేసేవారు. ఈ పర్యాయం పది రోజుల శిక్షణ ఇచ్చిన తరువాత పాఠశాలలకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఉద్యోగికి శిక్షణ అవసరమని విద్యా శాఖ అధికారి ఒకరు తెలిపారు. దసరా సెలవులు తరువాత కొత్త టీచర్లకు పాఠశాలలు కేటాయించనున్నట్టు పేర్కొన్నారు.

  • జిల్లాకు ఉపాధ్యాయుల ఎంపిక జాబితా

  • జిల్లాలో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇటీవల డీఎస్సీ మెరిట్‌ జాబితాలో అర్హులైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను మూడు విడతల్లో పరిశీలన చేపట్టారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కొత్త ఉపాధ్యాయుల ఎంపిక జాబితాను చేపట్టి జిల్లా కమిటీ ఆమోదం మేరకు జిల్లా విద్యాశాఖాధికారికి శనివారం పంపించినట్లు సమాచారం. కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీ ఈ జాబితాలోని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, ఆమోదించిన తరువాత అభ్యర్థులకు కాల్‌ లెటర్స్‌ పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పరీక్షలను నిర్వహించి, ఆగస్టు 13న ప్రభుత్వం ఫలితాలను ప్రకటించింది. గత నెలలో మెరిట్‌ జాబితాను ప్రకటించి రోస్టర్‌ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక నిర్వహించారు. జిల్లాలో మొత్తం 543 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లాపరిషత్‌ ఆధ్వర్యంలో 407, మునిసిపాలిటీ ఆధ్వర్యంలో 51, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 85 మంది ఉపాధ్యాయులను నియమించనున్నారు. సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులను 113మంది, ఇంగ్లీషులో 65 మంది, తెలుగు - 37, బయాలజీ -34, గణితం-33, ఫిజికల్‌ సైన్సు-14, సోషల్‌ స్టడీస్‌-70, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌-81 పోస్టులకు అభ్యర్థులను తుది జాబితాలో ఎంపిక చేయనున్నారు. కొంతమంది డీఎస్సీ అభ్యర్థులు మూడు లేదా నాలుగు పోస్టులకు ఎంపికయ్యారు. వారి నిర్ణయం మేరకు కావాల్సిన పోస్టుకు ఎంపిక చేసి.. మిగతా వాటిని మెరిట్‌ జాబితాలో తదుపరి అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఎంపికైన ఉపాధ్యాయులకు దసరా సెలవుల్లో పదిరోజులపాటు శిక్షణ ఇచ్చి, పోస్టింగు ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఈ విషయంపై ఇన్‌చార్జి డీఈవో రవిబాబు వద్ద ప్రస్తావించగా ‘డీఎస్సీ ఎంపిక జాబితాను జిల్లా కమిటీ ఆమోదించాక రాష్ట్ర అధికారులకు పంపిస్తాం. అభ్యర్థులకు రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉత్తర్వులు అందజేస్తామ’ని తెలిపారు.

Updated Date - Sep 13 , 2025 | 11:58 PM