ముంచుకొస్తున్న... ‘మొంథా’
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:20 AM
Storm clouds among farmers అన్నదాతల గుండెల్లో ‘మొంథా’ తుఫాన్ హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి. పంట చేతికి అందే సమయంలో ఏటా తుఫాన్లు దాడి చేస్తున్నాయి. ఈ ఏడాదీ ఆ కలవరం తప్పడం లేదు. మరో రెండువారాల్లో వరి కోతలకు సిద్ధమవుతున్న రైతులు తుఫాన్ హెచ్చరికలతో భీతిల్లుతున్నారు.
రైతుల్లో కలవరం
మరో 15 రోజుల్లో కోతలు
ఇంతలోనే తుఫాన్ గుబులు
నరసన్నపేట, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): అన్నదాతల గుండెల్లో ‘మొంథా’ తుఫాన్ హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి. పంట చేతికి అందే సమయంలో ఏటా తుఫాన్లు దాడి చేస్తున్నాయి. ఈ ఏడాదీ ఆ కలవరం తప్పడం లేదు. మరో రెండువారాల్లో వరి కోతలకు సిద్ధమవుతున్న రైతులు తుఫాన్ హెచ్చరికలతో భీతిల్లుతున్నారు. తుఫాన్ ప్రభావంతో రేపటి నుంచి రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసింది. పంట చేతికి అందే సమయంలో ఈదురుగాలులు వీస్తే భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. రూ.వేలల్లో పెట్టుబడి పెట్టి.. ఆరుగాలం శ్రమించే అన్నదాతలు నోటి వద్దకు కూడు వచ్చే సమయంలో తుఫాన్ హెచ్చరికలతో నిద్ర కు దూరమవుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 3.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. మరో 32 వేల ఎకరాల్లో మొక్కజోన్న, 12 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలను సాగు చేశారు. జిల్లాలో పాతపట్నం, సారవకోట, నరసన్నపేట, జలుమూరు, తదితర మండలాల్లో అక్కడక్కడ కోతలు పూర్తయ్యాయి. సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, ఆమదావలస, గార, శ్రీకాకుళం రూరల్, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, టెక్కలి, నందిగాం, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, తదితర మండలాల్లో సుమారు 1.70 లక్షల ఎకరాల్లో వరి కోత దశకు వస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో పాలు పోసుకునే దశలో ఉంది. ఈ సమయంలో కనీసం 40 కి.మీ. వేగంతో గాలులు వీచినా వరిపైరు నేలకొరిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లావేరు. ఎచ్చెర్ల, రణస్థలం, జి.సిగడాం, పొందూరు తదితర మండలాల్లో మొక్కజొన్నను భారీగా సాగు చేస్తున్నారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటే భారీ స్థాయిలో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు.
మొంథా ప్రభావంతో భారీగా వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఇప్పటికే కో సిన ధాన్యాన్ని భద్రపరుచుకోవాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా కాపాడుకునేందుకు తహసీల్దార్ కార్యాలయాల్లో టార్పాలిన్లు ఉచితంగా అందించేందుకు సిద్ధంగా ఉంచాలని కోరుతున్నారు. తుఫాన్‌పై రైతులను అప్రమత్తం చేయాలని రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు ప్రభుత్వం సూచించింది. తీర ప్రాంతాల్లోనూ ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. తుఫాన్‌కు ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు.
తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి: ఇన్‌చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
శ్రీకాకుళం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ‘మొంథా’ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అఽధికారులను ఆదేశించారు. శనివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో ఆయన మాట్లాడుతూ.. ‘మొంథా తుఫాన్ జిల్లాపై ఈ నెల 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ప్రతీ మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాల’ని ఆదేశించారు. కలెక్టరేట్‌లో 08942-240557 నెంబరుతో కంట్రోల్‌రూమ్ సిద్ధంగా ఉందన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. అత్యవసర విధుల్లో ఉన్న అధికారుల సెలవులను రద్దు చేస్తున్నామన్నారు. ప్రజలు నదులు, చెరువులు, సాగునీటి కాలువల వద్దకు వెళ్లకుండా చూడాలని, అవసరమైతే అటువంటి ప్రాంతాల్లో గస్తీని ఏర్పాటు చేయాలని తెలిపారు. మట్టి గోడలతో ఉన్న ఇళ్లు, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో నివసించే వారిని సురక్షిత, పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. విద్యుత్, తాగునీటికి అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఫోటో 25 ఎన్‌ఎన్‌పి 5
1111111