డ్వాక్రా మహిళలకు డ్రోన్లు
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:04 AM
distribution at 80 percent discount మహిళల ఆర్థికాభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. సంక్షేమ పథకాలతోపాటు పౌరసేవల్లోనూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆర్థికాభివృద్ధిలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై డ్రోన్లు అందజేయనున్నాయి.
జిల్లాకు 29 మంజూరు
80 శాతం రాయితీపై పంపిణీకి ఏర్పాట్లు
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థికాభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. సంక్షేమ పథకాలతోపాటు పౌరసేవల్లోనూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆర్థికాభివృద్ధిలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై డ్రోన్లు అందజేయనున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో వ్యవసాయ సాగులో భాగంగా డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. రసాయనాలు పిచికారీ చేయడంలో డ్రోన్లు వినియోగిస్తున్నారు. అటువంటివి జిల్లాలో 29 డ్రోన్లను స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించారు. డీఆర్‌డీఏ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఒక్కో డ్రోన్ రూ.9.80 లక్షలుకాగా.. 80శాతం రాయితీపై అందిస్తారు. అంటే లబ్ధిదారులు రూ.1.96 లక్షలు చెల్లిస్తే చాలు. ఈ నగదు కూడా బ్యాంకు రుణంగా అందిస్తుంది.
మహిళలే కీలకం..
వ్యవసాయంలో మహిళల పాత్ర కీలకం. వారు సహకారం అందిస్తేనే సాగు సాధ్యమయ్యేది. సాగులో భాగంగా రసాయనాలు, ఎరువుల పిచికారీ సమయంలో ఇబ్బందికర సమస్యలు, రుగ్మతలు ఎదురవుతున్నాయి. వీటిని పిచికారీ చేసేందుకు కూలీలు సైతం అధిక వేతనాలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా డ్రోన్ల ద్వారా పని కానిచ్చేయవచ్చు. ఎకరా పొలంలో పది నిమిషాల్లోనే పిచికారీ పూర్తిచేయొచ్చు. డ్రోన్ల మంజూరుకుగానూ ప్రస్తుతం స్వయం సహాయక సంఘ సభ్యుల ఎంపిక జరుగుతోంది. సాధారణంగా రైతు కుటుంబాల నుంచి స్వయం సహాయక సభ్యులు ఉంటారు. అటువంటి వారికి ఈ పథకం ఎంతో ప్రయోజనం. ఎంపికైన మహిళలకు 15 రోజులపాటు శిక్షణనిస్తారు. వారి కుటుంబసభ్యుడికి మెకానిక్‌గా, మరమ్మతులకుగాను డ్రోన్ అసిస్టెంట్‌గా 5 రోజుల పాటు శిక్షణనిస్తారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో ఖరీఫ్‌లో 3.64 లక్షల ఎకరాలు, రబీలో 2 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. మొత్తం 3.56 లక్షల మంది రైతులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో స్వయం సహాయక సంఘాలు 48,256 ఉండగా.. 5,27,161 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతానికి 29 డ్రోన్లు మంజూరు చేశారు. ఆసక్తి, ఆదరణ చూసి మిగతా యూనిట్లు మంజూరు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జగన్ సర్కారు అప్పట్లో డ్రోన్లు అందిస్తామని హడావుడి చేసింది. కానీ డ్రోన్లను అందించలేకపోయంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వ్యవసాయ అవసరాలకుగాను డ్రోన్లను అందించేందుకు కసరత్తు చేస్తోంది. అది కూడా మహిళా సంఘాల సభ్యులకు అందిస్తుండడం విశేషం.
వినియోగించుకోవాలి
జిల్లాకు 29 డ్రోన్లు మంజూరయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై అందిస్తున్నాయి. ప్రస్తుతం ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఎంపికైన వారికి శిక్షణ కూడా ఇస్తాం. 80శాతం రాయితీపై అందిస్తున్న డ్రోన్లను స్వయం సహాయక సంఘాల సభ్యులు సద్వినియోగిం చేసుకోవాలి.
- కిరణ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ, శ్రీకాకుళం