Share News

ఎండుచేప.. ఎంతోమేలు

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:28 AM

Dried fish imported ఆంధ్రా-ఒడిశాలో ఎక్కువగా వినియోగించే ఎండుచేపలకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. ఎన్నో పోషక విలువలు వీటి సొంతం కావడంతో.. ఔషధ తయారీకి వీటిని వినియోగిస్తున్నారు.

ఎండుచేప.. ఎంతోమేలు
పురుషోత్తపురం జంక్షన్‌ వద్ద ఎగుమతికి సిద్ధం చేసిన ఎండుచేపలు

  • జిల్లా నుంచి విదేశాలకు ఎగమతి

  • ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా

  • ఔషధాల తయారీలో వినియోగం

  • ప్రొటీన్స్‌ ఎక్కువంటున్న వైద్యులు

  • మార్కెటింగ్‌, రవాణా కల్పిస్తే మత్స్యకారులకు ప్రయోజనం

  • ఇచ్ఛాపురం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశాలో ఎక్కువగా వినియోగించే ఎండుచేపలకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. ఎన్నో పోషక విలువలు వీటి సొంతం కావడంతో.. ఔషధ తయారీకి వీటిని వినియోగిస్తున్నారు. కాగా, జిల్లాలో అత్యధిక తీరప్రాంతం ఉన్నా మార్కెటింగ్‌, రవాణా సౌకర్యాలు లేక మత్స్యకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లావ్యాప్తంగా 11 తీర మండలాల్లో ఎండుచేపల ఉత్పత్తి 6 నుంచి 9 శాతం వరకూ ఉంటుంది. దాదాపు 30 రకాల ఎండుచేపలు లభ్యమవుతాయి. పండుగబ్బ, చావిడాలు, నెత్తళ్లు, ఎండిరెయ్యిలు, పూసపరిగలు, ఒంజిరాలు, కట్టిపరిగలు, రొయ్యపొట్టు, ఎర్ర రొయ్యపారలు, కానగర్తలు, కవ్వాలు, గులివిందలు, ఇసుకదంతాలు, గొరసలు.. ఇలా ఎన్నోరకాల చేపలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా నుంచి నెలకు 40 టన్నుల వరకూ ఎండుచేపలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రధానంగా శ్రీలంక, బంగ్లాదేశ్‌, సింగపూర్‌, బర్మా (మయన్మార్‌) ఎక్కువగా తరలిస్తుంటారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ఇచ్ఛాపురంలోని పురుషోత్తపురం జంక్షన్‌ వద్ద ఒడిశాకు చెందిన బెహరా ఎండు చేపలు తరలించే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మత్స్యకారుల వద్ద ఎండుచేపలను కొనుగోలు చేసి.. అక్కడ నుంచే ఇతర రాష్ట్రాలకు ప్రతీరోజు లారీలతో లోడ్లు పంపిస్తుంటారు. ఇలా లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. ఇక్కడ నుంచే ఒడిశా రాష్ట్రం బరంపురం, కోల్‌కత్తాతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా లోడ్లు పంపిస్తున్నామని బెహరా తెలిపారు.

  • ఔషధ గుణాలు అధికం..

  • ఎండుచేపలు ఔషధ తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. జిల్లాలో లభ్యమయ్యే ఎండుచేపలను ఎక్కువగా ఔషధ తయారీకి తరలిస్తుంటారు. మామూలు చేపలతో పోల్చితే ఎండు చేపల్లో ప్రోటీన్స్‌ ఎక్కువగా ఉంటాయి. కండరాలు, శరీరానికి ఎక్కువగా బలాన్నిస్తాయి. కాల్షియం, పాస్పరస్‌ పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలు గట్టిగా మారేందుకు దోహదపడతాయి. ఒమేగా 3 ప్యాటీ ఆమ్లాలతో గుండె, మెదడుకు చాలా మంచిది. ఐరన్‌, బీ విటమిన్స్‌తో రోగ నిరోధకశక్తి చక్కగా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. నాన్‌ వెజిటేరియన్స్‌ వారు దీనిని సంప్రదాయ వంటకంగా చేసుకుంటే మేలని చెబుతున్నారు.

  • ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

  • ఎండు చేపల విషయంలో ఆహార ప్రియులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీ, మూత్రపిండాలు, లివర్‌, గుండె సంబంధిత సమస్యలున్నవారు వీటికి దూరంగా ఉంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. వంటచేసే ముందు వీటిని శుభ్రంగా నీటితో కడిగి ఇసుక లేదా ఎండిన పొలుసును తొలగించాలి. చేపలను గోరువెచ్చని నీటిలో 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టాలి. వాటిని కడిగిన తర్వాత అందులో పసుపు, వెనిగర్‌, పాలు వేసి కడిగితే దుర్వాసనతోపాటు బ్యాక్టీరియా పోతుంది. తర్వాత పొడి వస్త్రంపై ఉంచి 5 నుంచి 10 నిమిషాలు ఆరబెట్టిన తరువాత వండుకోవాలి.

  • సదుపాయాలు లేక..

  • ఎండుచేపల సాగు చాలా కష్టం. మత్స్యకారులకు ఇది కత్తిమీద సామే. తీర ప్రాంతాల్లో వీటిని ఎండబెట్టేందుకు సరైన ప్రదేశాలు ఉండవు. గతంలో నిర్మించిన ప్లాట్‌ఫారాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉప్పునీరు తగలడంతో ఎక్కువగా పాడవుతుంటాయి. సాధారణంగా మత్స్యకారులు తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఎండపెడుతుంటారు. తుఫాన్ల సమయంలో ఇలా ఎండబెట్టిన చేపలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంటుంది. అయితే పచ్చిచేపలతో పాటు ఎండుచేపలు సాగు చేస్తేనే మత్స్యకారులకు లాభం. జిల్లాలో ఎండుచేపల సంరక్షణతో పాటు మార్కెటింగ్‌ రవాణా సదుపాయం కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు.

  • సదుపాయాలు కల్పించాలి...

  • జిల్లాలో ఎండుచేపల ఉత్పత్తి ఎక్కువగా ఉంది. మార్కెటింగ్‌, రవాణా సదుపాయం కల్పిస్తే మత్స్యకారులకు గిట్టుబాటు పెరుగుతుంది. ప్రస్తుతం జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు ఎండుచేపల రవాణా జరుగుతోంది. తీర ప్రాంతంలో సంరక్షణ, ఆరబెట్టేందుకు సరైన వసతులు లేవు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.

    - ఎస్‌.గోపాల్‌, మత్స్యకారుడు, డొంకూరు

Updated Date - Dec 21 , 2025 | 12:28 AM