కార్గో ఎయిర్‌పోర్టుకు అడ్డుతగలొద్దు
ABN , Publish Date - Jul 16 , 2025 | 11:30 PM
‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆలోచన విధానం మేరకే పలాస నియోజకవర్గంలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మించదలపెట్టాం. దీనికి ఎవరూ అడ్డుతగలొద్దు.’ అని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.
- నిర్మాణం పూర్తయితే పలాస అభివృద్ధి చెందుతుంది
- భూముల విలువ పెరుగుతుంది
- పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి
- ప్రజాభిప్రాయసేకరణలో ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస, జూలై 16(ఆంధ్రజ్యోతి): ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆలోచన విధానం మేరకే పలాస నియోజకవర్గంలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మించదలపెట్టాం. దీనికి ఎవరూ అడ్డుతగలొద్దు.’ అని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక టీడీపీ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మందస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన రైతులతో ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ.. కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ‘శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. అందులో భాగంగా పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్వాసిత ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. భూముల విలువ కూడా పెరుగుతుంది. కొంతమంది పనికట్టుకొని ఎయిర్‌పోర్టుపై దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీకి చెందిన ఓ నేత అయితే మరో ప్రాంతంలో నిర్మించాలని కోరుతున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. కేవలం ప్రజలు, ప్రతిపక్ష నాయకులను హింసించడం తప్పా మరే కార్యక్రమాలు చేయలేకపోయారు. అటువంటి నాయకులు ఎయిర్‌పోర్టు వద్దని నీతులు చెబుతుండడం వారి విజ్ఞతకే విడిచిపెడుతున్నాం. మూర్ఖులు మాట్లాడినంతమాత్రాన ఎయిర్‌పోర్టు నిర్మాణం ఆగిపోదు.’ అని అన్నారు. ఆర్డీవో జి.వెంకటేష్ మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టుకు మొత్తం 1200 ఎకరాల భూమి సేకరిస్తున్నామని తెలిపారు. ఇందులో 200 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా, మిగతా వెయ్యి ఎకరాలు సేకరిస్తున్నామని అన్నారు. గ్రామలకు ఇబ్బందులు లేకుండా భూసేకరణ చేపడుతున్నామన్నారు. మెట్టూరు, అనకాపల్లి, చీపురుపల్లి గ్రామాల్లో ఎక్కువశాతం భూమి సేకరిస్తున్నామన్నారు. ఎయిర్‌పోర్టుకు సంబంధించి మూడు విడతలుగా భూపరీక్షలు చేయాల్సి ఉందని, 25 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి కొండలు, విద్యుత్‌లైన్లు లేకుండా సర్వే చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వి.వెంకటఅప్పారావు, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల తహసీల్దార్లు టి.కళ్యాణచక్రవర్తి, జి.సీతారామయ్య, ఎం.శ్రీకాంత్, సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్, నియోజకవర్గసమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదిరి, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
సహకారం అందించాలి
ఎయిర్‌పోర్టును నిర్మిస్తే ఈ ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంది. దీన్ని ఆపాలని ప్రయత్నించడం తగదు. అభివృద్ధికి విరోధం కలిగించకుండా అంతా సహకారం అందించాలి.
-పాలవలస వైకుంఠరావు, బీజేపీ జిల్లా కార్యదర్శి
భయాందోళన తొలగించాలి
ఎయిర్‌పోర్టుపై ప్రజల్లో నెలకొన్న భయోందోళనలు తొలగించాలి. రైతులకు అడంగళ్ పత్రాలు రావడం లేదు. దీనివల్ల నష్టపరిహారం రాదనే ఆందోళన ఉంది. దీన్ని నివృత్తి చేసి రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఎన్ని ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మిస్తారో చెప్పాలి. ఇక్కడ భూములు లేనివారే ఎక్కువగా ఆందోళన చేస్తున్నారు.
-ఉమాపతి, రామ్‌పురం
ఐదేళ్లూ పట్టించుకోలేదు
వైసీపీ ఐదేళ్ల పాలనలో పలాస అభివృద్ధిని పట్టించుకోలేదు. ప్రస్తుతం అభివృద్ధి కోసం ఎయిర్‌పోర్టు వస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నారు. ప్రజలు గుర్తించాలి. రైతులను భయాందోళనకు గురిచేస్తున్న వారిని నిరోధించాలి.
-సూరాడ మోహనరావు, అక్కుపల్లి