No DJ sounds: ఆ శబ్దం మాకొద్దు
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:07 AM
If you play DJ... you will be fined Rs. 1 lakh వివాహాలతోపాటు ఏ శుభకార్యమైనా.. వినాయకచవితి, దసరా తదితర పర్వదినాలైనా.. గ్రామదేవత పండుగలైనా సరే.. డీజే శబ్దాల మోత మోగుతోంది. ఎక్కడ చూసినా డీజేలు దర్శనమిస్తున్నాయి. కాగా ఆ భారీ శబ్దాలతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు.
డీజే పెడితే.. రూ.లక్ష జరిమానా
పోలీసుకేసు కూడా నమోదు చేయిస్తాం
కె.కపాసుకుద్ది గ్రామస్థుల ఏకగ్రీవ తీర్మానం
భావితరాల కోసం మంచి నిర్ణయం
ఓ దుర్ఘటన ఆ గ్రామస్థులను మేల్కొలిపింది. ఊరంతా ఒక్కతాటిపైకి వచ్చేలా చేసింది. డీజేలను నిషేధించేలా చేసింది. ఇటీవల ఆ ఊరివారంతా సమావేశమయ్యారు. ఏ కార్యక్రమానికైనా డీజేలను వాడకూడదంటూ తీర్మానం చేశారు. వాడితే రూ.లక్ష జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. పోలీసు కేసు కూడా నమోదు చేయించాలని తీర్మానించారు.
కవిటి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): వివాహాలతోపాటు ఏ శుభకార్యమైనా.. వినాయకచవితి, దసరా తదితర పర్వదినాలైనా.. గ్రామదేవత పండుగలైనా సరే.. డీజే శబ్దాల మోత మోగుతోంది. ఎక్కడ చూసినా డీజేలు దర్శనమిస్తున్నాయి. కాగా ఆ భారీ శబ్దాలతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. చాలామంది గుండె సంబంధిత రుగ్మతలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కవిటి మండలం కె.కపాసుకుద్ది గ్రామస్థులు భావితరాల కోసం మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల గ్రామస్థులంతా సమావేశమయ్యారు. ఇకపై డీజే శబ్దాలు తమ గ్రామంలో వినిపించకూడదంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఒకవేళ ఎవరైనా డీజేలు పెడితే రూ.లక్ష జరిమానా విధిస్తామని, పోలీసు కేసులు కూడా నమోదు చేయిస్తామని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు.
కె.కపాసుకుద్దిలో సుమారు 250 ఇళ్లు ఉన్నాయి. 12 కులాలకు సంబంధించి దాదాపు 1,500 మంది నివసిస్తున్నారు. వీరంతా కలసికట్టుగా గ్రామ కట్టుబాట్ల కోసం డీజేల నిషేధాన్ని అమలు చేయనున్నారు. రెండేళ్ల కిందట డీజే శబ్దాలను తట్టుకోలేక గ్రామానికి చెందిన ఒకరు గుండెపోటుకు గురై మృతి చెందారు. అలాగే ఇటీవల చాలాచోట్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అధిక శబ్దాల తాకిడి తట్టుకోలేక గ్రామంలో చాలామంది బాధపడుతున్నారు. గర్భిణులు, యువకులకు సైతం ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే డీజే శబ్దాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా పక్కదారి పడుతున్నాయి. యువత వ్యసనాలకు బానిసై.. ఆ శబ్దాల నడుమ చేస్తున్న నృత్యాలతో.. సంస్కృతీ సంప్రదాయాలు మంటగలుస్తున్నాయి. భవిష్యత్ తరాలకు ఇది మంచి పద్ధతి కాదని పెద్దలు భావించారు. ఇకపై గ్రామంలో డీజే నిషేధించాలని తీర్మానించారు. ఈ తీర్మానానికి తామంతా కట్టుబడి ఉంటామని గ్రామస్థులు తెలిపారు.
అనర్థాలెన్నో..
వాస్తవానికి డీజేలను నిషేధించినట్టు పోలీస్ శాఖ చెబుతున్నా.. ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. డీజే శబ్దాల రోతకు దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. శబ్దం తీవ్రత పెరిగే కొలదీ రుగ్మతలు ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘60 డెసిబుల్స్‌లోపు శబ్దం వింటే ఎటువంటి ఇబ్బందులుండవు. కానీ పరిమితికి మించి రెట్టింపు డెసిబుల్స్ వినియోగిస్తున్న కారణంగా అనర్థాలు తప్పవు. వినికిడి లోపంతో పాటు మానసిక వ్యాధులు కలుగు తాయి. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ శబ్దం వింటే పెను ప్రభావం చూపుతుంది. ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మేలు’ అని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీజే నిషేధంపై కె.కపాసుకుద్ది గ్రామస్థుల ఏకగ్రీవ తీర్మానం ఆదర్శనీయంగా ఉందంటూ పలువురు పేర్కొంటున్నారు.
భక్తిభావం పోతోంది
గ్రామంలో డీజే వలన భక్తిభావం పోయి విష సంస్కృతి అలవాటు కావడం మంచిదికాదు. యువత వ్యసనాలకు బానిస కాకుండా, వారిలో ఆధ్యాత్మికత పెంచేలా డీజేల నిషేధంపై నిర్ణయం తీసుకున్నాం.
- తోట ధర్మరాజు, గ్రామస్థుడు, కె.కపాసుకుద్ది
డీజేతో అనర్థమే
గ్రామంలో రెండేళ్ల కిందట డీజే శబ్దం కారణంగా గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందారు. ఇటీవల ఈసంస్కృతి పెరిగి అన్ని ప్రాంతాల్లో అనర్థాలు జరుగుతున్నాయని గ్రహించాం. ఈ సిస్టమ్ వలన యువకులు, మహిళలు వ్యసనాల బారిన పడి కుటుంబాలను నాశనం చేసుకోకుండా ఉండాలని డీజే నిషేధానికి శ్రీకారం చుట్టాం.
- పి.శ్రీరాములు, గ్రామస్థుడు, కె.కపాసుకుద్ది
అమలు చేస్తాం
గ్రామస్థులమంతా కలసి డీజే నిషేధం అమలుకు ప్రయత్నిస్తాం. డీజేల వద్ద దైవ కార్యక్రమాల్లోను విష సంస్కృతితో భక్తిభావం తగ్గిపోతోంది. యువకులు వ్యసనాలకు బానిస కాకుండా చూసేందుకు ఇది మంచి నిర్ణయంగా భావిస్తున్నాం.
- పి.హరిహరరావు, గ్రామస్ధుడు, కె.కపాసుకుద్ది