fertilizers: ఎరువుల కొరత రానీయొద్దు
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:30 PM
shortage of fertilizers జిల్లాలో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు ఎరువుల కొరత లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.
- అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం
కోటబొమ్మాళి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు ఎరువుల కొరత లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యవసాయాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘జిల్లాలో ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. రైతులకు అవసరం మేరకు పూర్తిస్థాయిలో ఎరువులు అందించడానికి చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం బఫర్ నిల్వగా ఉంచిన 500 మెట్రిక్ టన్నులు కూడా రైతులకు అందించాలి. పంపిణీలో ఇబ్బందులు ఉండకూడదు’ని తెలిపారు. వ్యవసాయశాఖ కమిషనర్‌తో కూడా మంత్రి అచ్చెన్న ఫోన్‌లో మాట్లాడి జిల్లాకు రావాల్సిన ఎరువులు తక్షణమే పంపించాలని ఆదేశించారు. అలాగే మండల పరిధిలో నలుగురు క్షేత్రసహాకులకు ఉద్యోగ నియామక పత్రాలను మంత్రి అందజేశారు. విధి నిర్వహణలో బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వ్యవశాఖ జేడీ త్రినాథరావు, శ్రీనివాసరావు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్, టీడీపీ నాయకులు వెలమల కామేశ్వరరావు, విజయలక్ష్మి పాల్గొన్నారు.