Share News

నదిలో తెప్పలు విడిచిపెట్టొద్దు

ABN , Publish Date - Nov 08 , 2025 | 12:33 AM

దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంలో ఈనెల 9న నిర్వహించనున్న బాలియాత్రకు సంబంధించి వంశధార నదిలో తెప్పలతో దీపాలు విడచిపెట్టడానికి ఎటువంటి అనుమతులు లేవని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయి ప్రత్యూష కమిటీ సభ్యులకు సూచించారు.

నదిలో తెప్పలు విడిచిపెట్టొద్దు
వంశధార నదిలో స్నానాల రేవు మార్గాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి తదితరులు

  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి

  • ఏ ఘటన జరిగినా కమిటీదే బాధ్యత

  • ఎస్పీ మహేశ్వరరెడ్డి

జలుమూరు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంలో ఈనెల 9న నిర్వహించనున్న బాలియాత్రకు సంబంధించి వంశధార నదిలో తెప్పలతో దీపాలు విడచిపెట్టడానికి ఎటువంటి అనుమతులు లేవని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయి ప్రత్యూష కమిటీ సభ్యులకు సూచించారు. శ్రీముఖలింగం వద్ద వంశధార నది తీరం, తీర్థ ఘాట్‌ రేవులను, ఆలయ పరిసరాలను శుక్రవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంశధారనదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నందున, స్నానాల రేవు ఘట్టం లోతుగా ఉన్నందున నదిలో తెప్పలు విడచిపెట్టడానికి భక్తులకు అనుమతి ఇస్తే ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు. అందుకే భక్తుల మనోభావాలు దెబ్బదినకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఒక వేళ తెప్పోత్సవం నదిలో జరిగితే ఏమైనా ఘటనలు సంభవిస్తే కమిటీ సభ్యులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. బాలియాత్ర మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. అవసరమైన చోట సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలన్నారు. నదిలోకి భక్తులు వెళ్లి వచ్చే మార్గాలు వేర్వేరుగా ఉండాలన్నారు. నదిలో తెప్పలు విడచిపెట్టడానికి ప్రత్యామ్నాయంగా డ్రమ్ముల్లో నీరుపోసి తెప్పలు విడచిపెట్టుకోవాలని సూచించారు. టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు, నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు, జలుమూరు ఎస్‌ఐ బి.అశోక్‌బాబు, తహసీల్దార్‌ జె.రామారావు, ఆలయ ఈవో ఏడుకొండలు, సర్పంచ్‌ టి.సతీష్‌కుమార్‌, ఎంపీటీసీ కె.హరిప్రసాద్‌, జలుమూరు ఏఎంసీ చైర్మన్‌ తర్ర బలరాం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 12:33 AM