Share News

బార్లు మాకొద్దు

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:36 PM

Traders' no interest in operating bars జిల్లాలో బార్ల నిర్వహణపై మద్యం వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బార్లు అంటేనే.. తమకు వద్దు ఈ వ్యాపారం అని తేల్చేస్తున్నారు. దీంతో బార్ల దరఖాస్తుల కోసం ఎక్సైజ్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

బార్లు మాకొద్దు

జిల్లాలో బార్ల నిర్వహణపై వ్యాపారుల అనాసక్తి

జిల్లాలో 19కి గాను తెరచుకున్నవి 9 మాత్రమే

మిగిలిన పది బార్లకు అందని దరఖాస్తులు

రీ నోటిఫికేషన్‌కు ఎక్సైజ్‌శాఖ సన్నద్ధం

ఒక్కో మండలం నుంచి ఒక్క దరఖాస్తు అయినా రావాల్సిందే. సిండికేట్‌ నుంచి విధిగా బారుకు దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే మీ ఇష్టం. మాపై ఒత్తిడి ఉంది. మాకు సహకరించాల్సిన అవసరం మీపై ఉంది. లేదంటే మున్ముందు అందరికీ ఇబ్బందులు తప్పవు.

- ఇదీ మద్యం వ్యాపారులపై ఎక్సైజ్‌ ఉన్నతాధికారుల ఒత్తిడి

మద్యం దుకాణం వద్దే బార్ల మాదిరిగా పర్మిట్‌ రూమ్‌లు ఉన్నాయి. షాపులచుట్టూ పదుల సంఖ్యలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ఉన్నాయి. అక్కడ తక్కువ ధరకే మద్యం అందుతుంది. ఒక బార్లకు వచ్చేది ఎవరు. పైగా నాలుగు దరఖాస్తులు వస్తేనే డ్రా తీస్తామనడం దారుణం. నాన్‌ రిఫండబుల్‌ నగదు కట్టి బారు సొంతం చేసుకున్నా తగినంత ఆదాయం ఉండదు. అందుకే బారు కోసం దరఖాస్తు చేసుకోవడం లేదు.

- ఇదీ బార్లపై మద్యం వ్యాపారుల విముఖత

శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బార్ల నిర్వహణపై మద్యం వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బార్లు అంటేనే.. తమకు వద్దు ఈ వ్యాపారం అని తేల్చేస్తున్నారు. దీంతో బార్ల దరఖాస్తుల కోసం ఎక్సైజ్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదాలవలస, పలాస, కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలతోపాటు ఎచ్చెర్లలో మొత్తంగా 19 బార్లకు అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఓపెన్‌ కేటగిరీలో 17, రిజర్వ్‌ కోటాలో రెండు బార్లకు దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించారు. కానీ మద్యం వ్యాపారులు పెద్దగా ముందుకు రాలేదు. ఇప్పటివరకు ఓపెన్‌ కేటగిరీలో ఏడు, రిజర్వ్‌ కేటగిరిలో రెండు బార్లు మాత్రమే తెరుచుకున్నాయి. ఆమదాలవలసలో ఒకటి, శ్రీకాకుళం నగరంలో ఆరు బార్లకు సంబంధించి లాటరీ పూర్తయింది. తెరుచుకున్నాయి. ఇంకా పలాస, కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, ఆమదాలవలసలో మిగతా పది బార్లకు దరఖాస్తులు రాలేదు. ఈ పది బార్లు ఓపెన్‌ చేయాలంటే దాదాపు 40 దరఖాస్తులు రావాలి. వాటి కోసం ఎక్సైజ్‌ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలో మద్యం వ్యాపారులు సిండికేట్‌ అయ్యారన్నది బహిరంగ రహస్యం. అందుకే వ్యాపారులపై ఎక్సైజ్‌ అధికారులు ఒత్తిడి పెంచుతున్నా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఈ నెల 18తో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియగా.. మిగిలిన వాటికి రీ నోటిఫికేషన్‌కు ఇచ్చేందుకు ఎక్సైజ్‌ అధికారులు సన్నద్ధమవుతున్నారు.

విముఖతకు కారణాలివే..

రాష్ట్ర ప్రభుత్వం బార్‌ పాలసీలో భాగంగా.. ఆగస్టు 26లోగా దరఖాస్తులు స్వీకరించి.. డిపాజిట్లు సైతం చెల్లించాలని చెప్పింది. అయిత గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి బార్‌ పాలసీ ఉంది. మద్యం దుకాణాల మాదిరిగానే లాటరీ తీస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇక్కడ ఒక మెలిక పెట్టింది. ఒక్కో బారుకు నాలుగు దరఖాస్తులు ఉంటేనే లాటరీ తీస్తామని చెప్పడంతో వ్యాపారులు వెనక్కి తగ్గారు. దరఖాస్తు రుసుం కింద సుమారు రూ.5.10లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్‌ రిఫండబుల్‌. ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా నాలుగు దరఖాస్తులు రాకపోతే లాటరీ తీయకపోగా రూ.5.10 లక్షలు తిరిగి ఇవ్వరట. ఈ కారణంగానే ఎక్కువ మంది బార్ల దరఖాస్తుకు ఆసక్తి చూపడం లేదు. ఏడాదికి రూ.55 లక్షల వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అంటే దానికి మించి ఆదాయం వస్తే కదా బార్లు నడిపేది. అందుకే మద్యం దుకాణాల్లో ఎదురైన పరిణామాల దృష్ట్యా ఎక్కువ మంది విముఖత చూపుతున్నారని తెలిసింది. అందుకే బార్‌ పాలసీ విషయంలో ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని, 2014 నుంచి 2019 మధ్య ఉన్న బారు పాలసీని పునరుద్ధరించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

నిబంధనలు ప్రకారమే

జిల్లాలో ఇప్పటివరకు ఏడు బార్లు తెరుచుకున్నాయి. రిజర్వ్‌ బార్లు రెండు సైతం ప్రారంభమయ్యాయి. మిగతా పది బార్లుకు సంబంధించి రీ నోటిఫికేషన్‌ ఇస్తాం. దరఖాస్తులు వచ్చిన వెంటనే లాటరీ తీసి కేటాయిస్తాం. నిబంధనల మేరకు ప్రక్రియను పూర్తిచేస్తాం. ఈ విషయంలో ఎవరిపై కూడా ఒత్తిడి చేయడం లేదు. ఆసక్తి ఉన్నవారు బార్లు కోసం దరఖాస్తులు చేసుకోవాలి.

రామచంద్రరావు, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ ఏసీ, శ్రీకాకుళం

Updated Date - Sep 20 , 2025 | 11:36 PM