Share News

children careful: అతిగారాబం వద్దు

ABN , Publish Date - Aug 28 , 2025 | 11:44 PM

Keep on children's behavior నేటి తరం పిల్లలు సెల్‌ఫోన్లకు బందీ అవుతున్నారు. వారికి విలువలు నేర్పేవారు కరువై పోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు బిజీ జీవితంలో పిల్లల తీరును పట్టించుకోక పోవడంతో.. దారితప్పి నేరాలు, వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

children careful: అతిగారాబం వద్దు

  • పిల్లల ప్రవర్తనపై కన్నేసి ఉంచాలి

  • తప్పటడుగులు వేస్తే.. సరిదిద్దండి

  • హర్రర్‌, క్రైంస్టోరీలకు దూరంగా ఉండాలి

  • సెల్‌ఫోన్‌ వినియోగం తగ్గించాలి

  • తల్లిదండ్రులకు నిపుణుల సూచనలు

  • ఇటీవల హైదరాబాద్‌లో సహస్ర అనే బాలికను పక్కింట్లో ఉన్న పదో తరగతి విద్యార్థి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. క్రికెట్‌ బ్యాట్‌ దొంగిలించేందుకు వెళ్లిన ఆ విద్యార్థి.. బాలికను కత్తిపోట్లతో పొడిచి చంపేశాడు. హర్రర్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, సామాజిక మధ్యమాలు మితిమీరి వినియోగించడంతో.. ఆ విద్యార్థి సత్ప్రర్తన దారి తప్పి.. కిరాతంగా వ్యవహరించినట్టు విచారణలో తేలింది.

  • ...............

  • ఉత్తరాఖండ్‌ ఉదమ్‌నగర్‌ జిల్లాలో ఇటీవల ఓ విద్యార్థిని టీచర్‌ చెంపదెబ్బ కొట్టింది. దీంతో ఆ విద్యార్థి లంచ్‌ బాక్స్‌లో తుపాకీ పెట్టుకుని వెళ్లి.. ఆ టీచర్‌పై కోపంతో కాల్పులు జరిపాడు.

  • .................

  • ఇటీవల నరసన్నపేటలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ విద్యార్థి.. తరగతిగదిలో ఓ లెక్చరర్‌తో ‘డబ్బు సంపాదించాలంటే చదువే ఎందుకు సార్‌. రీల్స్‌ చేసి ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పేరు తెచ్చుకుంటే సరిపోతుంద’ని చెప్పాడు. ఈ వ్యాఖ్యలను బట్టి యువతపై సోషల్‌మీడియా ప్రభావం ఎంతమేరకు పడిందో తెలుస్తోంది.

  • నరసన్నపేట, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): నేటి తరం పిల్లలు సెల్‌ఫోన్లకు బందీ అవుతున్నారు. వారికి విలువలు నేర్పేవారు కరువై పోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు బిజీ జీవితంలో పిల్లల తీరును పట్టించుకోక పోవడంతో.. దారితప్పి నేరాలు, వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ‘మొక్కై వంగనిది.. మానై వంగునా?’ అన్న చందంగా చిన్నవయసులోనే పిల్లల ప్రవర్తనపై దృష్టిపెట్టి మార్పు తీసుకురాకపోతే.. వారు పెద్దయిన తర్వాత తీరు మార్చడం కష్టమని నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లల తీరుపై కన్నేయాలని, వారు తప్పటడుగులు వేస్తే.. తల్లిదండ్రులే బాధ్యతగా సరిదిద్దాలని స్పష్టం చేస్తున్నారు.

  • కారణాలెన్నో..

  • కుటుంబ సమస్యలు, పెద్దల పర్యవేక్షణ లేకపోవడం, అతిగారాబం, చెడు స్నేహాలు, సరైన మార్గదర్శకం లేకపోవడం, పెరిగిన సెల్‌ఫోన్‌ వినియోగం తదితర కారణాలతో కొంతమంది పిల్లలు చెడుమార్గంలో పయనిస్తున్నారు. ప్రతీ ఇంట్లో సెల్‌ఫోన్‌, ఇంటర్‌నెట్‌ వినియోగం పెరగడంతో పిల్లలు హర్రర్‌ సినిమాలు, ఇతర షోలను చూస్తున్నారు. ఇవే పిల్లల్లో నేరప్రవత్తికి బీజం పడేలా చేస్తున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అతిగారాబంతో కొందరు తల్లిదండ్రులు.. పిల్లలు ఏం చేసినా సమర్థిస్తుంటారు. తప్పు చేస్తే మందలించక పోవడంతో పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇంకొంతమంది తల్లిదండ్రులు పోటీప్రపంచంలో తమ పిల్లలు గెలవాలనే ఉద్దేశంతో మంచి పాఠశాల, మార్కులుక ప్రాధాన్యమిస్తున్నారు. కానీ వారి స్నేహితులెవరు, వారి ఆలోచనలు ఎలా ఉంటున్నాయనేది మాత్రం పట్టించుకోవడం లేదు.

  • తల్లిదండ్రులదే బాధ్యత

  • పిల్లలతో రోజూ తల్లిదండ్రులు కొంత సమయమైనా కేటాయించాలి. మిత్రులుగా మెలగాలి. సమాజంలో జరిగే తప్పొప్పులు, వాటి ప్రభావాల్ని వివరించాలి. వారి మనసులో ఇతరులు, సమాజంపై ఎలాంటి భావన ఉందో తెలుసుకోవాలి. ఈర్ష్య, అసూయ, కోపం వల్ల అనర్థాలు వివరించాలి. టీవీల్లో, ఫోన్‌లో వారు వేటిని ఆసక్తిగా చూస్తున్నారనేది గమనించాలి. హర్రర్‌ సినిమాలు, క్రైంస్టోరీలు, రక్తపాతం, భయానక సన్నివేశాలు చూడకుండా జాగ్రత్తలు పాటించాలి. బెదిరించకుండా, కొట్టకుండా నీతికథలు, గొప్ప వ్యక్తుల జీవన విలువల్ని తెలియజేస్తూ మంచిని నేర్పాలి. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలి.

  • పిల్లలు ఇంట్లో, బయట ఎలా ప్రవర్తిస్తున్నారనేది పసిగట్టాలి. ఎవరినైనా కొడుతున్నా.. జంతువుల్ని హింసిస్తున్నా సంతోషపడటం, ఫైట్లు చేయాలని ఉవ్విళ్లూరడం, పెద్దలని ఎదిరించడం వంటివి ప్రమాద ఘంటికలుగా భావించాలి. బాల్యంలో కుటంబ వాతావరణంసరిగా లేనివారు. చెడు స్నేహాలు ఉన్నవారు పక్కదారి పడతారు. చిన్న విషయాలకే మందలించడం లేదా ఎంత తప్పు చేసినా వెనుకేసుకురావడం వల్ల చిన్నారుల్లో మంచి,చెడు మధ్య బేధం అర్థం కాదు. సందర్భాన్ని బట్టి సమయోచితంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్పందించాలి. అతి నియంత్రణ కూడా వారిలో క్రూరత్వాన్ని పెంచుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. చిన్నారుల ప్రవర్తనలో ఏదైనా మార్పును ఉంటే ఆదిలోనే గుర్తిస్తే సమస్యను పరిష్కరించుకోవచ్చని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు.

  • స్నేహంగా మెలగాలి

  • పిల్లలతో తల్లిదండ్రులు ఆచితూచి వ్యవహరించాలి. బాల్యంలో మెదడులో నిక్షిప్తమైన విషయాలను జీవితంలో మర్చిపోవడం జరగదు. ఐదోతరగతి వరకు నీతికథలు బోధించాలి. ఇతరులకు సహాయం చేసే గుణాలను నేర్పించాలి. ఆడపిల్లలు తండ్రితోను, మగపిల్లలు తల్లితో ఎక్కువగా సఖ్యతగా ఉంటారు. వారి అభిప్రాయాలను తెలుసుకుని మంచివాటిని ప్రోత్సహించాలి. చెడ్డవాటి ప్రభావం పిల్లలకు తెలియజేయాలి. పిల్లలకు తల్లిదండ్రులే మార్గదర్శకంగా ఉండాలి.

    - ఎం.ఆర్‌ జ్యోతి ఫెడ్రరిక్‌, రిటైర్డు ప్రభుత్వడిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, నరసన్నపేట

    ........

  • పిల్లల ముందు గొడవలు వద్దు

  • కొన్ని కుటంబాల్లో తల్లిదండ్రులు లేదా అత్తకోడళ్లు పిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తించకుండా గొడవలు పడతారు. ఇవి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చిన్న తనం నుంచి ఆట కోసం సెల్‌ఫోన్లు ఇవ్వడం అలవాటు చేస్తున్నారు. వీటిని దూరంగా ఉంచాలి. హర్రర్‌, క్రైంస్టోరీలు చూస్తూ కలిగే చెడు ఫలితాలను పిల్లలకు తెలియజేయాలి. అప్పటికి పిల్లలు ప్రవర్తనలో మార్పు రాకుంటే మానసిక వైద్యులకు చూపించాలి.

    - బెండి సాయిరాం, మానసిక వైద్యుడు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, శ్రీకాకుళం

Updated Date - Aug 28 , 2025 | 11:44 PM