Share News

శ్రీకూర్మంలో వైభవంగా డోలోత్సవం

ABN , Publish Date - Mar 14 , 2025 | 11:59 PM

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం.. భక్తజన సంద్రమైంది. శ్రీకూర్మంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న డోలోత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి.

శ్రీకూర్మంలో వైభవంగా డోలోత్సవం
మత్స్యలేశంలో సముద్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు

గార, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం.. భక్తజన సంద్రమైంది. శ్రీకూర్మంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న డోలోత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. శుక్రవారం పౌర్ణమి సందర్భంగా స్వామి ఉత్సవ మూర్తులను డోలో మండపంలో అర్చకులు వేంచేపు చేశారు. భక్తులు అక్కడే స్వామిని దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు విజయనగరం పూసపాటి గజపతులు గోత్రనామాలతో ప్రధాన అర్చకులు సీతారామ నరసింహాచార్యులు, అర్చకులు పూజలు చేశారు. దేవదాయశాఖ సహాయ కమిషనర్‌ ప్రసాద్‌ పట్నాయక్‌, ఈవో గురునాథరావు స్వామిని దర్శించుకున్నారు. అలాగే భక్తులు ఎల్‌.మత్స్యలేశంలో పవిత్ర సముద్ర స్నానాలు చేశారు. సీఐలు పైడపు నాయుడు, బి.ప్రసాదరావు(మెరైన్‌), ఎస్‌ఐలు ఆర్‌.జనార్దనరావు, టి.రామారావుతోపాటు సుమారు వందమంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.

బెజ్జిపుట్టుగలో...

కవిటి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): కవిటి మండలంలోని బెజ్జిపుట్టుగ గ్రామంలో వెలసిన చక్రధర పెరుమాళ్ల స్వామి డోలోత్సవ యాత్ర శుక్రవారం ఘనంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత చక్రధర స్వామి వారికి పానకాలు నైవేద్యంగా అందించి యాత్రలో భక్తులు పాల్గొన్నారు. నూతన దంపతులు స్వామి వారికి అరటిగెలను సమర్పిస్తే సంతాన సమస్యలతో పాటు కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. శుక్రవారం వేకువ జాము నుంచి ప్రధాన అర్చకులు సత్యనారాయణ స్వామి, రాజేష్‌, రాజుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు పొందల కృష్ణారావు, రాంబాబు, విజయ్‌కృష్ణలు, గ్రామస్థులు యాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు. ఈ యాత్ర శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కొనసాగింది. అనంతరం స్వామివారిని ఊరేగించిన పల్లకిని కామదహనం పేరిట దహనం చేసి డోలోత్సవాలకు ముగింపు పలుకుతారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కవిటి పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఇచ్ఛాపురంలో...

ఇచ్ఛాపురం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక పెద్ద జగన్నాఽథ స్వామి దేవాలయంలో డోలోత్స వాలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కొలువదీరిన రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారికి డోలా మండపం వద్ద పూజలు నిర్వహించారు. డ నిత్యారాధనల అనంతరం రథంపై బెల్లుపడ కాలనీ సమీప డోలోత్సవ ప్రాంగణ మహామండపంపై స్వామిని కొలువుతీర్చి అర్చకులు పద్మకుమార్‌ ఆచార్యులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం కళాకారుల ఆద్వర్యంలో గాత్రకచేరిని నిర్వహించారు. ఆలయ మేనేజర్‌ బెండి రామారావు పర్యవేక్షణలో భక్తులకు సౌకర్యాలు కల్పించారు.

Updated Date - Mar 14 , 2025 | 11:59 PM