కుక్కలు చంపేస్తున్నాయ్!
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:05 AM
Dogs attacked in the srikakulam జిల్లాలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. పలువురు కుక్కకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయినా వాటి నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో తరచూ ఘటనలు
అధికమవుతున్న బాధితులు
అయినా పట్టని అధికారులు
కానరాని సుప్రీంకోర్టు ఆదేశాలు
ఈ ఏడాది ఆగస్టు 18న బూర్జ మండలం తోటవాడకు చెందిన దన్నాన అప్పమ్మ అనే 70ఏళ్ల వృద్ధురాలు తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు. కొద్దిరోజుల కిందట కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన అప్పమ్మను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకున్న ఆమె ఇంటి వద్ద ఉండగా మరోసారి అస్వస్థతకు గురై మృతి చెందారు.
ఈ ఏడాది జూలైలో మురపాకకు చెందిన బొడ్డ అజయ్ అనే యువకుడు తీవ్ర అనారోగ్యానికి గురై మృతిచెందాడు. అప్పటికి రెండు నెలల కిందట వీధికుక్క కాటు వేసింది. రేబిస్ టీకా వేయించుకోకుండా నిర్లక్ష్యం చేశాడు. దీంతో రేబిస్ వ్యాధి తిరగబెట్టింది. ఆస్పత్రికి తరలించేలోపే మృత్యువాతపడ్డాడు.
రణస్థలం పరిసరాలతోపాటు పొలాలు, తోటల్లో సైతం కుక్కలు హల్‌చల్ చేస్తున్నాయి. దాదాపు ఇరవై కుక్కలు గుంపులుగా తిరుగుతూ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వాటిని చూసి పొరపాటున ఎవరైనా భయంతో పరుగులుతీస్తే.. వెంటపడి దాడి చేస్తున్నాయి. కుక్కల బారి నుంచి రక్షణ కల్పించాలని ఈ ప్రాంతవాసులు అధికారులను వేడుకుంటున్నారు.
ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో రోజురోజుకీ వీధికుక్కల బెడద పెరిగిపోతోంది. గురువారం మునిసిపాలిటీలోని సత్యసాయిబాబా వీధిలో పిచ్చి కుక్క దాడి చేయగా.. పది మందికి తీవ్రగాయాలయ్యాయి. వారంతా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. పాలు విక్రయించే నరేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెంబడించి దాడి చేసింది. మునిసిపాలిటీలో కుక్కల దాడులు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని జనసేన పార్టీ ఇన్‌చార్జి దాసరి రాజు, స్థానికులు పేర్కొంటున్నారు.
రణస్థలం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. పలువురు కుక్కకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయినా వాటి నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీధికుక్కల సంరక్షణకు పట్టణాల్లోని ప్రతివార్డులో సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కొన్నాళ్ల కిందట సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్కడ వాటికి ఆహారం ఇవ్వాలని సూచించింది. కానీ ఈ దిశగా అధికారులు సన్నాహాలు చేపట్టడం లేదు. కనీసం ఎన్ని వీధికుక్కలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 2వేల మంది వరకూ కుక్కకాటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి ప్రతినెలా సుమారు 200 మంది కుక్కకాటు బాధితులు వస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మూతపడిన కేంద్రాలు..
వీధికుక్కల నియంత్రణకు శ్రీకాకుళం కార్పొరేషన్‌లో గతంలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. రూ.25లక్షలతో షెడ్లు ఏర్పాటు చేసి.. పదుల సంఖ్యలో కుక్కలకు శస్త్రచికిత్సలు కూడా చేశారు. తరువాత ఎందుకో ఆపేశారు. కొన్నాళ్ల తరువాత కుక్కల దాడులు పెరగడంతో విశాఖ నుంచి ప్రత్యేక బృందాలను రప్పించి నియంత్రణ చర్యలు చేపట్టారు. కానీ ఈ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. దీంతో కుక్కల సంతతి పెరిగిపోయింది. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో అప్పట్లో 10వేల కుక్కలను గుర్తిస్తే.. కనీసస్థాయిలో కూడా నియంత్రణ ఆపరేషన్లు చేయలేదు. మిగిలిన మునిసిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని రోజులకే ఈ కేంద్రాలు మూతపడ్డాయి.
జీవోనే.. నిధులు లేవు..
కుక్కలు, పందుల నియంత్రణ విషయంలో గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో 2020 డిసెంబరు 30న వీధి కుక్కల నియంత్రణ బాధ్యత స్థానిక సంస్థలకు అప్పగిస్తూ జీవో జారీచేసింది. కానీ నిధులు మాత్రం కేటాయించలేదు. లైసెన్స్‌లు లేని జంతువుల నియంత్రణకు సరికొత్త మార్గదర్శకాలిచ్చింది. కుక్కలు, పందులు పెంచుకోవాలంటే అనుమతి తప్పనిసరి చేసింది. అనుమతి లేకుండా పెంచితే వాటి యజమానులకు రూ.500 అపరాధ రుసుం విధించాలని ఆదేశాలిచ్చింది. అయినా వినని యజమానులకు రోజుకు రూ.250 చొప్పున జరిమానా విధించాలని స్పష్టం చేసింది. లైసెన్స్ జారీ, రెన్యువల్ బాధ్యతలు స్థానిక సంస్థలు చూసుకోవాలని పేర్కొంది. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసుకున్నట్టు ధ్రువపత్రం, పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ధ్రువీకరణం పొంది ఉండాలని కూడా స్పష్టం చేసింది. కానీ ఇవెక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. జిల్లావ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఆస్పత్రి రికార్డులు చూసుకున్నా కుక్కకాటు బాధితులు నెలలో పదుల సంఖ్యలో ఉంటున్నారు. కానీ ప్రస్తుత కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం సుప్రీంకోర్టు ఆదేశాలతోనైనా వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.
సంతతి తగ్గించాలి
పల్లెలు, పట్టణాల్లో కుక్కల సంతతి పెరుగుతుండడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్లలోకి సైతం కుక్కలు ప్రవేశిస్తున్నాయి. రెండేళ్ల కిందట జి.సిగడాం మండలంలో ఇంటిలోని ఉయ్యాలలో ఉన్న చిన్నారిపై దాడిచేసి చంపేశాయి. అయినా సరే అప్పట్లో అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికైనా కుక్కల సంతతిని తగ్గించే ఏర్పాట్లు చేయాలి.
- ఆర్.సాయి, రణస్థలం
తీవ్ర అసౌకర్యం
ప్రతిరోజూ వీధి కుక్కలతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాం. సమీప గ్రామాల నుంచి ఇక్కడకు చేరుతున్నాయి. హోటళ్లలో వ్యర్థాలు, ఇతర పదార్థాలను తింటున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు వీటి నియంత్రణపై దృష్టిపెట్టాలి.
- ఎం.శ్రీనివాసరావు, రణస్థలం