డీజేలు.. యమ డేంజర్!
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:03 AM
డీజే శబ్దాలు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారాయి. వాటి నుంచి 60 డెసిబుల్స్‌ను మించి శబ్దం వస్తుండడంతో ప్రజలు వివిధ రుగ్మతల బారిన పడుతున్నారు.
-భారీ శబ్దాలతో ఆరోగ్యానికి పెనుముప్పు.. మృత్యువాత
-హెచ్చరికలకే పరిమితమైన అధికార యంత్రాంగం
-కొన్నిచోట్ల స్వచ్ఛందంగా బ్యాన్ చేస్తున్న యువకులు
-వినాయక నవరాత్రుల్లో డీజే లేకుండా చేయాలని విన్నపం
రణస్థలం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి):
డీజే శబ్దాలు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారాయి. వాటి నుంచి 60 డెసిబుల్స్‌ను మించి శబ్దం వస్తుండడంతో ప్రజలు వివిధ రుగ్మతల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వినికిడి లోపానికి గురవుతున్నారు. కొన్నిసార్లు గుండెపోటుకు గురై ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
-జి.సిగడాం మండలం డీఆర్‌వలస గ్రామంలో డీజేలను నిషేధిస్తూ ఇటీవల గ్రామపెద్దలు, యువత సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇక నుంచి గ్రామంలో ఏ వేడుకల్లోనూ డీజేలు వినియోగించకూడదని నిర్ణయించారు. అందరూ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటూ ప్రమాణం చేశారు. నిబంధనను అతిక్రమిస్తే పోలీసు కేసులు పెడతామని హెచ్చరించారు.
-ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఓ యువకుడు పాల్గొన్నాడు. ఊరేగింపులో భాగంగా డీజే సౌండ్ వద్ద డ్యాన్స్ వేశాడు. రాత్రికి ఇంటికి చేరుకున్న ఆయన అస్వస్థతకు గురయ్యాడు. గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు.
- ఇటీవల వినికిడి లోపంతో ఎక్కువ మంది మా ఆస్పత్రికి వస్తున్నారు. అందులో యువత అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. డీజేల వినియోగం, మితిమీరిన సెల్‌ఫోన్ వినియోగం, బ్లూటూత్, ఈయర్ ఫోన్స్ వాడడం వల్లే చెవికి సంబంధించి రుగ్మతలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. ఆస్పత్రికి వచ్చే వారిలో వీటి బాధితులే అధికం.
-శ్రీకాకుళం నగరానికి చెందిన ఈఎన్‌టీ నిపుణుడు
వేడుక ఏదైనా డీజే శబ్దం సర్వ సాధారణమైంది. పెళ్లిళ్లు, జన్మదినాలు, ర్యాలీలు, వేడుకలు ఇలా ఏ కార్యక్రమం అయినా డీజే మోత మోగాల్సిందే. గతంలో ఎక్కడో పబ్‌లకు పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు మారుమూల పల్లెలకు కూడా పాకింది. ఇప్పటికే వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం.. శబ్ద కాలుష్యంతో మరింత కలవరపాటుకు గురవుతున్నారు. ప్రస్తుతం శ్రావణమాసం వివాహాలకు తోడు..వినాయక నవరాత్రులు సమీపిస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. శబ్దాల మోత తప్పదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా మన చెవులు 120 నుంచి 130 డెసిబుల్స్ మాత్రమే భరించగలవు. అంతకు మించితే పెను ప్రమాదమే. మనం వింటున్న శబ్దం తీవ్రత పెరిగే కొద్దీ రుగ్మతలు ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 60 డెసిబుల్స్‌లోపు శబ్దం వింటే ఎటువంటి ఇబ్బందులుండవు. 100 డెసిబుల్స్ శబ్దం దాటితే గుండె జబ్బులు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 110 డెసిబుల్స్ దాటితే చికాకుతో పాటు విపరీతమైన కోపం, తలనొప్పి వస్తుంది. 120 డెసిబుల్స్ దాటితే చిరాకు, చర్మంపై రోమాలు నిక్కపొడుచుకోవడం, విపరీతమైన తలబాధ వస్తుంది. 160 డెసిబుల్స్ దాటితే చెవుల్లో వినికిడి కణాలపై ప్రభావం చూపుతాయి. నరాలు దెబ్బతిని పాక్షిక వైకల్యం కలుగుతుంది. 190 డెసిబుల్స్ శబ్దం దాటితే కర్ణభేరి పగిలిపోతోంది. శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోతారు. పూర్వపు స్థితి రావడం చాలా కష్టం.
సరికొత్తగా సిస్టమ్స్..
జిల్లాలో డీజేలను రకరకాల రీతిలో నిర్వాహకులు తీర్చిదిద్దుతున్నారు. చివరకు డ్యాన్స్ వేసే యువత నీటి పాటల కోసం ఏకంగా స్పింకర్ల మాదిరిగా ఏర్పాటు చేస్తున్నారు. వాటిలోనే రసాయనాలతో కూడిన రంగు నీరును కలుపుతున్నారు. ఇది ఏమాత్రం కంటిలోకి వెళ్లినా ప్రమాదకరమే. డీజేల నిర్వాహకులు కానీ..శుభకార్యాల పెద్దలు కానీ పట్టించుకోవడం లేదు. డీజే బాక్సుల నుంచి వచ్చే వైబ్రేషన్ చాలా ప్రమాదకరం. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నవారిపై విపరీతంగా ప్రభావం చూపిస్తుంది. ఆ వైబ్రేషన్‌తో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. మెదడుకు రక్త సరఫరా తగ్గిపోతుంది. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాలు మూసుకుపోతాయి. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గర్భిణులకు సైతం డీజే వైబ్రేషన్స్ ప్రమాదకరమే. అధిక శబ్దాలు వింటే గర్భస్థ పిండంపై పెను ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అటువంటి ప్రమాదకరమైన డీజేలను నిషేధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
చర్యలు తీసుకోకుంటే ప్రమాదమే..
శ్రావణమాసం కావడంతో ప్రస్తుతం జిల్లాలో వివాహాలతో పాటు శుభకార్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నెల 28న వినాయక నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దీంతో ఇప్పటి నుంచే మండపాల నిర్వహణ, భారీ విగ్రహాల ఏర్పాటు, డీజేలు, మైకులకు హడావుడి చేస్తుంది యువత. ఇటువంటి సమయంలోనే పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టకపోతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. డీజే సౌండ్ సిస్టమ్‌తో కలుగుతున్న అనర్ధాలను గుర్తించి ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో వాటిని నిషేధించాలి. నివాసిత ప్రాంతాలు, వ్యాపార సముదాయాల్లో సౌండ్ సిస్టమ్స్ సామర్థ్యాలను తగ్గించాలి. పరిశ్రమల్లో పనిచేసే చోట సైతం యంత్రాల నుంచి శబ్ద కాలుష్యం వస్తుంది. అటువంటిచోట కార్మికులు, ఉద్యోగులకు ఇయర్ మాస్కులతో పాటు బడ్స్ ఇవ్వాలి. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు డీజే సిస్టమ్స్ వద్దకు అస్సలు వెళ్లకూడదు. అసౌకర్యం కలిగించే శబ్దాలు వినకుండా చెవుల్లో బడ్స్, దూది పెట్టుకోవాలి.
డీజేలపై నిషేధం..
జిల్లాలో డీజేల వినియోగం నిషేధం. వివాహాలు, శుభకార్యాల్లో డీజేల శబ్దంతో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. యువత సైతం తమ బైకులకు అధిక శబ్దం ఇచ్చే సైలెన్సర్లు వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా అధిక శబ్దం ఇచ్చే సైలెన్సర్లను అమర్చిన వారు వాటిని తొలగించాలి. లేకుంటే జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదుచేస్తాం. డీజేలపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం.
-ఎం.అవతారం, సీఐ, జేఆర్‌పురం
అనర్థాలు అధికం
ఇటీవల శబ్ద కాలుష్యం పెరుగుతోంది. ఇప్పటికే వాయు కాలుష్యంతో ప్రజలు రుగ్మతల బారిన పడుతున్నారు. ఎక్కువ డెసిబుల్ శబ్దం కలిగించే డీజేలు, సైలెన్సర్లతో అనర్థాలు అధికం. వినికిడి లోపంతో పాటు మానసిక వ్యాధులు కలుగుతాయి. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ శబ్దం వింటే పెను ప్రభావం చూపుతుంది. చిరాకుతో పాటు విపరీతమైన కోపం, తలనొప్పికి సైలెన్సర్ల శబ్దాలు కారణమవుతాయి. అందుకే యువత ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. కొంతమంది ఆకతాయి యువత మద్యం మత్తులో అతిగా ప్రవర్తించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
-ముద్దాడ యుగంధర్ వైద్యుడు, కొండములగాం సీహెచ్‌సీ