మత్స్యశాఖలో జిల్లా టాప్
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:54 PM
cm-collecters meeting రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో జిల్లా పలు రంగాల్లో మెరుగైన పనితీరు కనబరిచి శభాష్ అనిపించుకుంది. మంగళవారం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన మొదటి రోజు సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమర్పించిన ప్రగతి వివరించారు. ఈ నివేదిక ప్రకారం.. మత్స్యశాఖ కేపీఐ గ్రేడింగ్‌లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
రాష్ట్రస్థాయిలో గృహనిర్మాణం రెండో స్థానం
సమగ్ర శిక్ష నిధుల వినియోగంలో 3వ స్థానం
2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 49,107 కోట్ల స్థూల ఉత్పత్తి లక్ష్యం
కలెక్టర్ల సదస్సులో వెల్లడైన కీలక గణాంకాలు
శ్రీకాకుళం, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో జిల్లా పలు రంగాల్లో మెరుగైన పనితీరు కనబరిచి శభాష్ అనిపించుకుంది. మంగళవారం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన మొదటి రోజు సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమర్పించిన ప్రగతి వివరించారు. ఈ నివేదిక ప్రకారం.. మత్స్యశాఖ కేపీఐ గ్రేడింగ్‌లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అయినప్పటికీ స్కోరు 56తో బి-గ్రేడ్‌లో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి మత్స్య శాఖ ద్వారా రూ.3,436 కోట్ల ఆదాయం(జీవీఏ) లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి పేదలందరికీ ఇళ్లు(పీఎంఏవై) పథకం అమలులో జిల్లా రాష్ట్రంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచింది. ఇళ్ల గ్రౌండింగ్, నిర్మాణంలో (80శాతం పూర్తి) జిల్లా 2వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు మంజూరైన 77,496 ఇళ్లకుగాను 63,496 ఇళ్లు గ్రౌండింగ్ కాగా.. అందులో 50,849 ఇళ్లు పూర్తయ్యాయి. రానున్న ఉగాది నాటికి మిగిలిన ఇళ్లను పూర్తి చేయాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక విద్యా రంగానికి సంబంధించి పాఠశాలల అభివృద్ధికి కేటాయించిన ‘సమగ్ర శిక్ష’ నిధుల వినియోగంలో జిల్లా 99 శాతం ఖర్చుచేసి రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిచింది. అందుబాటులో ఉన్న రూ.48 కోట్లను దాదాపు పూర్తిగా వినియోగించుకుంది. ఉద్యోగుల హాజరు... గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరులో జిల్లా మెరుగైన రికార్డు నమోదు చేసింది. రాష్ట్రంలోనే అత్యంత తక్కువ గైర్హాజరు శాతం(17.7శాతం) శ్రీకాకుళంలోనే నమోదైంది. అలాగే వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో నిర్థిష్ట లక్ష్యాలతో ముందుకు సాగుతోంది.
ఆర్థిక వృద్ధి (జీడీడీపీ) లక్ష్యాలు
2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీడీపీ) లక్ష్యాన్ని రూ.49,107 కోట్లుగా నిర్ధేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో (హెచ్1- ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రూ. 21,534 కోట్లు (43.85శాతం) సాధించి రాష్ట్రంలో 20వ స్థానంలో నిలిచింది. ద్వితీయార్థంలో(హెచ్2) మిగిలిన రూ. 27,573 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. కీలక పనితీరు సూచికల్లో (కేపీఐ) జిల్లా 77 స్కోరుతో ‘ఏ’ గ్రేడ్ దక్కించుకుంది.
జిల్లా ఆర్థిక వ్యవస్థలో ‘సేవా రంగం’ వాటా చాలా ఎక్కువగా ఉంది. సేవారంగం.. 2025-26 లక్ష్యం రూ.23,071 కోట్లు కాగా.. మొదటి ఆరు నెలల్లోనే(హెచ్1) రూ.11,621 కోట్లు(50.37 శాతం) సాధించి స్థిరమైన వృద్ధిని కనబరుస్తోంది. పారిశ్రామిక రంగం విషయానికొస్తే.. లక్ష్యం రూ.8,614 కోట్లు. హెచ్1లో రూ.4,549 కోట్లు(52.81శాతం) సాధించింది. వ్యవసాయ అనుబంధ రంగాలు.. లక్ష్యం రూ.13,399 కోట్లు. హెచ్1లో రూ. 3,815 కోట్లు (28.47శాతం) మాత్రమే సాధించారు. రెండో అర్ధభాగంలో (హెచ్2) ఏకంగా రూ. 9,585 కోట్లు సాధించాల్సి ఉంది.
పారిశ్రామిక ప్రగతిలో భాగంగా జిల్లాకు 8 కంపెనీల ద్వారా సుమారు రూ.6,200 కోట్ల(0.0062 లక్షల కోట్లు) పెట్టుబడులు రానున్నాయి. వీటిద్వారా దాదాపు 36,000 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో ఎంవోయూ దశలో ఆరు కంపెనీలు, క్యాబినెట్ ఆమోదం పొందిన రెండు కంపెనీలు ఉన్నాయి.
జిల్లా ట్రెజరీలో దాదాపు రూ.7.48 కోట్ల మేర క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిని సరిచూసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లల ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ ప్రక్రియలో జిల్లా 24 శాతం మాత్రమే పూర్తి చేసింది. దీన్ని వేగవంతం చేయాల్సి ఉంది. పశుసంవర్థక శాఖలో మాంసం ఉత్పత్తిలో జిల్లా 1.88శాతం వాటాతో రాష్ట్రంలో 4వ స్థానంలో ఉంది.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో జిల్లాకు 15వ స్థానంలో 80 స్కోరుతో ‘ఏ’ గ్రేడు లభించింది. జిల్లాలో రబీ సీజన్‌లో మినుము సాగు విస్తారంగా ఉనప్పటికీ దిగుబడి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర సగటు హెక్టారుకు 1,268 కిలోలు ఉంటే.. జిల్లాలో అది కేవలం 697 కిలోలు మాత్రమే ఉంది. దీనికి ప్రధాన కారణం ఎల్లో మొజాయిక్ వైరస్. దీన్ని అధిగమించడానికి పోషక యాజమాన్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. పంటను ఆశించే ‘ఎల్లో మొజాయిక్ వైరస్’ నివారణకు పోషక యాజమాన్యం, ఐపీఎం పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
ఉద్యానవన శాఖ .. జిల్లా 14వ స్థానంలో (స్కోరు 74-బి గ్రేడ్) ఉంది. రాష్ట్రంలో మాంసం ఉత్పత్తిలో జిల్లా 4వ స్థానంలో నిలిచింది. 2025-26 సంవత్సరానికి రూ. 4,290 కోట్ల విలువైన మాంసం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక ‘మీ-కోసం’లో జూన్-సెప్టెంబరు మధ్య వచ్చిన ఫిర్యాదుల్లో 99 శాతం పరిష్కరించి మెరుగైన పనితీరు చూపారు. ఇటీవల సెప్టెంబరు -డిసెంబరు కాలంలో పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ 85 శాతానికి తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాట్సాప్ గవర్నెన్స్ క్యాంపెయిన్‌లో పాల్గొనని ఉద్యోగులు సుమారు 1,284 మంది ఉన్నట్లు గుర్తించారు.
ఆధార్ నవీకరణ(ఎంబీయూ).. 5-7 ఏళ్లు, 15-17 ఏళ్ల పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్‌లో ఇంకా 35, 898 మంది పెండింగ్‌లో ఉన్నారు. జిల్లాలో కొత్తగా 44ప్రాంతాల్లో 4జీ టవర్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక ఉండగా.. అందులో 43 చోట్ల సర్వే పూర్తయింది. అలాగే : మొత్తం 15 రకాల ఎస్‌డీజీ(సుస్థిర అభివృద్ధి) లక్ష్యాల అమలులో జిల్లా 21వ స్థానంలో (స్కోరు 79-ఏ గ్రేడ్) ఉంది.