Share News

urea Distribution : ప్రతి రైతుకూ యూరియా పంపిణీ

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:03 AM

Collector inspects fertilizer distribution ప్రతి రైతుకూ యూరియా పంపిణీ చేస్తామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. మంగళవారం పాతపట్నం మండలం బూరగాం సచివాలయంలో ఎరువుల పంపిణీ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

urea Distribution : ప్రతి రైతుకూ యూరియా పంపిణీ
రైతులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • పాతపట్నం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రతి రైతుకూ యూరియా పంపిణీ చేస్తామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. మంగళవారం పాతపట్నం మండలం బూరగాం సచివాలయంలో ఎరువుల పంపిణీ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మజ్జి రామారావు అనే రైతు.. తనకు ఇంతవరకూ ఒక్క యూరియా బస్తా కూడా అందలేదని కలెక్టర్‌ వద్ద వాపోయారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘ఎరువుల కోసం ఆందోళన వద్దు. రెండు.. మూడు రోజుల్లో యూరియా పంపనున్నాం. రైతులందరికీ పంపిణీ చేస్తాం. అధిక ధరకు విక్రయించినా, ఎవరైనా దుర్వినియోగం చేసినా వెంటనే సమాచారం ఇవ్వాల’ని తెలిపారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయశాఖ ఏడీఏ జగన్మోహన్‌రావు, సైంటిస్‌ మధుకుమార్‌ మాట్లాడుతూ.. ఎకరాకు గరిష్ఠంగా 75 కేజీల వరకూ యూరియా మూడు దశల్లో వినియోగించాలని సూచించారు. యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి సాధించవచ్చని తెలిపారు.

  • అనంతరం రెవెన్యూ మండల పరిషత్‌ సచివాలయ సిబ్బందితో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. రైతులకు యూరియాకు అందకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ‘బూరగాం ఆర్‌ఎస్‌కే పరిధిలో బూరగాం, సీతారాంపల్లి, బోరుభధ్ర గ్రామాల్లో 867 ఎకరాల్లో వరి సాగవుతోంది. ఇంతవరకు 19.98 టన్నుల(440 బస్తాలు) యూరియా సరఫరా చేశాం. ఇంకా 600 మంది రైతులకు యూరియా సరఫరా చేయాల్సి ఉంద’ని అధికారులు తెలిపారు. వ్యవసాయశాఖ, మండల పరిషత్‌, సచివాలయ సిబ్బంది మధ్య సమన్వయలోపంతో స్పష్టమైన వివరాలు చెప్పకపోవడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి వివరాలు తన కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహ సీల్దార్‌ నందిగాం ప్రసాదరావు, ఎంపీడీవో పి చంద్రకుమారి, మండల వ్యవసాయాధికారిణి కిరణవాణి, మండలప్రత్యేకాధికారి డా.మంచు కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

  • ఇదిలా ఉండగా వర్షాకాలంలో మహేంద్రతనయ నది దాటి తమ పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని బూరగాం రైతులు కలెక్టర్‌ వద్ద ఏకరువు పెట్టారు. వంతెన నిర్మించాలని కోరారు. దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Sep 10 , 2025 | 12:03 AM