Oh.. highway! : అమ్మో.. హైవే!
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:39 PM
Stagnant water when it rains చిన్న వర్షం పడితే చాలు జాతీయ రహదారిపై వరదనీరు నిలిచిపోతోంది. హైవే నిర్మాణంలో లోపాలు, పూర్తిస్థాయి నిర్వహణ లేకపోవడంతో వర్షాల సమయంలో చాలాచోట్ల రహదారులు జలదిగ్బంధం అవుతున్నాయి.
అస్తవ్యస్తంగా జాతీయ రహదారి నిర్వహణ
వర్షం పడితే నిలిచిపోతున్న నీరు
జలదిగ్బంధంలో సర్వీసు రోడ్లు
కాలువల నిర్వహణపై నిర్లక్ష్యం
తరచూ రోడ్డు ప్రమాదాలు
దృష్టి సారించని అధికారులు
వారం కిందట విజయనగరం జిల్లా భోగాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లావాసులు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బూర్జ నుంచి విశాఖకు కారులో వెళ్తుండగా హైవేపై నిలిచిన వర్షపు నీరు వచ్చి అద్దాలపై పడడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.
ఏడాది కిందట జిల్లాలోని పోలిపల్లి జంక్షన్ వద్ద హైవేపై జరిగిన ప్రమాదంలో ఓ ప్రముఖ బంగారం వ్యాపారి అల్లుడుతో పాటు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు తెల్లవారుజామున కారులో విశాఖ వెళ్తున్న సమయంలో వర్షం కురిసింది. పోలిపల్లి జంక్షన్ వద్ద హైవేపై ఉన్న వరద నీరు ఒక్కసారిగా కారుపై పడడంతో వాహనం అదుపు తప్పింది. డివైడర్ అవతలివైపు దూసుకెళ్లి ప్రమాదం జరిగింది.
లావేరు మండలం సుభద్రాపురం జంక్షన్ వద్ద చిన్నపాటి వర్షానికే జాతీయ రహదారి జల దిగ్బంధంలో చిక్కుకుంటోంది. లోతట్టు ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి వంతెన కిందన నిల్వ ఉండిపోతోంది. ఆ సమయంలో వాహన చోదకులు, ప్రయాణికులు పడే బాధలు వర్ణనాతీతం. అక్కడ హైవే వరద నీరును కాలువల్లోకి మళ్లించేందుకు సరైన ఏర్పాట్లు చేయలేదు. అందుకే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇటీవల శ్రీకాకుళం సమీపంలోని పెద్దపాడు వద్ద జాతీయ రహదారిపై సుమారు కిలోమీటరు మేర వరద నీరు నిలిచిపోయింది. రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైవే నిర్మాణ సమయంలో నిబంధనలు పాటించకపోవడంతో సమీపంలోని గెడ్డలు, వరద నీరు హైవేపై పోటెత్తుతుండడంతో తరచూ ఈ సమస్య తలెత్తుతోంది.
రణస్థలం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): చిన్న వర్షం పడితే చాలు జాతీయ రహదారిపై వరదనీరు నిలిచిపోతోంది. హైవే నిర్మాణంలో లోపాలు, పూర్తిస్థాయి నిర్వహణ లేకపోవడంతో వర్షాల సమయంలో చాలాచోట్ల రహదారులు జలదిగ్బంధం అవుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదురై.. హైవేపై ప్రయాణించేవారు, సమీపంలోని నివాసితులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో పైడిభీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకూ 196 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. పైడిభీమవరం నుంచి నరసన్నపేట వరకూ ఆరు వరుసలుగా 54 కిలోమీటర్ల రోడ్డు ఉంది. అక్కడ నుంచి ఇచ్ఛాపురం వరకు మాత్రం నాలుగు వరుసలుగా 85 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మధ్యలో రణస్థలం మండల కేంద్రంలో ఇప్పుడు ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. హైవేపై 30 వంతెనలు, 80 కిలోమీటర్ల మేర సైడ్ కాలువలు, సర్వీసు రోడ్లు ఉన్నాయి. అయితే, నిర్మాణ సమయంలో సరైన ప్రణాళిక, నిబంధనలు పాటించకపోవడంతో వర్షంపడితే హైవేపై, సర్వీసు రోడ్లపై ఎక్కడికక్కడే నీరు నిలిచిపోతోంది. ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు రావడం, అధికారులు హడావుడి చేయడం, తరువాత మరిచిపోవడం పరిపాటిగా మారిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
పర్యవేక్షణ కరువు..
జాతీయ రహదారుల నిర్వహణ బాధ్యతను టోల్ వసూలు చేసే కాంట్రాక్ట్ సంస్థలు చూడాలి. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. గతుకులు, గుంతలు ఉన్న ప్రాంతంలో మరమ్మతులు చేయాలి. మొక్కల పరిరక్షణ, విద్యుద్దీపాలంకరణ, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టడం వంటివి చేయాలి. కానీ, జిల్లాలో మాత్రం తూతూమంత్రంగా పర్యవేక్షణ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సర్వీసు రోడ్లకు ఇరువైపులా ఉన్న కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం లేదు. దీంతో వరద వెళ్లే మార్గం లేక సర్వీసు రోడ్లపై నీరు నిల్వ ఉండిపోతోంది. ఆ మార్గంలో వాహనాలు ప్రయాణించేటప్పుడు ఆ స్పీడ్‌కు వరద నీరు తుళ్లి పక్కనే హైవేపై వెళ్తున్న వాహనాలపై పడుతోంది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సమస్య తలెత్తిన చోట తాత్కాలికంగా పనులు చేపట్టి సంబంధిత కాంట్రాక్టు సంస్థలు చేతులు దులుపుకొంటున్నాయనే విమర్శలు ఉన్నాయి.
సక్రమంగా లేని కాలువలు..
రణస్థలం మండలం పైడిభీమవరం, కోష్ట, పతివాడపాలెం, నెలివాడ కూడళ్లలో ఫ్లైఓవర్ల వద్ద సర్వీసు రోడ్లను సక్రమంగా నిర్మించలేదు. ఇక్కడ కాలువలు కూడా సక్రమంగా లేవు. నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో వర్షపు నీరు పూర్తిగా నిలిచిపోతోంది. లావేరు మండలం సుభద్రాపురం జంక్షన్, ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస, చిలకపాలెం, కేశవరావుపేట, నవభారత్ జంక్షన్ వద్ద కూడా అదే పరిస్థితి. నరసన్నపేట మండల కోమర్తి, సింగుపురం జంక్షన్ వద్ద సైతం వరద నీరు పోటెత్తుతోంది. ఇంత జరుగుతున్నా హైవే అధికారులు తాత్కాలిక చర్యలతోనే సరిపెడుతున్నారు.
వెలగని విద్యుత్ దీపాలు
జాతీయ రహదారికి సంబంధించి 30 వంతెనల వద్ద, గ్రామాలకు వెళ్లే సర్వీసు రోడ్లు వద్ద దాదాపు 900 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి ఎల్‌ఈడీ దీపాలను అమర్చారు. ప్రారంభంలో ఇవి బాగానే వెలిగాయి. తర్వాత నిర్వహణ బాగా లేక వెలగడం లేదు. బుడుమూరు, సుభద్రాపురం, తాళ్లవలస, ఎచ్చెర్ల, శ్రీకాకుళం సింహద్వారం, పెద్దపాడు, సింగుపురం, మడపాం వద్ద పూర్తిస్థాయిలో విద్యుత్ లైట్లు వెలగడం లేదు. చాలాచోట్ల ఈ దీపాలకు సంబంధించి ఏర్పాటుచేసిన ఫ్యూజు బాక్సులు సైతం అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పటికైనా జాతీయ రహదారి విభాగం అధికారులు వంతెనలు, సర్వీసు రోడ్ల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, విద్యుత్ లైట్లు వెలిగేలా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఫిర్యాదు చేశాం..
జాతీయ రహదారి నిర్వహణకు సంబంధించి హైవే అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేశాం. అవసరమైతే కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలిసి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తాం. సర్వీసు రోడ్లు, కాలువల విషయమై మాట్లాడతాం. సత్వర చర్యలు చేపడతాం.
- కలిశెట్టి అప్పలనాయుడు, ఎంపీ, విజయనగరం