Share News

రొయ్యల చెరువులతో రోగాలు

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:08 AM

కళ్లేపల్లి పంచాయతీలోని రొయ్యల సాగు చెరువులతో తాము రోగాల బారిన పడుతున్నామని, వాటిని తక్షణమే తొలగించాలని పెద్దగణగళ్లవానిపేట గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

రొయ్యల చెరువులతో రోగాలు
ఆందోళన చేస్తున్న గ్రామస్థులుచేసిన గ్రామస్థులు

- తాగునీటి వనరులు కలుషితం

- వెంటనే వాటిని తొలగించండి

- పెద్దగణగళ్లవానిపేట వాసుల ఆందోళన

శ్రీకాకుళం రూరల్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కళ్లేపల్లి పంచాయతీలోని రొయ్యల సాగు చెరువులతో తాము రోగాల బారిన పడుతున్నామని, వాటిని తక్షణమే తొలగించాలని పెద్దగణగళ్లవానిపేట గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గ్రామ సచివాలయం వద్ద మంగళవారం ఎంపీటీసీ చీకటి అమ్మోజీరావు, నాయకుడు బర్రి రామారావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళ్లేపల్లిలో కొందరు రొయ్యల చెరువులను సాగు చేస్తూ వ్యర్థాలను మాత్రం పెద్దగణగళ్లవానిపేట సమీపంలోని నాగావళి నదికి ఆనించి ఉన్న సాగునీటి కాలువలో విడిచిపెడుతున్నారని ఆరోపించారు. దీనివల్ల భూగర్భజలాలు కలుషితమవుతున్నాయన్నారు. ఆ నీటిని తాగేందుకు, స్నానాలకు వాడడంతో తామర, దురదలతో పాటు మలేరియా, వంటి విషజ్వరాల బారినపడుతున్నామని వాపోయారు. నదీ జలాలు కూడా కలుషితం కావడంతో చేపలు దొరక్క స్థానిక మత్స్యకారులు వలసలు పోతున్నారని అన్నారు. చెరువుల కోసం రోడ్డు మీద ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లతో మనుషులు, పశువులు కరెంటు షాక్‌కు గురవుతున్నారన్నారు. రొయ్యల చెరువులు తొలగించాలని కోర్టు ఉత్తర్వరులు జారీ చేసినా జిల్లా అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా వాటిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ పుక్కల్ల కామయ్య, గ్రామస్థులు రామారావు, బర్రి కృష్ణ, పి.అప్పలస్వామి, అమ్మోజీ, అమ్మోరు, అప్పారావు, అశోక్‌, పాపారావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 12:08 AM