Share News

పుణ్యక్షేత్రాల సందర్శనలో అపశ్రుతి

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:14 AM

Road accident in Uttar Pradesh.. పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన జిల్లావాసులకు అపశ్రుతి ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన 16 మందికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే కేంద్రపౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పందించారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చొరవ చూపారు.

పుణ్యక్షేత్రాల సందర్శనలో అపశ్రుతి
పెద్దదూగాం వాసులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం..

జిల్లా వాసులకు గాయాలు..

స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

శ్రీకాకుళం/ కోటబొమ్మాళి/ పలాస రూరల్‌/ జలుమూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన జిల్లావాసులకు అపశ్రుతి ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన 16 మందికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే కేంద్రపౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పందించారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చొరవ చూపారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం జౌన్‌పుర్‌లో గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని పలాస, కోటబొమ్మాళి, బ్రాహ్మణతర్లాకు చెందిన 16మంది గాయపడ్డారు. స్థానికులు వారిని సమీప ఆస్పత్రులకు తరలించగా.. చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో కోటబొమ్మాళి గ్రామానికి చెందిన బోయిన ముత్యాలరావు, ఉషారాణి దంపతులు, జామి కిషోర్‌ ఉన్నారు. వీరు కొత్తపేట, బ్రాహ్మణతర్లా, పలాస, పార్వతీపురంలో ఉన్న బంధువులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లారు. మొత్తం 70మంది వెళ్లగా అందులో కొత్తపేట, కొటబొమ్మాళికి చెందిన 40మంది ఉన్నారు. వీరంతా కాశీ-వారణాసిలో తొమ్మిది రోజులు పూజలు చేశారు. అక్కడ నుంచి గురువారం ఉదయం మూడు వాహనాల్లో అయోధ్యకు పయనమయ్యారు. 16 మంది ప్రయాణిస్తున్న ఓ వాహనాన్ని ఉత్తరప్రదేశ్‌లో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 15 మందికి స్వల్పగాయాలయ్యాయి. బ్రాహ్మణతర్లాకు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని వారితో యాత్రకు వెళ్లిన కోటబొమ్మాళికి చెందిన లాడి వెంకటేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్‌లో తెలిపారు.

జలుమూరు మండలం పెద్దదూగాం గ్రామానికి చెందిన పొట్నూరు సత్యనారాయణ, సత్యవతి దంపతులకు కూడా గాయాలయ్యాయి. కోటబొమ్మాళికి చెందిన బంధువులతో కలిసి వీరిద్దరూ ఈ నెల 19న కాశీ పయనమయ్యారు. ప్రస్తుతం వైద్యసేవలు అందడంతో తాము క్షేమంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.

పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన పట్నాన వజ్రంమూర్తికి తలపై గాయాలు కాగా, ఆయన భార్య రమాదేవికి చేయి విరిగిపోయింది. ఈ దంపతులిద్దరూ ఈ నెల 18న పలాస నుంచి వారణాసికి రైలులో వెళ్లారు. అక్కడ గయా, ప్రయాగ, కాలభైరవ, అలహాబాద్‌ క్షేత్రాలను సందర్శించారు. వారణాసి నుంచి అయోధ్యకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వారి బంధువులకు సమాచారం అందడంతో ఆందోళన చెందుతున్నారు.

కేంద్రమంత్రి భరోసా

ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తక్షణ చర్యలు ప్రారంభించారు. ఢిల్లీ నుంచి క్షతగాత్రులను ఫోన్‌లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. జౌన్‌పుర్‌ కలెక్టర్‌, వారణాసి విమానశ్రయ అధికారులు, వైద్యులతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్యం మెరుగుపడుతోందని, వారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

ఈ ఘటనపై జిల్లాఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధితులతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరు.. క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, జిల్లా కలెక్టర్‌తోపాటు.. అయోధ్య, జౌన్‌పుర్‌ కలెక్టర్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Updated Date - Oct 31 , 2025 | 12:14 AM