Share News

విపత్తు.. సిక్కోలు వణుకు!

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:09 AM

Two or three storms a year తుఫాన్‌.. ఈ మాట వింటేనే సిక్కోలు వణికిపోతుంది. సువిశాల తీర ప్రాంతం జిల్లాకు వరమో.. శాపమో తెలియడం లేదు. తీరప్రాంత పరిరక్షణ, హార్బర్లు, జెట్టీల నిర్మాణం లేదు. అనుబంధ పరిశ్రమల ఏర్పాటు లేదు. కానీ బంగాళాఖాతానికి ఆనుకుని జిల్లా ఉండడంతో ఏటా రెండు, మూడు తుఫాన్ల ముప్పు తప్పడం లేదు.

విపత్తు.. సిక్కోలు వణుకు!
పెద్దగనగళ్లవానిపేటలో కోతకు గురైన తీరప్రాంతం

ఏటా రెండు, మూడు తుఫాన్లు

నాలుగేళ్లకోసారి తప్పని పెనుముప్పు

తీర ప్రాంతాల్లో పంటలకు అపార నష్టం

ఇచ్ఛాపురం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌.. ఈ మాట వింటేనే సిక్కోలు వణికిపోతుంది. సువిశాల తీర ప్రాంతం జిల్లాకు వరమో.. శాపమో తెలియడం లేదు. తీరప్రాంత పరిరక్షణ, హార్బర్లు, జెట్టీల నిర్మాణం లేదు. అనుబంధ పరిశ్రమల ఏర్పాటు లేదు. కానీ బంగాళాఖాతానికి ఆనుకుని జిల్లా ఉండడంతో ఏటా రెండు, మూడు తుఫాన్ల ముప్పు తప్పడం లేదు. ప్రతి నాలుగేళ్లకు ఓ పెను విపత్తు ప్రభావం చూపుతూనే ఉంటోంది. 1999లో సూపర్‌ సైక్లోన్‌ నుంచి 2018 తితలీ తుఫాన్‌ వరకూ ప్రతి విపత్తు జిల్లాను కోలుకోలేని దెబ్బతీసింది. ఫైలిన్‌, లెనిన్‌, హుద్‌ హుద్‌, తితలీ తుఫాన్లు జిల్లాకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. తాజాగా మొంథా తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. ఏడేళ్ల కిందట ఉద్దానంలో తితలీ తుఫాన్‌ సృష్టించిన ప్రళయంతో కొబ్బరి, జీడిచెట్లన్నీ నేలకొరిగాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ.. మొంథా తుఫాన్‌ రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 11 మండలాల్లో తీర ప్రాంతం 193 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. తుఫాన్‌ ప్రభావిత తీర గ్రామాలు 250వరకూ ఉన్నాయి. కాలుష్యం, భూతాపం పెరగడం, వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో భూమిపై ఏర్పడాల్సిన ఉపరితల ఆవర్తనాలు దిశ మార్చుకుంటున్నాయి. సముద్ర మట్టంపై విస్తరించి ఒకేసారి తీరంపై దాడి చేస్తున్నాయి. ఫలితంగా ఈదురుగాలులు, వర్షాలతో కొబ్బరికి, జీడి మామిడికి నష్టం వాటిల్లుతోంది. అంతర్‌ పంటగా వేసుకున్న పనస, అరటి, మునగ, కూరగాయలు, ఇతరత్రా పంటలకు నష్టం తప్పడం లేదు. తీర మండలాల పరిధిలో 1.80 లక్షల ఎకరాల వరికి, లక్ష ఎకరాలకుపైగా జీడి, కొబ్బరికి, 20 వేల ఎకరాల్లో సాగవుతున్న పనస, అరటి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వీటి ఆధారంగా జీవనోపాధి పొందుతున్న ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఆక్రమణలతో మరింతగా..

జిల్లాలో తీర ప్రాంతంలో అటవీ భూములు 14 వేల హెక్టారులు ఉన్నాయి. చిత్తడి నేలలు 8 వేల హెక్టారులు, ఉద్యానవన పరిధిలో వచ్చే జీడి, కొబ్బరి, మామిడి వంటివి 1.20 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. మరో 12 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. అయితే అటవీ శాఖ భూమి పూర్తిగా ఆక్రమణలకు గురవుతోంది. అటు చిత్తడి నేలల పరిరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయి. 5 వేల ఎకరాలు అక్రమార్కుల బారిన పడి జీడి, కొబ్బరి తోటలు వెలిశాయి. కొన్ని ప్రాంతాల్లో చేపల చెరువులను ఏర్పాటు చేశారు. సరుగుడు, మొగలి, తాటి చెట్లు తీరంలో లేకుండా పోతున్నాయి. దీంతో ఉష్ణతాపంతో అలల తీవ్రత పెరిగి తీరం కోతకు గురవుతోంది. తుఫాన్ల సమయంలో ఈదురుగాలులు నేరుగా తీరానికి తాకి భూభాగంపై వెళుతున్నాయి. అదే సమయంలో వర్ష తీవ్రత ఉంటే కొబ్బరి చెట్లు కూకటివేళ్లతో పెకిలించబడుతున్నాయి. ఉద్దానం గ్రామాలకు అపార నష్టం కలుగుతోంది.

అక్టోబరు అంటేనే హడల్‌

అక్టోబరు నెల వచ్చిందంటే చాలు ఉద్దానం వాసులు హడలిపోతారు. ఒకప్పుడు ఎటుచూసినా పచ్చని కొబ్బరిచెట్లతో మరో కోనసీమ మాదిరి ఉద్దానం ప్రాంతం కళకళాలాడేది. కానీ ఏటా తుఫాన్ల ప్రభావంతో ఆ పచ్చదనం కనుమరుగైపోతోంది. పెను తుఫాన్లు అక్టోబరులో సంభవిస్తుండడంతో.. ఈ నెల ఎప్పుడు పూర్తవుతుందా? అని ఉద్దానం రైతులు క్షణమొక యుగంగా గడుపుతారు. 1999లో ఏర్పడిన తుఫాన్‌ నుంచి 2018లో వచ్చిన తితలీ వరకు అన్నీ తుఫాన్లు అక్టోబరులోనే ప్రళయం సృష్టించాయి. కొబ్బరి, జీడి పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వేలాది కొబ్బరిచెట్లు నేలకూలాయి. వరిపంట ఈ ఏడాది పోయిందంటే మరో ఏడాది పండించుకునే అవకాశం ఉంటుంది. కానీ కొబ్బరిచెట్లు కూలిపోతే మళ్లీ కొత్తగా చెట్లు కాపునకు రావాలంటే పదేళ్లు వేచిచూడాల్సిందేనని రైతులు వాపోతున్నారు.

Updated Date - Oct 29 , 2025 | 12:09 AM