పాడిరైతుకు కష్టాలు
ABN , Publish Date - May 15 , 2025 | 12:01 AM
పాడిరైతు పీకల్లోతు కష్టాల్లో పడ్డాడు. పశుగ్రాసం నుంచి దాణా వరకూ అన్ని ధరలు పెరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
- చాకిరీ ఎక్కువ..ఆదాయం తక్కువ
- ప్రభుత్వ ప్రోత్సాహం అంతంత మాత్రమే
నరసన్నపేట, మే 14(ఆంధ్రజ్యోతి): పాడిరైతు పీకల్లోతు కష్టాల్లో పడ్డాడు. పశుగ్రాసం నుంచి దాణా వరకూ అన్ని ధరలు పెరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అప్పోసొప్పో చేసి అవన్నీ కొనిపెట్టినా, పితికిన పాలకు గిట్టుబాటు ధర రావడం లేదు. పోనీ పాడిని మరో రైతుకు అమ్ముకుందామన్నా అందరిదీ అదే పరిస్థితి. ఫలితంగా మరో మార్గంలేక కబేళాలకు తరలించి దళారులు ఇచ్చిన డబ్బును జేబులో వేసుకొని ఇక ఈ పశువులతో తమకు బంధం తెగిందని గుండె నిబ్బరం చేసుకుంటున్నాడు. పనికిరానివాడిని పోషించే కంటే నాలుగు పశువులను పెంచుకుంటే మేలన్నది ఒకప్పటి సామెత. ప్రస్తుతం ఈనానుడి రైతుల నోట భిన్నంగా వినిపిస్తుంది. పాడిపశువులను నమ్ముకునే కన్నా కూలి పనికి వెళితే బెటర్ అని అనుకుంటున్నారు. పశువులకు పెడుతున్న పెట్టుబడి, వాటికి చేస్తున్న చాకిరీతో పోల్చితే వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉందని పాడిరైతులు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితిలో గతంలో వలే పచ్చిక బైళ్లు కరువయ్యాయని, వ్యవసాయం కూడా బాగా తగ్గిందని అంటున్నారు. ఈ కారణంగానే పాడిపశువుల పెంపకంపై ఆసక్తి సన్నగిల్లుతోందని అంటున్నారు. పశు దాణా ధరలు పెరగడం, ప్రస్తుత యాంత్రీకరణతో పశుగ్రాసం లభించకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం అంతగా లేకపోవడం వంటి కారణాలతో పాడిపోషణ రైతులకు భారంగా మారింది.
ఐదు శాతానికి పైబడి తగ్గిన పాడి:
పశుగణన ప్రకారం జిల్లాలో 3,75,345 ఆవులు, గేదెలు ఉన్నాయి. వీటి ద్వారా 5.03 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి రోజువారి జరుగుతుంది. వేసవిలో పశుగ్రాసం కొరతతో పాల దిగుబడి 5శాతం వరకు తగ్గిందని పాడిరైతులు చెబుతున్నారు. ఎన్టీయే ప్రభుత్వం ఈ ఏడాది 50శాతం రాయితీపై పశు దాణా అందిస్తున్నా సరిపోవడం లేదని అంటున్నారు. రూ.4లక్షలు పెట్టుబడి పెడితే నాలుగు మేలైన పాడి ఆవులు వస్తున్నాయి. వీటిని మేపడానికి, చాకిరీ చేయడానికి ఇద్దరు మనుషులు ఉండాలి. ఈ ఆవుల ద్వారా రోజుకి రూ.800 ఆదాయం వస్తుంది. ఇందులో దాణాకు రూ.400, ఇద్దరు మనుషుల కూలి రూ.400పోగా రైతుకు ఏమీ మిగలడం లేదని చెబుతున్నారు.
గిట్టుబాటు ధర కల్పించాలి
చాలాకాలంగా మేము పాడిని నమ్ముకుంటూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నాం. గతంలో నాలుగైదు గేదెలు మేపేవాళ్లం. ప్రస్తుతం మూడు ఆవులు మాత్రమే మేపుతున్నాం. అవి కూడా అప్పులు చేసి కొన్నాం. ఈ పరిస్థితిలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లేక అప్పులు పాలవుతున్నాం. హామీలేని రుణాలు తక్కువ వడ్డీకి ఇస్తే బాగుంటుంది. పాలకు గిట్టుబాటు ధరను మరింతగా పెంచాలి.
- వెలమల రమణమ్మ, పాడిరైతు, జమ్ము
పాలధర రూ.60కు పెంచాలి
పాలఽ దర లీటరు రూ.60వరకూ పెంచాలి. పాలశీతల కేంద్రాలకు వెళ్లినప్పుడు సాంద్రత తక్కువగా ఉందన్న పేరుతో రూ.30 నుంచి 33 మధ్య ఇస్తున్నారు. నేను నాలుగు పశువులు పెంచుతున్నాను. ఇందులో చూడి సమయంలో రెండు పశువులు పాలివ్వడం ఆపేస్తాయి. ఇలాంటి సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అలాగే పాడిరైతులకు బ్యాంకులు ప్రత్యేక రుణాలు కల్పించాలి
-పొన్నాన ప్రసాదరావు, దూకలపాడు, పాడిరైతు
50శాతం రాయితీపై పశుదాణా
జిల్లాలో పాడిరైతులకు 50శాతం సబ్సిడీపై పశుదాణాను పంపిణీ చేస్తున్నాం. బస్తా రూ.1100 కాగా రూ.550కే అందిస్తున్నాం. జిల్లాలో 2,500 ఎకరాల్లో పశుగ్రాసం సాగు చేసేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇప్పటికి 500 ఎకరాలను గుర్తించి పాడి రైతులకు అవగాహన కల్పించాం. పాడిరైతులకు అండగా ఉండేందుకు గోకులాలు, ఇతర పథకాలను అమలు చేస్తున్నాం.
-రాజగోపాల్, జేడీ పశుసంవర్ధశాఖ, శ్రీకాకుళం