ఒక్కోచోట ఒక్కోరకంగా..
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:00 PM
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని మత్స్యకార గ్రామాల్లో ప్రజలందరికీ 50 కిలోల బియ్యం, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పంచదార, కందిపప్పు కిలో చొప్పున, నూనె ఒక ప్యాకెట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
- తుఫాన్ బాధిత గ్రామాల్లో రేషన్ పంపిణీలో వివక్ష
- మత్స్యకారులకు అందించి మిగతా వారికి ఇవ్వని వైనం
- కార్డుదారుల అసంతృప్తి
సోంపేట రూరల్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని మత్స్యకార గ్రామాల్లో ప్రజలందరికీ 50 కిలోల బియ్యం, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పంచదార, కందిపప్పు కిలో చొప్పున, నూనె ఒక ప్యాకెట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సరుకుల పంపిణీలో వివక్ష చోటుచేసుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కోచోట ఒక్కోరకంగా పంపిణీ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మత్స్యకార గ్రామాల్లో కేవలం మత్స్యకార కుటుంబాలకే బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేసి మిగతా కుటుంబాలకు ఇవ్వడం లేదని కార్డుదారులు అసంతృప్తి వ్యక్తచేస్తున్నారు. తాము కూడా చేపల వేట మీదే బతుకుతున్నామని, తమకు రేషన్ పంపిణీ చేయకపోవడం తగదని అంటున్నారు. జిల్లాలోని 11 మండలాల పరిధిలో ఉన్న 104 మత్స్యకార గ్రామాల్లో 26 వేల మంది లబ్ధిదారులకు 50కిలోల చొప్పున బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేయాలని అధికారులు జాబితా విడుదల చేశారు. ఈ మేరకు సోంపేట నియోజకవర్గంలో 9 రేషన్ డిపోల పరిధిలో 2,670 మందికి సరుకులు అందజేశారు. మందస మండలం గెడ్డూరులో అందరికీ ఇచ్చారు. ఇదే మండలం గంగువాడ, బేదాళపురంలో మత్స్యకార కులస్థులకే బియ్యం అందించి మిగతా వారిని విస్మరించారు. వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడులో 800 కార్డులు ఉంటే 60 మందికే పంపిణీ జరిగింది. ఇదే మండలం కంబాలరాయుడుపేటలో 75మందికి ఇచ్చారు. ఈ గ్రామంలో 40మందికి అనర్హులకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి సముద్ర తీర గ్రామాల్లో ఉన్న మత్స్యకారులే కాకుండా ఆ గ్రామాల్లో నివసిస్తున్న ఇతర కులాల వారు కూడా చేపల వేట ఆధారంగా బతుకుతున్నారు. వారితో పాటు వీరికి కూడా సమానంగా పథకం వర్తించే విధంగా అధికారులు ఆలోచనలు చేయాలి. అయితే, గతంలో మత్స్యకార భరోసా పొందుతున్న వారికే బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేసి, మిగిలిన వారిని పక్కన పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అందరికీ రేషన్ అందేవిధంగా చూడాలని మత్స్యకార ఐక్యవేదిక ప్రతినిధులు కోరుతున్నారు.