Share News

gold merchant missing: ప్రణాళిక ప్రకారమే.. కడతేర్చారా?

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:27 AM

The mystery of the missing gold merchant case నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి(కొరియర్‌) పొట్నూరు వెంకట పార్వతీశం గుప్త మిస్సింగ్‌ కేసు మిస్టరీ వీడనుంది. బంగారం కొనుగోలు నిమిత్తం గత నెల 26న కారులో విశాఖ వెళ్లిన ఈయన అదృశ్యమైన సంగతి తెలిసిందే. దీనిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేసి గుప్త హత్యకు గురైనట్టు నిర్ధారణకు వచ్చారు.

gold merchant missing: ప్రణాళిక ప్రకారమే.. కడతేర్చారా?
పొట్నూరు వెంకట పార్వతీశం గుప్త(ఫైల్‌)

వీడనున్న బంగారం వ్యాపారి మిస్సింగ్‌ కేసు మిస్టరీ

పోలీసుల అదుపులో కారుడ్రైవర్‌, స్నేహితుడు

మృతదేహం కోసం గాలింపు

నరసన్నపేట, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి(కొరియర్‌) పొట్నూరు వెంకట పార్వతీశం గుప్త మిస్సింగ్‌ కేసు మిస్టరీ వీడనుంది. బంగారం కొనుగోలు నిమిత్తం గత నెల 26న కారులో విశాఖ వెళ్లిన ఈయన అదృశ్యమైన సంగతి తెలిసిందే. దీనిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేసి గుప్త హత్యకు గురైనట్టు నిర్ధారణకు వచ్చారు. విశాఖలో గుప్త కొనుగోలు చేసిన రూ.2కోట్ల బంగారం బిస్కెట్లను తస్కరించేందుకు కారుడ్రైవర్‌ సంతోష్‌ పథకం రచించి.. పక్కా ప్రణాళిక కడతేర్చినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. విశ్వసనీయ సమచారం మేరకు.. గత నెల 26న విశాఖలో రూ.2కోట్ల విలువ చేసే బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసి గుప్త, డ్రైవర్‌ సంతోష్‌ తిరుగుముఖం పట్టారు. పెద్దపాడు వద్ద కారులో సాంకేతికలోపం ఉందంటూ.. పాలశీతల కేంద్రం వద్ద సర్వీసురోడ్డులోకి రూట్‌ మార్చారు. అక్కడ ముందస్తు ప్రణాళిక ప్రకారం డ్రైవర్‌ సంతోష్‌.. తన స్నేహితుడైన ఒక కారు డెకార్‌ యాజమానితో గుప్తను హతమార్చి రూ.2కోట్లు విలువ చేసే బంగారం కాజేశారని తెలుస్తోంది. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా అదేరోజు రాత్రి గుప్త మృతదేహాన్ని పెద్దపాడు- శ్రీకాకుళం కొత్తరోడ్డు మధ్య ఒక కాలువలో పడేసి.. ఎటువంటి అనవాళ్లు దొరకుండా జాగ్రత్తపడ్డారని సమాచారం.

ఆ రోజు డ్రైవర్‌ సంతోష్‌ కారును గుప్త ఇంటికి అప్పగించిన తరువాత.. కాజేసిన బంగారంలో 14 గ్రామలు నరసన్నపేటలో ఒక బంగారం షాపు యాజమాని వద్ద తాకట్టు పెట్టి రూ.1.40లక్షలు తీసుకుని తీర్థయాత్రలకు వెళ్లారు. గుప్త మిస్సింగ్‌ అయిన నాలుగు రోజుల తర్వాత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నరసన్నపేట పోలీసులు రంగంలోకి దిగారు. కారుడ్రైవర్‌ సెల్‌ఫోన్‌ కాల్స్‌పై దృష్టి సారించారు. గుప్త ఫోన్‌ ఆర్టీసీ బస్సులో దొరికినట్టు, ఆ ఫోన్‌ను గుప్త కుటుంబ సభ్యులకు అప్పగించిన వైనంపై పోలీసులు కూపీ లాగారు. ఈ వ్యవహారంలో ఇద్దరి పాత్ర ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. టోల్‌గేట్లు వద్ద గుప్త ప్రయాణించే కారు సీసీ పుటేజ్‌లు, సెల్‌ఫోన్లు సిగ్నల్స్‌ను పరిశీలించారు. తిరుగు ప్రయాణంలో గుప్త పెద్దపాడు వరకు వచ్చినట్లు సాంకేతికంగా ఆధారాలు లభ్యం కావడంతో కేసును ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. కారుడ్రైవర్‌ సంతోష్‌ను, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు గుప్త మృతదేహం కోసం గాలిస్తున్నారు. గురువారం పాత్రునివలస వద్ద రెండు కాలువల్లో గాలింపు చేపట్టారు. జెమ్స్‌ ఆసుపత్రి సమీపంలో ఓ మృతదేహం బయటపడగా.. తొలుత అది గుప్తదేనని పోలీసులు భావించారు. కొద్ది సమయం తర్వాత గుప్త మృతదేహం కాదని నిర్ధారించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, గుప్త మృతదేహం దొరికిన తర్వాత నిందితులను అరెస్టు చేస్తామని ఓ పోలీసు అధికారి తెలిపారు.

Updated Date - Sep 05 , 2025 | 12:27 AM