చిగురువలసలో ప్రబలిన అతిసారం
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:24 AM
సరుబుజ్జిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అతి సమీపంలో ఉన్న చిగురువలస గ్రామంలో అతిసారం ప్రబలింది.
ఒకరి పరిస్థితి విషమం
నేలబావి నీరే కారణమా?
సరుబుజ్జిలి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సరుబుజ్జిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అతి సమీపంలో ఉన్న చిగురువలస గ్రామంలో అతిసారం ప్రబలింది. ఒకే వీధికి చెందిన సముద్రాల కృష్ణారావు, కలగట లక్ష్మి, బొమ్మల గణేష్, చెన్నూరు లక్ష్మి, బండి కృష్ణమ్మ అతిసారంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సరుబుజ్జిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది. గ్రామంలో మరో ఐదు ఆరుగురు అతిసార వ్యాధితో బాధపడుతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ముద్దాడ రవి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమదాలవలస 30 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత వారం రోజులుగా ఈ వ్యాధితో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని నేలబావి నీరే ఇందుకు కారణంగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో తాగునీటి వసతులు ఎన్ని ఉన్నప్పటికీ ప్రజలు సమీప పంట పొలాల్లో ఉన్న నేలబావి నీటినే వినియోగిస్తుంటారు. తక్షణమే అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై వైద్యాధికారి సాహితీ ప్రియదర్శిని వివరణ కోరగా.. ‘చిగురువలసలో కొంతమంది అతిసార వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించాం. వారికి వైద్యసేవలు అందిస్తున్నాం. ఇప్పటికే క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.’ అని తెలిపారు.