Dharmana: అనిశ్చితిలో ధర్మాన
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:52 PM
Ex Minister's future unclear మాజీమంత్రి, వైసీపీ కీలక నాయకుడు ధర్మాన ప్రసాదరావు ప్రసుత్తం అనిశ్చితిలో ఉన్నారు. ఇటీవల శ్రీకాకుళంలో నిర్వహించిన వైసీపీ జిల్లా విస్త్రృతస్థాయి సమావేశానికి ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ సీనియర్ నాయకులంతా హాజరయ్యారు. కానీ ఈ సమావేశానికి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు హాజరుకాలేదు.
వైసీపీ సమావేశానికి, కార్యక్రమాలకు దూరం
వ్యూహాత్మకంగానే మౌనం
తనయుడు కూడా స్తబ్దత పాటిస్తున్న వైనం
శ్రీకాకుళం, జూలై 6(ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి, వైసీపీ కీలక నాయకుడు ధర్మాన ప్రసాదరావు ప్రసుత్తం అనిశ్చితిలో ఉన్నారు. ఇటీవల శ్రీకాకుళంలో నిర్వహించిన వైసీపీ జిల్లా విస్త్రృతస్థాయి సమావేశానికి ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ సీనియర్ నాయకులంతా హాజరయ్యారు. వైసీపీ బలోపేతం దిశగా కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కానీ ఈ సమావేశానికి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు హాజరుకాలేదు. ఆయన కుమారుడు రామ్‌మనోహర్ నాయుడు కూడా గైర్హాజరయ్యారు. స్వయానా ధర్మాన అన్న, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ప్రసాదరావు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది.
పరిస్థితి ముందే ఊహించి..
2014 ఎన్నికల్లో వైసీపీ తరపున శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావు ఓటమి పాలయ్యారు. ఆ ఐదేళ్లు పార్టీ కార్యక్రమాల్లో ఆయన పెద్దగా పాల్గొనలేదు. 2019 ఎన్నికల్లో మళ్లీ అదేస్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కానీ, మొదటి రెండున్నరేళ్లు స్తబ్దత పాటించారు. తర్వాత మంత్రి పదవి లభించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జగన్‌ను కీర్తించడం... వైసీపీ కార్యక్రమాల్లో అయిష్టంగానే పాల్గొనేవారు. 2024 ఎన్నికల్లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన ఇంటికే పరిమితమైపోయారు. కొద్దినెలలు కిందట పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చిన జగన్‌ను కలిసేందుకు ధర్మాన వెళ్లారు. అంతే.. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో గానీ.. ఇటు జనంలోగానీ పాల్గొనలేదు. ఇప్పట్లో వైసీపీ నిలదొక్కుతుందా?.. అనే అనుమానంతో.. ముందస్తు వ్యూహంతో.. ఆయన అనిశ్చితిగా ఉంటున్నారు.
సొంత అన్న ధర్మాన కృష్ణదాస్ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, తమ్ముడు ధర్మాన ప్రసాదరావు కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం.. పైపెచ్చు.. జిల్లాకేంద్రమైన శ్రీకాకుళంలో ఆ స్థాయి వైసీపీలో మరో నాయకుడ్ని తయారు చేయకపోవడం.. ఇప్పుడు ఆపార్టీకి ఇబ్బంది కరపరిస్థితులు తెచ్చిపెట్టాయి. తనను కలిసిన వారితో ముచ్చట్లు తప్ప... పార్టీ కార్యక్రమాలు గురించి సైతం ధర్మాన పెద్దగా చర్చించట్లేదని సమాచారం. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఓ సర్పంచ్‌పై ఓటమి పాలవడం.. ఇప్పటికీ ధర్మాన జీర్ణించుకోలేకపోతున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
జిల్లా కేంద్రానికి... దిక్కేదీ?
కూటమి ఏడాది పాలనలో వైఫల్యాలను ఎండగట్టేలా వైసీపీ అధిష్ఠానం ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రతి నియోజకవర్గంలో మండలాల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో ప్రచారం చేయాలని మొన్న జిల్లా విస్తృతస్థాయిలో సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి.. ప్రభుత్వ తీరును ఎండగట్టాలని స్పష్టం చేశారు. కానీ ఈ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో పకడ్బందీగా.. ప్రజలను ఆకర్షించే విధంగా చేసే వ్యక్తి ఇప్పుడు కరువయ్యారు. ధర్మాన ప్రసాదరావు స్తబ్దత పాటించినా.. మరో వ్యక్తిని తయారుచేయలేదు. ధర్మాన ప్రసాదరావు అనుచరులుగా మెలిగినవారు సైతం మౌనం దాల్చుతున్నారు. ఇలా అయితే పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లగలమని కార్యకర్తలు అంతర్మథనం చెందుతున్నారు. వైసీపీకి జవసత్వాలు ఎలా సాధ్యమవుతాయని మదనపడుతున్నారు. మరో రెండున్నరేళ్లు తర్వాత అప్పటి పరిస్థితిని చూసి వైసీపీపై ఆశలు పెరిగితే పార్టీలో ధర్మాన యాక్టివ్ అవుతారని.. లేదంటే విరామం తీసుకుంటారని తాజా సమాచారం. అయితే ఇటీవల పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరిగింది. దీనిపై వివరణ లేదు.. ఖండించలేదు కూడాను. దీనిపై ధర్మాన ఎటువంటి స్పష్టత ఇస్తారనే చర్చ సాగుతోంది.