Share News

‘థర్మల్‌’ మహాధర్నా భగ్నం

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:33 AM

'Dharmal' agitation ‘థర్మల్‌’కు వ్యతరేకంగా ఉద్యమకారులు నిర్వహించ తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జెన్‌కో క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నట్టు ప్రచారం సాగుతోంది. దీనిని ఆయా ప్రాంతాల గిరిజనులతోపాటు మైదాన గ్రామాలకు చెందిన కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.

‘థర్మల్‌’ మహాధర్నా భగ్నం
ప్రధాన రహదారిపై బైఠాయించిన గిరిజనులు, ఉద్యమకారులతో మాట్లాడుతున్న డీఎస్పీ వివేకానంద

ఉద్యమకారులను అడ్డుకున్న పోలీసులు

పాలకొండ రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్‌

సరుబుజ్జిలి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ‘థర్మల్‌’కు వ్యతరేకంగా ఉద్యమకారులు నిర్వహించ తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జెన్‌కో క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నట్టు ప్రచారం సాగుతోంది. దీనిని ఆయా ప్రాంతాల గిరిజనులతోపాటు మైదాన గ్రామాలకు చెందిన కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. వారికి రాష్ట్ర ఆదివాసీ పరిషత్‌ సంఘం, కమ్యూనిస్టు పార్టీలు, రైతు సంఘం, ఇతర ప్రజా సంఘాల నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు. థర్మల్‌కు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా నిరసన ర్యాలీలు, ఉద్యమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం సరుబుజ్జిలి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహణకు పిలుపునిచ్చారు. కాగా, దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సోమవారం ఉదయానికే శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, పది మంది ఎస్‌ఐలు, పోలీసులు భారీగా మోహరించారు. సరుబుజ్జిలి తహసీల్దార్‌ కార్యాలయం నుంచి పాలకొండ రహదారిలో వివిధ ప్రాంతాల్లో నిఘా పెట్టారు. ఉద్యమ నాయకులను వివిధ చోట్ల ముందుగానే నిర్బంధించారు. అయినప్పటికీ వెన్నెలవలసకు చెందిన కొంతమంది గిరిజనులు పాలకొండ రహదారిలో సరుబుజ్జిలికి వస్తుండగా.. చిగురువలస జంక్షన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మహాధర్నాకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో వారు అక్కడే బైఠాయించి ఽథర్మల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పాలకొండ రోడ్డులో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పార్వతీపురం-వీరఘట్టం-రాజాం, పాలకొండ ప్రాంతాల నుంచి సరుబుజ్జిలి, హిరమండలం, పాతపట్నం, నరసన్నపేట, టెక్కలి, శ్రీముఖలింగం వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొద్దిసేపటి తర్వాత డీఎస్పీ ఆదేశాల మేరకు కన్వీనర్‌ సురేష్‌దొర రోడ్డుపై బైఠాయించిన వారికి నచ్చజెప్పారు. వారు ఆందోళన విరమించారు. కాగా.. మళ్లీ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో జిల్లా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కోనాడ మోహన్‌రావు తదితరులు సరుబుజిల్జి చేరుకున్నారు. థర్మల్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయొద్దంటూ తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం థర్మల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Updated Date - Oct 28 , 2025 | 12:33 AM