అడుగడుగునా భక్తుల నీరాజనం
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:02 AM
‘జై పైడిమాంబ..’ అంటూ భక్తుల నినాదాలు...మహిళల మంగళ హారతులు...పసుపు నీటితో పూజలు...ఇవీ పైడిమాంబ సిరిమాను చెట్టు తరలింపులో కనిపించిన దృశ్యాలు. అడుగడుగునా సిరిమాను చెట్టుకు నీరాజనాలు పలికారు.
సిరిమాను చెట్టుకు పూజలు
భారీ బందోబస్తు మధ్య తరలింపు
గంట్యాడ, సెప్టెంబరు 24(ఆంరఽధజ్యోతి): ‘జై పైడిమాంబ..’ అంటూ భక్తుల నినాదాలు...మహిళల మంగళ హారతులు...పసుపు నీటితో పూజలు...ఇవీ పైడిమాంబ సిరిమాను చెట్టు తరలింపులో కనిపించిన దృశ్యాలు. అడుగడుగునా సిరిమాను చెట్టుకు నీరాజనాలు పలికారు. ప్రతి కూడలిలో భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. కొండతామరాపల్లి గ్రామంలోని గుర్తించిన సిరిమాను చెట్టుకు బుధవారం ఉదయం 8.30 గంటలకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గొడ్డలితో గాట్లు పెట్టి సిరిమాను తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పూజారి వెంకటరావు సమక్షంలో సిరిమాను చెట్టును కోయడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అక్కడకి వచ్చిన వారికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మూడు గంటల సమయలో సిరిమాను చెట్టును విజయనగరం జిల్లా కేంద్రంలోని హుకుంపేటకు తరలించే ప్రక్రియ ప్రారంభించారు. నాటుబండ్లపై సిరిమాను చెట్టును తరలించారు. తామరాపల్లి నుంచి అయ్యన్నపేటకు వచ్చే ప్రతి కూడలిలో పెద్ద సంఖ్యలో మహిళలు హజరై పశుపు, కుంకుమ కలిపిన నీటిని బిందెలతో పోసి పూజలు చేశారు. మంత్రి శ్రీనివాస్ సమక్షంలో 17 వేల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. వివిధ కూడళ్లలో మండల టీడీపీ నాయకుల సమక్షంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బొత్స ఝూన్సీ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభధ్రస్వామి, అటవీ, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.