ఆలయాలకు భక్తుల తాకిడి
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:40 PM
కార్తీక బహుళ ద్వాదశిని పురస్కరించుకుని జిల్లాలోని పలు దేవాలయాలు ఆదివారం భక్తులతో కిటకిట లాడాయి. స్వామిని దర్శించుకున్నారు.
కార్తీక బహుళ ద్వాదశిని పురస్కరించుకుని జిల్లాలోని పలు దేవాలయాలు ఆదివారం భక్తులతో కిటకిట లాడాయి. స్వామిని దర్శించుకున్నారు.
శ్రీముఖలింగంలో..
జలుమూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగం ఆదివారం భక్తుల కోలాహలంతో కళకళలాడింది. కార్తీక బహుళ ద్వాదశి 4వ ఆదివారం పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీముఖ లింగేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఉదయం 10 గంటలకు ప్రత్యేక దర్శనం బారికేడ్లలో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండ తగలకుండా షామియానాలు వేశారు. జలుమూరు ఎస్.ఐ బి.అశోక్‌బాబు ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
శ్రీకూర్మానికి..
గార, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ శ్రీకూర్మనాథస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం సందర్భంగా ఉదయం నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. మొదగాలబీచ్‌లో వన సమారాధన అనంతరం తిరుగు ప్రయాణంలోనూ భక్తులు వచ్చారు.
కల్యాణోత్సవాలు ప్రారంభం
అంపోలు గ్రామంలోని అగస్తేశ్వరస్వామి ఆలయంలో శ్రీవల్లీ దేవ సేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి కల్యా ణోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో తొలిరోజు ఉదయం రుత్వికులు, వేద పండితులు ప్రత్యేక హోమాలు, ప్రత్యే క పూజలు నిర్వహించారు. బుధవారం సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసా దాలు స్వీకరిం చాలని వారు కోరారు.
ఘనంగా వృశ్చిక సంక్రమణం పూజలు
ఇచ్ఛాపురం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): వృశ్చిక సంక్రమం సందర్భంగా మండలంలోని ప్రధాన దేవాలయాల్లో సంక్రమణ పూజలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
మండపల్లిలో..
మండపల్లి గ్రామ దేవత గారపోలమ్మ అమ్మవారి ఆలయంలో వృశ్చిక సంక్రమణం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం అమ్మ వారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం 108 మంది మహిళలతో సామూహిక కుంకుమ పూజలు చేపట్టారు. చిన్నారుల కోలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
అయ్యప్ప మూలవిరాట్‌కు అభిషేకాలు
అయ్యప్పస్వామి పంచాయతన దేవాలయంలో ఆదివారం మూలవిరాట్‌కు అష్టాదశ అభిషే కాలు, ప్రత్యేక అలంకరణ, విశేష పూజ లు చేశారు. కృష్ణారెడ్డి గురు స్వామి ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలోని చిదంబరేశ్వర ఆలయ సింహద్వారం ప్రథమ వార్షి కోత్సవం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ నర్తు రామా రావు కోనేరు వద్ద అఖండ దీపారాధన చేశారు.